శ్రీనగర్: జమ్మూ కశ్మీరు ప్రజలతో తనకు రక్త బంధం ఉందని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ప్రకటించారు. జమ్మూ కశ్మీరుకు రాష్ట్ర ప్రతిపత్తిని సాధించడమే తనకు, తన పార్టీకి ప్రాధాన్యతాంశమని ఆయన తెలిపారు. గురువారం నాడిక్కడ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి రాహుల్ ప్రసంగిస్తూ జమ్మూ కశ్మీరు, లడఖ్ ప్రజలకు వారి ప్రజాస్వామిక హక్కులను తిరిగి సాధించడమే కాంగ్రెస్ లక్షమని అన్నారు. జమ్మూ కశ్మీరుకు రాష్ట్ర ప్రతిపత్తి పునరుద్ధరించాలని ఇండియా కూటమి ఎప్పటి నుంచో డిమాండు చేస్తోందని ఆయన చెప్పారు.
అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఇది జరుగుతుందని తాము ఆశించామని, అయితే ఎన్నికల ప్రకటన వెలువడింది కాబట్టి ఇది తొలి అడుగుగా భావిస్తున్నామని ఆయన అన్నారు. 2014 తర్వాత మొదటి సారి అసెంబ్లీ ఎన్నికలు జరుపుకుంటున్న జమ్మూ కశ్మీరు ప్రజలు ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవడం ద్వారా విద్వేషపూరిత మార్కెట్‌లో ప్రేమ దుకాణాలను తెలరవాలంటూ తన భారత్ జోడో న్యాయ యాత్ర నినాదాన్ని ఆయన గుర్తు చేశారు.జమ్మూ కశ్మీరు ప్రజలను తాను ప్రేమిస్తున్నానని, తనకు వారితో చాలా పాత సంబంధాలు, ఒక విధంగా రక్త బంధం ఉందని రాహుల్ వ్యాఖ్యానించారు.
భారత్‌లో స్వాతంత్య్రం తర్వాత చాలా కేంద్ర పాలిత ప్రాంతాలు(యుటిలు) రాష్ట్రాలుగా మారాయని, కాని ఒక రాష్ట్రం యుటిగా మారడం భారతదేశ చరిత్రలో ఇదే మొదటిసారని ఆయన అన్నారు. జమ్మూ కశ్మీరు ప్రజలకు ప్రాతినిధ్యం వహించడం తమకు ముఖ్యమని, తాను దేశమంతటా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తానని, కాని జమ్మూ కశ్మీరు ప్రజలలో ఏర్పడిన వేదనను తొలగించడమే తన లక్షమని ఆయన అన్నారు. తాను చేస్తున్నది రాజకీయ ప్రకటన కాదని కూడా ఆయన వ్యాఖ్యానించారు. జమ్మూ కశ్మీరుతో తనకు రక్త సంబంధం ఉందంటూ రాహుల్ వ్యాఖ్యానించడం ఇది మొదటిసారి కాదు. 2012 అక్టోబర్‌లో కార్గిల్ నుంచి కశ్మీరు లోయకు సొరంగ మార్గానికి శంకుస్థాపన జరిగిన సందర్భంగా రాహుల్ ప్రసంగిస్తూ తాను కశ్మీరీనని, జమ్మూ కశ్మీరు ప్రజలతో తనకు జీవితాంతం అనుబంధం ఉంటుందని అన్నారు.
ఎన్నికల పొత్తుకు సిద్ధం: ఖర్గే
జమ్మూ కశ్మీరు అసెంబ్లీ ఎన్నికలకు ముందుగానే భావసారూప్యంగల పార్టీలతో ఎన్నికల పొత్తు పెట్టుకోవడానికి తాము సిద్ధమని కాంగ్రెస్ అద్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే వెల్లడించారు. రాహుల్ గాంధీతో కలసి శ్రీనగర్‌లో పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఖర్గే మాట్లాడుతూ ఎన్నికల సన్నద్ధత, పొత్తులపై పార్టీ కార్యకర్తలు, నాయకుల అభిప్రాయాలను తెలుసుకోవడానికి తాము ఇక్కడకు వచ్చామని తెలిపారు. ఎన్నికల పొత్తు పట్ల రాహుల్ గాంధీ ఆసక్తిగా ఉన్నారని ఆయన చెప్పారు. ఇతర పార్టీలతో కలసి ఎన్నికలను సమైక్యంగా ఎదుర్కోవాలని రాహుల్ భావిస్తున్నారని, ఇలా చేయడం ద్వారా లోక్‌సభలో విజయం సాధించామని ఆయన గుర్తు చేశారు. సంపూర్ణ మెజారిటీతో అధికారంలోకి రాకుండా ఒక నియంతను ఇండియా కూటమి కట్టడి చేయగలిగిందని, ఇదే ఇండియా కూటమి సాధించిన అతి గొప్ప విజయమని ఖర్గే అన్నారు.
ఎన్‌సి నాయకత్వంతో భేటీ
జమ్మూ కశ్మీరు అసెంబ్లీ ఎన్నికల కోసం ఎన్నికల పొత్తు కుదుర్చుకునే ప్రయత్నంలో భాగంగా మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ గురువారం శ్రీనగర్‌లో నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్‌సి) అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా, ఉపాధ్యక్షుడు ఓమర్ అబ్దుల్లాతో సమావేశమయ్యారు. పార్టీ కార్యకర్తలతో సమావేశం ముగిసిన వెంటనే ఖర్గే, రాహుల్ నేరుగా ఫరూఖ్ అబ్దుల్లా నివాసానికి చేరుకున్నారు. ఎన్నికల పొత్తు కుదుర్చుకునే సాధ్యాసాధ్యాలపై ఇరు పార్టీల నాయకులు సంప్రదింపులు జరుపుతున్నారని కాంగ్రెస్ నాయకుడు ఒకరు తెలిపారు.