నాగపూర్: అత్యంత దారుణమైన జైలు జీవితాన్ని గడిపినప్పటికీ సజీవంగా తాను జైలు నుంచి విడుదల కావడం ఆశ్చర్యంగా ఉందని ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా అన్నారు. గురువారం ఉదయం నాగపూర్ కేంద్ర కారాగారం నుంచి విడుదలయ్యారు. అభియోగాలను నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని స్పష్టం చేస్తూ ప్రొఫెసర్ సాయిబాబాకు విధించిన యావజ్జీవ కారాగార శిక్షను బాంబే హైకోర్టు మంగళవారం కొట్టివేసిన దరిమిలా సాయిబాబా జైలు నుంచి విడుదలయ్యారు. తాను సజీవంగా బయటకు వచ్చే అవకాశాలు లేనే లేవని విలేకరులతో మాట్లాడుతూ ఆయన వ్యాఖ్యానించారు. తన ఆరోగ్యం బాగాలేదని, తాను మాట్లాడే పరిస్థితిలో లేనని, ముందు వైద్య చికిత్స చేసుకోవలసి ఉందని, ఆ తర్వాతే మాట్లాడగలనని చెబుతూ విలేకరులతో మాట్లాడేందుకు ఆయన తొలుత నిరాకరించారు.
నడవలేని స్థితిలో వీల్ చెయిర్‌కే పరిమితమైన సాయిబాబా న్యాయవాదులు, విలేకరుల నుంచి వచ్చిన అభ్యర్థనలను దృష్టిలో పెట్టుకుని తన మనసు మార్చుకున్నానని తెలిపి అనంతరం విలేకరులతో మాట్లాడేందుకు అంగీకరించారు. త్వరలోనే డాక్టర్లను కలుస్తానని ఆయన చెప్పారు. తన ఎనిమిది సంవత్సరాల అత్యంత దుర్భరమైన జైలు జీవితాన్ని గుర్తు చేసుకుంటూ అది అత్యంత దారుణమైన, కఠినమైనదిగా అభివర్ణించారు. జైలులో తనకు ఏవీ అండుబాటులోలేవని ఆయన తెలిపారు. నా అంతట నేను లేచి నిలబడలేను..వీల్ చెయిర్ నుంచి కదలలేను..సొంతంగా టాయిలెట్‌కు వెళ్లలేను. స్నానం చేయలేను.. ఈరోజు నేను జైలు నుంచి ప్రాణంతో బయటపడడం ఆశ్చర్యంగా ఉంది.. అసలు నేను జైలు నుంచి విడుదలయ్యే అవకాశాలు లేనే లేవు అని ఆయన అన్నారు. తనపై బూటకపు కేసు నమోదు చేశారని ఆయన చెప్పారు.