కొందరు నేతలు ద్వేషపూరిత రాజకీయాలతో దేశాన్ని చీల్చాలని చూస్తున్నారు
బెంగాల్ సిఎం మమతా బెనర్జీ తీవ్ర ఆరోపణలు
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శనివారం సంచలన ఆరోపణలు చేశారు. కొందరు నాయకులు ద్వేషపూరిత రాజకీయాలు చేస్తూ దేశాన్ని విభజించే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. దేశంకోసం అవసరమైతే ప్రాణాలయినా ఇస్తాను కానీ ఎట్టిపరిస్థితుల్లోను దేశ విభజనను మాత్రం అనుమతించబోనని అన్నారు. శనివారం రంజాన్ సందర్భంగా కోల్‌కతాలోని రెడ్‌రోడ్‌లో జరిగిన నమాజ్‌లో దీదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి ఆమె మాట్లాడారు. ప్రజందరూ ఏకమై 2024 లోక్‌సభ ఎన్నికల్లో బిజెపిని గద్దె దించాలని ఆమె కోరారు.‘ కొందరు నాయకులు ద్వేషపూరిత రాజకీయాలు చేస్తూ దేశాన్ని విభజించే ప్రయత్నం చేస్తున్నారు.
దేశం కోసం ప్రాణాలైనా అర్పిస్తాను కానీ దేశ విభజనను మాత్రం అనుమతించను. రాష్ట్రంలో జాతీయ పౌరపట్టిక(ఎన్‌ఆర్‌సి)ను అనుమతించను. రాజకీయ ప్రత్యర్థులు, టిఎంసిపై విరుచుకుపడుతున్న కేంద్ర దర్యాప్తు సంస్థలతో గెలిచే వరకు పోరాడుతాను. అంతేకానీ ఎవరికీ తలవంచను. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. కాబట్టి మనమంతా ఐక్యంగా ఉండి విభజన శక్తులకు వ్యతిరేకంగా పోరాడుదాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోలేకపోతే సర్వనాశనం జరుగుతుంది’ అని తృణమూల్ అధినేత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో మమతా బెనర్జీ మేనల్లుడు, తృణమూల్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ కూడా పాల్గొన్నారు.
తృణమూల్ కాంగ్రెస్‌కు జాతీయ హోదా రద్దు చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 10న నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ పరిణామం తర్వాత మమతా బెనర్జీ కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు ఫోన్ చేసి ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారని బిజెపి నేత సువేందు అధికారి ఆరోపించారు. దీనిపై మమత స్పందిస్తూ తాను అమిత్‌షాకు ఫోన్ చేసినట్లు నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని సవాలు విసిరారు.తమ పార్టీ జాతీయ హోదా కోల్పయినప్పటికీ పార్టీ పేరు ఆలిండియా తృణమూల్ కాంగ్రెస్‌గానే ఉంటుందని స్పష్టం చేశారు. కాగా మమత వ్యాఖ్యలపై రాష్ట్ర బిజెపి అధికార ప్రతినిధి సమిక్ భట్టాచార్య స్పందిస్తూ ముఖ్యమంత్రి మతపరమైన కార్యక్రమాన్ని రాజకీయం చేయడానికి ప్రయత్నించారని విమర్శించారు.