Wednesday, January 22, 2025

నా రాజకీయం చూపిస్తా

- Advertisement -
- Advertisement -

గేట్లు ఓపెన్ చేశాం.. బిఆర్‌ఎస్ ఖాళీ అవ్వడం ఖాయం

మనతెలంగాణ/హైదరాబాద్ :ఇప్పుడు ఎన్నికల కోడ్ వచ్చిందని, ఇక నా రాజకీయం ఎలా ఉంటుందో చూపిస్తానని,అసలు కథ ముం దుందని సిఎం రేవంత్ అన్నారు. ప్రస్తుతానికి ఒక గేటు మాత్రమే ఓపెన్ చేశామని ఆయన కీలక వ్యాఖ్య లు చేశారు. ఇక ముందు ముందు ఎవరెవరు చేరుతారో ఇప్పుడే చెప్పలేమని ఆయన అన్నారు. విపక్ష పార్టీలో ఎవరూ లేనప్పుడు గేట్లు తెరిచినా మూసినా ఒక్కటే అన్నారు. 1948 సెప్టెంబర్ 17కు ఎంతో ప్రాముఖ్యత ఉందని, అలాగే 2023 డిసెంబర్ 3కు చరిత్రలో అంతే ప్రాముఖ్యత ఉన్నట్లు రేవంత్ చెప్పారు. 1948 సెప్టెంబర్ 17న నిజాం రాచరిక పాలన అంతమైందని, 2023 డిసెంబర్ 3న కెసిఆర్ పాలన అంతమైందని ఆయన తెలిపారు. తమ వారసులే అధికారంలో ఉండాలని నిజాం నవాబు కోరుకున్నారని, అభివృద్ధి చేశాను కాబట్టి తానే అధికారంలో ఉండాలనుకున్నారని రేవంత్ పేర్కొన్నారు. నిజాంను తరిమికొట్టిన చరిత్ర ఉన్న తెలంగాణ మళ్లీ అలాంటి రాజరిక పోకడలు అవలంభించిన కెసిఆర్‌కు బుద్ధి చె ప్పిందన్నారు. వారసత్వాన్ని తమపై రుద్దాలని చూసినప్పుడు తెలంగాణ సమాజం ఏకమైందని, ప్రజలు దానికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారని ఆ యన తెలిపారు. కెసిఆర్ కుటుంబాన్ని అధికారం నుంచి దించారని ఆయన చెప్పారు. కెసిఆర్‌కు ప్ర జాస్వామ్యంపై నమ్మకం లేదని, ఏనాడు ప్రజల స్వేచ్ఛను ఆయన గౌరవించలేదన్నారు. నయా నిజాంలా మారి తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలను కెసిఆర్ నాశనం చేశారని రేవంత్ ఫైరయ్యారు. గతంలో అభివృద్ధి, సంక్షేమం పేరుతో కెసిఆర్ రాచరిక పాలన చేశారని, ప్రజలు నిరసనలు చేయకుండా అడ్డుకున్నారని సిఎం దుయ్యబట్టారు. కెసిఆర్ పాలనలో తెలంగాణ నిర్బంధానికి గురైందని సిఎం అన్నారు. ఆదివారం బషీర్‌బాగ్‌లో ‘మీట్ ది మీడియాను’ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఇతర పార్టీల నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరడంపై కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలుస్తామని బిఆర్‌ఎస్, బిజెపి నేతలు పదే పదే అంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్లు ప్రభుత్వాన్ని పడగొడుతుంటే చూస్తూ ఊరుకుంటామా? అని సిఎం హెచ్చరించారు. కుక్కకాటుకు చెప్పు దెబ్బ అని పెద్దలు చెప్పారని, కొట్టకుం డా ఊరుకుంటామా? అని వ్యాఖ్యానించారు. తాము గేట్లు ఓపెన్ చేశామని ఇక బిఆర్‌ఎస్‌లో ఎవరూ ఉండరని ఆ పార్టీ మొత్తం ఖాళీ అవుతుందన్నారు. మా ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు కూడా పూర్తి కాకముందే బిఆర్‌ఎస్, బిజెపి నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. ఎన్నికల్లో ప్రజల తీర్పును గౌరవించకుండా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టాలన్న ఆలోచనతో బిఆర్‌ఎస్, బిజెపిలు చీకటి ఒప్పందంతో పనిచేస్తున్నాయని ఆయన ఆరోపించారు.
