వ్యాక్సినేషన్ ద్వారా చావుల్ని నిరోధించగలం
అమెరికా సర్జన్ జనరల్ డా॥ వివేక్‌మూర్తి
వాషింగ్టన్: కొవిడ్19 వల్ల తన కుటుంబానికి చెందిన 10 మందిని కోల్పోయానని అమెరికా సర్జన్ జనరల్ డా॥ వివేక్‌మూర్తి తెలిపారు. ఇండియన్‌అమెరికన్ అయిన మూర్తి రెండోసారి ఆ దేశ సర్జన్ జనరల్ పదవిని చేపట్టారు. వైట్‌హౌస్‌లో మీడియాతో మాట్లాడుతూ.. కరోనా వైరస్ నుంచి రక్షణ పొందేందుకు ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వ్యక్తిగతంగా తనకు కూడా కుటుంబసభ్యులను కోల్పోయిన బాధ ఉన్నదని ఆయన అన్నారు. వ్యాక్సిన్ ద్వారా అవి నివారించదగిన మరణాలని ఆయన అన్నారు. వ్యాక్సినేషన్‌కు అవకాశమున్న ప్రతి ఒక్కరూ దానిని ఉపయోగించుకోవాలని సూచించారు.
ఇద్దరు యువకులకు తండ్రినైన తాను నిబంధనలమేరకు తన పిల్లలకు వ్యాక్సినేషన్‌కు అవకాశం లేనందున,పెద్దవాళ్లమైన తాము టీకాలు వేయించుకోవడం ద్వారా రక్షణ కల్పించామన్నారు. దేశవ్యాప్తంగా కొవిడ్19 పేషెంట్లకు చికిత్స అందిస్తున్న డాక్టర్లు, నర్సులతో తాను ప్రతివారం మాట్లాడుతున్నానని మూర్తి తెలిపారు. వారిచ్చిన సమాచారంమేరకు వ్యాక్సిన్ తీసుకోనివారే కరోనా బారిన పడుతున్నట్టు గుర్తించానన్నారు. వ్యాక్సినేషన్‌పై జరుగుతున్న తప్పుడు ప్రచారంపై పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. వైజ్ఞానికవర్గాల సమాచారాన్నే విశ్వసించాలని ఆయన సూచించారు. అమెరికాలో ఇప్పటివరకు 16 కోట్లమందికి వ్యాక్సినేషన్ పూర్తయిందని ఆయన తెలిపారు. అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ ద్వారా చిన్నారుల తల్లిదండ్రులకు వ్యాక్సినేషన్‌పై అవగాహన కల్పించే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఆరోగ్య విద్యను అభివృద్ధి చేయాలని విద్యా సంస్థలకు ఆయన సూచించారు.