Saturday, November 2, 2024

మాక్లూర్ సంఘటనను ఖండిస్తున్నాను: ఎంఎల్ఎ జీవన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

I strongly condemn the attack on the journalist:MLA Jeevanreddy

ఛలో ఆర్మూర్ కార్యక్రమాన్ని విరమించుకున్న టియుడబ్ల్యుజె

హైదరాబాద్: నా నియోజకవర్గంలో జర్నలిస్టుపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను.. ఈ చర్యకు పాల్పడిన వారికి శిక్ష పడాల్సిందే. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా తగు చర్యలు చేపడతానని నిజామాబాద్ జిల్లా టిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు, ఆర్మూర్ శాసనసభ్యులు ఏ.జీవన్‌రెడ్డి అన్నారు. ఆర్మూర్ పరిధిలోని మాక్లూర్ సాక్షి విలేఖరి పోశెట్టిపై టిఆర్‌ఎస్ కార్యకర్తలు ఇటీవల దాడి చేసిన విషయం విధితమే. ఈ సంఘటనపై తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(టియుడబ్ల్యుజె) జిల్లాలో ఆందోళన ఉధృతం చేసింది. ఈ నేపథ్యంలో ఎమ్యెల్యే జీవన్ రెడ్డి ఆదివారం లోయర్ ట్యాంక్‌బండ్‌లోని టియుడబ్ల్యుజె కార్యాలయంలో యూనియన్ బాధ్యులతో చర్చలు జరిపారు. ఐజెయు అధ్యక్షులు కె.శ్రీనివాస్‌రెడ్డి, టియుడబ్ల్యుజె రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ, సాక్షి నెట్‌వర్క్ ఇన్‌చార్జ్, హైదరాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు విజయ్‌కుమార్ రెడ్డిల సమక్షంలో జరిగిన ఈ చర్చల్లో యూనియన్ నిజామాబాద్ బాధ్యులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా విరాహత్‌అలీ మాట్లాడుతూ మూడు డిమాండ్లను ఎమ్యెల్యే ముందుపెట్టారు. పోశెట్టిపై దాడి జరిపి పైగా ఆయన పైనే తప్పుడు కేసు నమోదు చేయడం విచారకరమన్నారు. వెంటనే కేసును ఉపసంహరించు కోవాలని, పోశెట్టిపై దాడిచేసిన నిందితులపై నామమాత్రంగా కాకుండా హత్యాయత్నం కింద 307 కేసు నమోదు చేయాలని, భవిష్యత్తులో ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా భరోసానిస్తూ మీడియా ద్వారా హామీ ఇవ్వాలని ఆయన సూచించారు. ఈ మూడు డిమాండ్లపై జీవన్‌రెడ్డి సానుకులంగా స్పందించారు. వెంటనే చర్యలు చేపడతామని హామీ ఇవ్వడంతో ఫిబ్రవరి 2న, చేపట్టాల్సిన ఛలో ఆర్మూర్ కార్యక్రమాన్ని విరమించు కుంటున్నట్లు విరాహత్ అలీ ప్రకటించారు.

ఈ సందర్భంగా జీవన్‌రెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టులను ఎప్పుడూ గౌరవిస్తాను..-మాక్లూర్ సంఘటనను ఖండిస్తున్నానని వెల్లడించారు.తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనప్పటి నుంచి నేటి వరకు జర్నలిస్టులను నేను ఎంతో గౌరవిస్తున్నాను. ఈ స్థాయికి నేను చేరుకోవడానికి జర్నలిస్టు మిత్రులే ప్రధాన కారణమన్నారు. ఈ చర్చల్లో యూనియన్ జిల్లా అధ్యక్షుడు బొబ్బిలి నరసయ్య, కార్యదర్శి అంగిరేకుల సాయిలు, ఐజెయు జాతీయ కౌన్సిల్ సభ్యులు, నిజామాబాద్ జిల్లా సాక్షి బ్యూరో ఇన్‌చార్జి భద్రారెడ్డి, సాక్షి ఎడిషన్ ఇన్‌చార్జ్ ప్రభాకర్, యూనియన్ నాయకులు దేవిదాస్, పాకాల నర్సింహులు, ప్రమోద్, ప్రసాద్, మండే మోహన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News