హైదరాబాద్: తెలంగాణ భవన్ లో సిఎం కెసిఆర్ అధ్యక్షతన టిఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ముగిసింది. రెండున్నర గంటలపాటు కార్యవర్గ భేటీ కొనసాగింది. ఈ సందర్భంగా సిఎం మార్పు ఊహాగానాలపై కెసిఆర్ స్పష్టత ఇచ్చారు. పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని, తానే సిఎంగా ఉంటానని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి మార్పుపై ఎందుకలా మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. ఫిబ్రవరి 12 నుంచి సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంటుదని కెసిఆర్ పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గంలో 50వేల సభ్యత్వాలు చేయించాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు. నాగార్జునసాగర్ ఎన్నికల్లో ఘనవిజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
టిఆర్ఎస్ మేయర్ అభ్యర్థిని ఎన్నిక రోజే ప్రకటిస్తామని సిఎం తెలిపారు. సీల్డ్ కవర్ ద్వారా మేయర్ అభ్యర్థిని తెలియజేస్తామని వెల్లడించారు. కార్పొరేటర్లు పార్టీ బలపరిచిన అభ్యర్థికే ఓటు వేయాలని తెలిపారు. వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలతో పాటు ఎంఎల్ సి ఎన్నికల్లో టిఆర్ఎస్ అఖండ విజయం సాధించేందుకు పార్టీ శ్రేణులు అంకితభావంతో పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రంలో టిఆర్ఎస్ కు పోటీ ఎవరూ కాదని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో ఏ ఎన్నికలు వచ్చినా టిఆర్ఎస్ ఏకపక్షంగా విజయం సాధించడం ఖాయమని, దీని కోసం పార్టీ నాయకులు సమష్టిగా కృషి చేయాలని ఆయన కోరారు. టిఆర్ఎస్ మంత్రులు, ఎంఎల్ఎలు, ఎంఎల్ సిలు, కింది స్థాయి ప్రజాప్రతినిధులు అనునిత్యం ప్రజల మధ్య ఉంటూ వారికి అందుబాటులో ఉండాలని కెసిఆర్ స్పష్టం చేశారు.
I will be the CM for another ten years: CM KCR