పిసిసి చీఫ్‌గా నేనేం చేస్తానో మీరే చూస్తారు…?
ఇన్నాళ్లు సిఎంగా చూశారూ, నేటి నుంచి పిసిసి చీఫ్‌గా నేనేం చేస్తానో చూస్తారంటూ సిఎం రేవంత్ సవాల్ చేశారు. పిసిసి చీఫ్‌గా పని మొదలు పెట్టిన గంటలోనే మీకు సమాచారం వస్తుందని ఆయన హెచ్చరించారు. పేపర్లు అమ్ముకున్నప్పుడు మాకేం సంబంధం అన్నారు, ఉద్యోగాలు ఇస్తే మేమే ఇచ్చామని హరీష్ అంటున్నాడు. దూలం లెక్క పెరగడం కాదు, దూడకు ఉన్నంత బుద్ది అయినా ఉండాలని హరీష్‌రావుపై సిఎం రేవంత్ మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్‌పై ఈటల రాజేందర్ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంతో విచారణకు ఆదేశాలు ఇప్పించాలన్నారు. చిల్లర మల్లర ఆరోపణలు చేయడం సరికాదని సిఎం రేవంత్ ఈటల రాజేందర్‌కు సూచించారు. మీ మోడీనే కదా ప్రభుత్వంలో ఉంది, విచారణ చేయించాలని ఈటల రాజేందర్‌కు సిఎం రేవంత్ సూచించారు. మాకు ఫోన్‌లు ట్యాపింగ్ చేయాల్సిన అవసరం లేదని సిఎం రేవంత్ అన్నారు. తాము పాలకులం కాదనీ, సేవకులం అని సిఎం రేవంత్ అన్నారు. పరిపాలనకు సంబంధించి గత ప్రభుత్వంలో నిషేధిత ప్రాంతాలైనా ప్రగతి భవన్, సచివాలయంలోకి ప్రజలు స్వేచ్ఛగా రావాలని ప్రగతి భవన్ ముందు ఉన్న ముళ్ల కంచెను బద్దలు కొట్టించి ప్రజలకు ప్రవేశం కల్పించామని ఆయన తెలిపారు. నేడు జ్యోతి రావు పూలే ప్రజాభవన్ ప్రజలకు ఓ వేదిక అయ్యిందన్నారు. మీడియాకు, ప్రజలకు సచివాలయంలో అనుమతి కల్పించామని ఆయన తెలిపారు. మేం పాలకులం కాదు.. సేవకులం అని నిరూపించడానికి విజ్ఞప్తులు వినే వేదిక కల్పిస్తున్నామని, ప్రజల సమస్యల పరిష్కారం చేస్తున్నామని రేవంత్ తెలిపారు. సంక్షేమానికి సంబంధించి దివంగత నేత వైఎస్‌ఆర్ నిర్ణయాలను కొనసాగిస్తూనే కొత్తగా ఆరు గ్యారంటీలు తీసుకొచ్చామన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించామని ఆయన గుర్తుచేశారు.
