Monday, January 20, 2025

చిమ్మచీకట్లో ..ఆకాశమంత ఎత్తులో

- Advertisement -
- Advertisement -

కార్గిల్ ఎయిర్‌స్ట్రిప్‌పై మరో మైలురాయి

వాయుసేన బాహుబలి ల్యాండింగ్, సరిహద్దు భద్రతలో కీలక ఘట్టం

టెర్రయిన్ మాస్కింగ్ తో విన్యాసం

న్యూఢిల్లీ : భారత వాయుసేన మరో విజయం సాధించింది. అత్యంత కటుతరమైన ప్రాంతాలుండే కార్గిల్ పర్వత ప్రాంతాల వైమానిక మార్గం ఎయిర్‌స్ట్రిప్‌పై తొలిసారి సి 130 జె విమానాన్ని దింపింది. ఈ ల్యాండింగ్ రాత్రివేళ నిర్వహించడం , అందులోనూ భారతీయ వాయుదళ రవాణా యుద్ధ నౌక బాహుబలి సి 130 జె ని రాత్రివేళ ఇక్కడ అత్యంత సురక్షితంగా కిందికి దింపడం దేశ సరిహద్దుల రక్షణ భద్రతా క్రమంలో మైలురాయి అయింది. వాయుసేనకు చెందిన గరుడో కమాండోలు జరిపిన విన్యాసాలలో భాగంగా ఇటీవల జరిగిన ప్రక్రియ విజయవంతం అయిందని అధికారవర్గాలు తెలిపాయి. ఈ సైనిక విమానానికి నాలుగు టర్బోప్రాప్ ఇంజిన్లు ఉన్నాయి. ఇప్పుడు రాత్రిపూట క్లిష్టమైన ప్రాంతంలో ఈ ల్యాండింగ్‌ను నిర్వహించినట్లు సామాజిక మాధ్యమాలలో వాయుసేన తెలిపింది. మంచు కురిసే సమయం, కన్నుపొడుచుకున్నా కానరాని ప్రాంతంలో టెర్రైన్ మాస్కింగ్‌ను వినియోగించుకుని ఈ విన్యాసం జరిపి విజయం సాధించారు.

వాయుసేనకు చెందిన సి 130 జె సేవలలో తిరుగులేనిది. ఉత్తరాఖండ్‌లో ఇటీవల సొరంగంలో చిక్కుపడ్డ కూలీల రక్షణలో కీలకపాత్రపోషించింది. అప్పుడు వాయుసేన రెండు సి 130 జెలను రంగంలోకి దింపింది. ఉత్తరాఖండ్ ఎయిర్‌స్ట్రిప్‌పై విజయవంతంగా అత్యంత క్లిష్టమైన వాతావరణ పరిస్థితులలో నేలకు దింపారు. సాధారణంగా పర్వతప్రాంతాలలోని ఎయిర్‌స్ట్రిప్‌పై విమానాల ల్యాండింగ్ అత్యంత క్లిష్టమైన ప్రక్రియ అవుతుంది. ప్రతిది అంచనావేసుకుని, క్లిష్టతర పరిస్థితులను అధిగమించుకుని, మానవ యంత్ర సమన్వయంతో వ్యవహరించి ల్యాండింగ్‌కు దిగాల్సి ఉంటుంది. కార్గిల్ ప్రాంతంలో ఇప్పుడు ఈ యుద్ధ విమానం అత్యంత వ్యూహాత్మక స్థావరంలో ల్యాండింగ్ కావడంతో అనివార్య అవాంఛనీయ పరిస్థితులలో వాయుసేన విమానాలు ఇక్కడికి వెంటనే చేరుకుని శత్రువులను ఎదుర్కొనేందుకు అనువైన పరిస్థితిని కల్పిస్తాయి. ఈ క్రమంలో ఇప్పుడు జరిగిన పరిణామం దేశ సరిహద్దుల భద్రతా చర్యలలో అత్యంత కీలకం అని రక్షణ వర్గాలు తెలిపాయి.

కార్గిల్ ఎయిర్‌స్ట్రిప్ దాదాపుగా 16,700 అడుగుల ఎత్తున ఉంటుంది. సరిహద్దులలో మరింతగా భద్రతా వ్యవస్థ బలోపేతానికి రక్షణ మంత్రిత్వశాఖ ప్రణాళికలు రూపొందించుకుంది. పాకిస్థాన్ సరిహద్దుల్లోని నియంత్రణ రేఖ వెంబడి ఉండే అత్యంత కీలకమైన కార్గిల్ ఎయిర్‌స్ట్రిప్ వద్ద ఈ విమానం ల్యాండింగ్ జరిగింది. వ్యూహాత్మక భద్రతా చర్యల ప్రాంతాలలో వాయుసేన సర్వంసన్నద్ధతను పరీక్షించుకునే విన్యాసాల క్రమంలో ఇప్పుడు ఈ ల్యాండింగ్ జరిగింది. ఈ ప్రాంతంలోని దౌలత్ బేగ్ ఓల్డీ ఎఎల్‌జి ప్రాంతంలోని ఈ ఎయిర్‌స్ట్రిప్ ప్రపంచంలోనే అతి ఎతైన ఎయిర్‌ఫీల్డ్‌గా పేరొందింది. ఈ ప్రాంతంలో శీతాకాలంలో ఉష్ణోగ్రతలు దాదాపుగా మైనస్ 40 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోతాయి. ఈ ప్రాంతం భారతదేశపు భద్రతకు అత్యంత ఆయువుపట్టు వంటిది. ఇటు పాకిస్థాన్ అతిక్రమణలు, అటు చైనా దురాక్రమణల ప్రతిఘటనకు పెట్టని కోటగా ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News