ఢిల్లీ ట్రాక్టర్ ర్యాలీలో హింసపై యోగేంద్ర యాదవ్
న్యూఢిల్లీ: ఢిల్లీలో మంగళవారం రైతులు చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీ హింసాత్మకంగా మారినందుకు తాను సిగ్గుపడుతున్నానని, దానికి తానే బాధ్యత తీసుకుంటున్నానని స్వరాజ్ ఇండియా అధ్యక్షుడు యోగేంద్ర యాదవ్ అన్నారు. ఆందోళనలో భాగంగా ఉన్నందున జరిగిన సంఘటనలకు నేను సిగ్గుపడుతున్నాను. దానికి నేనే బాధ్యత తీసుకొంటున్నా’ అని ఆయన అన్నారు. హింస ఏ రకమైన ఆందోళనపైనైనా తప్పుడు ప్రభావం చూపిస్తుంది. అది ఎవరు చేశారు, ఎవరు చేయలేదో నేను ఇప్పుడు చెప్పలేను. అయితే ప్రాథమికంగా చూస్తే మేము రైతు ఆందోళనకు దూరంగా పెట్టిన వాళ్లు చేసినట్లుగా కనిపిస్తోంది’ అని యాదవ్ ఓ టీవీ చానల్‌తో మాట్లాడుతూ అన్నారు. ‘ నిర్ణయించిన రూట్‌కే మనం కట్టుబడి ఉండాలని, దానినుంచి పక్కకు వెళ్లరాదని నేను నిరంతరంగా విజ్ఞప్తి చేస్తూనే ఉన్నా.
ఉద్యమం శాంతియుతంగా జరిగినప్పుడు మాత్రమే మేము విజయం సాధించగలుగుతాం’ అని కేంద్రం రూపొందించిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనకు మొదటినుంచీ మద్దతు ఇస్తున్న యాదవ్ చెప్పారు. సాగు చట్టాలను రద్దు చేయడంతో పాటుగా కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ గణతంత్ర దినోత్సవం నాడు ఢిల్లీలో రైతులు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. వేలాది మంది ఆందోళనకారులు పోలీసులతో ఘర్షణలకు దిగడంతో పాటుగా కొందరుఎర్రకోటబురుజులపైకి ఎక్కి రైతు జెండాను ఎగురవేయడం తెలిసిందే. దీంతో రెండు నెలలుగా ఢిల్లీ సరిహద్దుల్లో శాంతియుతంగా రైతులు చేస్తున్న ఆందోళనకు మాయని మచ్చ ఏర్పడింది.