ప్రవీణ్‌కుమార్‌కు టిఎస్‌పిఎస్సీ చైర్మన్ ఆఫర్ ఇచ్చా
ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ బిఆర్‌ఎస్‌లో చేరనున్నారనే వార్తలపై సిఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ప్రవీణ్ కుమార్ బిఆర్‌ఎస్‌లో చేరతారని తాను అనుకోవడం లేదన్నారు. ప్రవీణ్ కుమార్ పట్ల తనకు గౌరవం ఉందన్నారు. ప్రవీణ్ కుమార్ సర్వీసులో ఉంటే డిజిపి అయ్యేవారని ఆయన చెప్పారు. అధికారంలోకి రాగానే ప్రవీణ్ కుమార్‌కు టిఎస్‌పిఎస్సీ చైర్మన్ ఆఫర్ ఇచ్చానని, కానీ, ఆయన దానిని తిరస్కరించారని రేవంత్ తెలిపారు. సమాజానికి ఇంకా ఏదో చేయాలన్న తపనతో ప్రవీణ్ కుమార్ ఉన్నారని సిఎం రేవంత్ చెప్పారు. ఇప్పుడు కెసిఆర్‌తో చేరితే దానిపై ఆయనే ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.
కెసిఆర్ నాటిన గంజాయి మొక్కలు పీకిపారేస్తున్నా
ప్రభుత్వంలో కొందరు అధికారులు కెసిఆర్ కోవర్టులుగా ఉన్నారని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. తులసివనం లాంటి తెలంగాణలో కెసిఆర్ కొన్ని గంజాయి మొక్కలు నాటి వెళ్లారని ప్రస్తుతం ఆ మొక్కలను ఏరిపారేసే పనిలో ఉన్నామని రేవంత్ చెప్పారు. తెలంగాణలో కెసిఆర్ నాటిన గంజాయి మొక్కలు అక్కడక్కడ ఉన్నాయని అవి రాష్ట్రంలో వాసనలు వెదజల్లుతున్నాయన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే చాలా వరకు వాటిని పీకిపారేశానని ఆయన చెప్పారు. రాష్ట్రంలో గంజాయి మొక్క లేకుండా చేస్తానని అందుకోసం రోజుకు 18 గంటలు పనిచేస్తున్నానని సిఎం అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవ్వరిపై కక్ష్య సాధింపు చర్యలు ఉండవని, తప్పు చేసిన అధికారులు, ప్రజాప్రతినిధులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని రేవంత్ చెప్పారు.
కెసిఆర్ కుటుంబం వేల కోట్ల అవితీకి పాల్పడింది
కెసిఆర్ కుటుంబం వేల కోట్ల అవితీకి పాల్పడిందని సిఎం రేవంత్ ఆరోపించారు. అక్రమార్కులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి కారణంగా రాష్ట్రంలో అనేక భూసమస్యలు నెలకొన్నాయన్నారు. వాటి పరిష్కరాలకు చర్యలు చేపట్టామని, గతంలో ప్రైవేట్ సంస్థ చేతిలో ధరణి పోర్టల్ ఉండేదని, ఇప్పుడు ప్రభుత్వం చేతిలోకి వచ్చిందని, 5 ఎకరాల లోపు ఉన్న వారికి రైతుబంధు పడిందని ఆయన చెప్పారు. తాము అధికారంలోకి వచ్చినప్పటికి ఏడాదికి చెల్లించాల్సిన అప్పు రూ. 64 వేల కోట్లు అని రేవంత్ తెలిపారు. కేంద్రంతో చిల్లర తగాదాలకు పోకుండా ముందుకెళ్తున్నామన్నారు. గవర్నర్ వ్యవస్థతో కూడా వివాదాలు కోరుకోవడం లేదని సిఎం రేవంత్ పేర్కొన్నారు.
