ముంబై: న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్ డ్రాగా ముగియడం తనను ఎంతో నిరాశకు గురి చేసిందని టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ ఆవేదన వ్యక్తం చేశాడు. కాన్పూర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో విజయానికి ఒక వికెట్ దూరంలో నిలిచి పోవడం ఎంతో బాధించిందన్నాడు. ఆ మ్యాచ్‌లో చివరి వికెట్ తీసివుంటే సిరీస్ క్లీన్‌స్వీప్ చేసే అవకాశం దక్కేదన్నాడు. అయితే రెండో టెస్టులో రికార్డు విజయాన్ని అందుకోవడం గర్వంగా ఉందన్నాడు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమష్టిగా రాణించడం వల్లే ఘన విజయం సాధ్యమైందన్నాడు. ముంబైలో బౌలర్లు అద్భుతంగా రాణించారన్నాడు. రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌ను ఎంత పొగిడినా తక్కువేనన్నాడు. పిచ్ ఎలాంటిదైనా వికెట్లను తీయడం అతను అలవాటుగా మార్చుకున్నాడన్నాడు. అతనిలాంటి బౌలర్ దొరకడం టీమిండియా అదృష్టమన్నాడు. ఇక మయాంక్, గిల్, జయంత్, అక్షర్, సిరాజ్ తదితరులు కూడా జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారన్నాడు. రానున్న దక్షిణాఫ్రికా సిరీస్‌లో మరింత ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగేందుకు ఈ విజయం దోహదం చేస్తుందని ద్రవిడ్ ధీమా వ్యక్తం చేశాడు.