Tuesday, December 24, 2024

సినీ కార్మికులకు ఆస్పత్రి కట్టిస్తా

- Advertisement -
- Advertisement -

I will construct Hospital in Chitrapuri Colony: Chiranjeevi

సామాజిక సేవా కార్యక్రమాల్లో మెగాస్టార్ చిరంజీవి ఎంతో చురుకుగా పాల్గొంటారు. ఇప్పటికే చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేసి అత్యవసర సమయాల్లో నిరుపేదలకు రక్తాన్ని అందిస్తున్నారు. ఇక చిరంజీవి ప్రతి పుట్టిన రోజుకి తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తుంటారు. అదేవిధంగా వ్యక్తిగతంగా మెగాస్టార్ సహాయ కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతూనే ఉంటాయి. ఈనెల 22న చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా సినీ కార్మికులకు చిరు గుడ్ న్యూస్ చెప్పారు. తన తండ్రి పేరిట కార్మికుల కోసం ఓ ఆసుపత్రిని నిర్మిస్తానని ప్రకటించారు. సెలబ్రిటీ క్రికెట్ కార్న్‌వాల్ ట్రోఫీ, జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా విచ్చేసిన చిరంజీవి ఈ వ్యాఖ్యలు చేశారు. “సినిమా తీయడంలో ఎంతో మంది శ్రమిస్తారు. అలాంటి కార్మికుల కోసం ఈ ఆసుపత్రి నిర్మాణానికి పూనుకున్నాను. కెరీర్ ఆరంభంలో ప్రతి ఒక్కరూ స్వార్ధంగా ఉండటం సహజమే. బాగా సంపాదించాలని..జీవితాంతం కష్టాలు లేకుండా ఉండాలనుకుంటారు. కానీ జీవితం ఒక దశకు వచ్చిన తర్వాత ఎదుటవారికి సహాయం చేయాలనే భావన కలుగుతుంది. కష్టాల్లో ఉన్నవాడి ఆకలి తీరినప్పుడు కలిగే సంతోషం అంతా ఇంతా కాదు. ఆ విషయం నాకు అనుభవ పూర్వకంగానే తెలిసింది. మొదట్లో నేను మంచి కార్లు..విదేశాలు తిరగాలి. కుటుంబాన్ని బాగా చూసుకోవాలి అనుకున్న వాడినే. అలాగే నా పారితోషికం పెరుగుతూ వచ్చింది. ఇవన్నీ నాకు వచ్చాయంటే ప్రేక్షకాభిమానులే కారణం. అందుకే వాళ్ల కోసం ఏదైనా చేయాలని బ్లడ్ బ్యాంక్ స్థాపించా. అది ఇప్పటికీ నడుస్తోంది. సినిమా సక్సెస్ అయినప్పటి కంటే ఎదుట వారికి సహాయం చేస్తే ఎక్కువ తృప్తిగా ఉంటుంది. ఇప్పుడు నేను సంతోషంగా ఉన్నానంటే దానికి కారణం సినీ పరిశ్రమే. అందుకే సినిమా కోసం శ్రమిస్తున్న సినీ కార్మికులకు చిత్రపురి కాలనీలో 10 పడక గదుల ఆసుపత్రి మా నాన్న గారు కొణిదెల వెంకట్రావు పేరుతో నిర్మిస్తానని మాటిస్తున్నా. వచ్చే ఏడాది నా పుట్టినరోజుకి ఈ ఆస్పత్రి సేవలు అందుబాటులోకి వస్తాయి. ఈ ఆసుపత్రి నిర్మాణంలో ఎవరైనా భాగస్వాములవుతానంటే సంతోషంగా ఆహ్వానిస్తా” అని అన్నారు.

I will construct Hospital in Chitrapuri Colony: Chiranjeevi

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News