భవిష్యత్‌లో రైతుభరోసా గుట్టలు, చెట్లు, లే ఔట్లకు ఇవ్వడం కుదరదు
రైతు భరోసాపై తెలంగాణ సిఎం రేవంత్ కీలక ప్రకటన చేశారు. భవిష్యత్‌లో రైతు భరోసా గుట్టలు, చెట్లు, లే ఔట్లకు ఇవ్వడం కుదరదని ఆయన చెప్పారు. ఇప్పటివరకు ఐదెకరాల లోపు ఉన్న దాదాపు 62 లక్షల మంది రైతులకు రైతు భరోసా అందించామన్నారు. రైతు భరోసా అందని వారు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. త్వరలోనే రైతు భరోసా లబ్ధిదారులకు అందేలా చూస్తామని సిఎం హామీ ఇచ్చారు. మరోసారి అక్రమంగా రైతు బంధు పొందిన వారికి రైతు బంధు ఇచ్చే ప్రసక్తి లేదని సిఎం రేవంత్ తెలిపారు. రైతుబంధు దుర్విని యోగాన్ని ఆపుతామన్నారు. అర్హులందరికీ ఇస్తామన్నారు. ఏ ప్రభుత్వ పథకం అందకపోయినా ప్రజలు దరఖాస్తు చేసుకోవాలన్నారు. గత సర్కారు అడ్డగోలుగా జీఎస్టీ మినహాయింపులు ఇచ్చింది. కేంద్రం నుంచి వచ్చే నిధులను సద్వినియోగం చేస్తామన్నారు.
వంద రోజుల్లో ప్రజాపాలన అందించాం
తాము అధికారంలోకి వచ్చాక వంద రోజుల్లో ప్రజాపాలన అందించామని సిఎం రేవంత్ అన్నారు. ప్రజలు స్వేచ్ఛ కోరుకొని కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారని ఆయన అన్నారు. ఇచ్చిన హామీల మేరకు గ్యారంటీలను అమలు చేస్తున్నామని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇప్పటివరకు 26 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేశారని 8 లక్షల కుటుంబాలు రూ.500 సిలిండర్ అందుకున్నాయన్నారు. 42 లక్షల కుటుంబాలు 200 యూనిట్ల విద్యుత్ పథకాన్ని పొందాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని కొందరు కావాలనే కరెంట్ బంద్ చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్కడక్కడ కరెంట్ తీస్తున్నారని మా దృష్టికి వచ్చిందని బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు చేస్తున్నామని, రాష్ట్ర సంస్కృతీ ఉట్టిపడేలా విగ్రహాన్ని రూపొందిస్తామని సిఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ధర్నా చౌక్ ను వద్దన్న వారు అక్కడే ధర్నా చేస్తే అనుమతిస్తున్నామన్నారు. కాళేశ్వరం కట్టానని, కళ్యాణలక్ష్మీ ఇచ్చానని చెప్పిన కెసిఆర్ ప్రజల స్వేచ్ఛను హరించారని, ధర్నాచౌక్ ను ఎత్తివేశారని రేవంత్ ఆరోపించారు. 75 ఏళ్ల తర్వాత డిసెంబర్ 3వ తేదీన తెలంగాణకు మరోసారి స్వాతంత్య్రం వచ్చిందన్నారు. తెలంగాణ సంస్కృతీని, వారసత్వాన్ని కెసిఆర్ నాశనం చేశారని రేవంత్ మండిపడ్డారు. ఉద్యమంలో పాడిన జయ జయహే తెలంగాణ పాటను కెసిఆర్ నిషేధించారని, కువులు, కళాకారులను గడిలో బంధించారని సిఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కెసిఆర్ జమానాలో నచ్చితే నజరానా- నచ్చకపోతే జరిమానా అన్నట్లుగా వ్యవహారించారని సిఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
తన్నీరు ఉన్నంత మాత్రాన పన్నీరు కాలేవు!
విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ శనివారం తమకు నోటీసులు ఇచ్చిందని రేవంత్ తెలిపారు. ముందుగా డబ్బు కట్టాకే జీరో విద్యుత్ బిల్లు ఇవ్వాలని అందులో పేర్కొందని సిఎం రేవంత్ చెప్పారు. ముందుగా సబ్సిడీ చెల్లించాకే జీరో బిల్లు ఇవ్వాలని కమిషన్ చెబుతుందన్నారు. ఆ మేధావికి తాను చెప్పదలచుకున్నది ఒకటేనని, రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చినప్పుడు ఈ ఆదేశం ఎందుకు ఇవ్వలేదని సిఎం రేవంత్ ప్రశ్నించారు. నీ ఇంటి పేరు తన్నీరు శ్రీరంగారావు ఉన్నంత మాత్రాన నువ్వు పన్నీరు కాలేవని, ఈ తెలివితేటలు మానాలని చెబుతున్నానని రేవంత్ ఈఆర్‌సి చైర్మన్ తన్నీరు శ్రీరంగారావుకు సూచించారు. రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చినప్పుడు తన్నీరుకు ఆ తెలివిలేదా అని సిఎం రేవంత్ ప్రశ్నించారు. తన్నీరు గుర్తు పెట్టుకో నువ్వు ఆ కుర్చీలో ఎక్కువ రోజులు ఉండవని రేవంత్ హెచ్చరించారు.
తెలంగాణకు ప్రపంచంతోనే పోటీ
తమకు పోటీ ఎపి, కర్ణాటకతో కాదని, తమ పోటీ ప్రపంచంతోనేనని సిఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. పెట్టుబడిదారులకు సమాన అవకాశాలు కల్పిస్తామని రేవంత్ తెలిపారు. దావోస్ పర్యటనతో రూ.వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ఆయన గుర్తు చేశారు. సంక్షేమం, అభివృద్ధి రెండింటికీ సమాన ప్రాధాన్యం ఇస్తున్నామని ఆయన తెలిపారు. స్థూలంగా రూ.8 లక్షల కోట్ల రుణభారం తెలంగాణపై ఉందన్నారు. రాష్ట్రం వచ్చిన మొదట్లో ఏడాదికి చెల్లించాల్సిన అప్పులు రూ.6 వేల కోట్లు ఉంటే, ఇప్పుడు రాష్ట్రం చెల్లించాల్సిన అప్పులు ఏడాదికి రూ.64 వేల కోట్లు ఉన్నాయని ఆయన వివరించారు. రాష్ట్రాన్ని నడిపించడానికి ప్రతి నెల రూ.11 వేల కోట్లు కావాలని, కేంద్రంతో చిల్లర తగాదాలకు వెళ్లమని ఆయన పునరుద్ఘాటించారు. పదవుల పంపకంలో సామాజిక న్యాయం పాటిస్తున్నామని సిఎం రేవంత్ తెలిపారు. సామాజిక న్యాయం విషయంలో మమ్మల్ని వేలెత్తి చూపలేరన్నారు. గత సర్కారు రూ.వేల కోట్ల అక్రమాలకు పాల్పడిందని, గత సర్కారు అక్రమాలపై విచారణకు ఆదేశించామని సిఎం రేవంత్ తెలిపారు. పారదర్శకంగా విచారణ జరుగుతుందని, బాధ్యులపై చర్యలు తప్పవన్నారు. జీఓలు దాచి పెట్టాల్సిన అవసరం లేదన్నారు. అన్నీ ప్రజల ముందు ఉంచుతామన్నారు.
నిపుణుల సలహా మేరకు చర్యలు
కాళేశ్వరంపై నిపుణులు సలహా మేరకు చర్యలు ఉంటాయని సిఎం రేవంత్ పేర్కొన్నారు. తాము 80 వేల పుస్తకాలు చదవలేదన్నారు. పదవి పోవడమే బిఆర్‌ఎస్ వాళ్లకు పెద్ద శిక్ష అన్నారు. అమర వీరుల స్థూపం దగ్గర రాళ్లతో కొట్టే సూచన ఏదైనా సూచన చేస్తారా..? అని ఆయన ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత రియల్ ఎస్టేట్ ఊపందుకుంటుందని ఆయన తెలిపారు. ఎన్నికల సమయంలో ఒడిదుడుకులు ఉంటాయన్నారు. ఆ వ్యాపారం చేసే వాళ్లకు ఆ విషయం తెలుసన్నారు

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News