రాంచి: మనీలాండరింగ్ కేసులో తనను తప్పుగా ఇరికించి ఐదు నెలలు జైలులో ఉంచారని జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ శుక్రవారం ఆరోపించారు. జార్ఖండ్ హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో బిర్సా ముండా జైలు నుంచి విడుదలైన సోరెన్ అనంతరం విలేకరులతో మాట్లాడుతూ బిజెపిపై విరుచుకుపడ్డారు. రాజకీయ నాయకులు, సామాజిక కార్యకర్తలు, జర్నలిస్తుల గొంతును ప్రభుత్వం అణచివేస్తున్న తీరు చూసి తాను ఆందోళన చెందుతున్నానని ఆయన చెప్పారు.
తనకు వ్యతిరేకంగా ఒక కుట్ర జరిగిందని, తనను తప్పుడు కేసులో ఇరికించారని ఆయన చెప్పారు. ఐదు నెలలు జైలులో తనను నిర్బంధించారని ఆయన చెప్పారు. తాను న్యాయవ్యవస్థను గౌరవిస్తానని, కోర్టు తన తీర్పును వెలువరించించడంతో తాను విడుదలయ్యానని ఆయన చెప్పారు. అయితే న్యాయ ప్రక్రియ చాలా సుదీర్ఘమైనదని ఆయన అన్నారు. తాను చేస్తున్న పోరాటాన్ని కొనసాగిస్తానని, తన లక్ష్యాన్ని సాధిస్తానని ఆయన స్పష్టం చేశారు. భూ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులోజనవరి 31న హేమంత్ సోరెన్‌ను ఇడి అరెస్టు చేసింది.