Friday, December 27, 2024

జీ20 వేళ సరిహద్దుల్లో వాయుసేన యుద్ధ విన్యాసాలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: జీ20 సదస్సు మరికొన్ని రోజుల్లో ఢిల్లీలో ప్రారంభం కానున్న నేపథ్యంలో చైనా, పాక్ సరిహద్దుల్లో భారత్ దళాలు భారీగా యుద్ధ విన్యాసాలను సోమవారం నుంచి మొదలు పెట్టాయి. వీటిలో వాయుసేనకు చెందిన రఫేల్ ఫైటర్ విమానాలు ఎస్400, ఎంఆర్‌ఎస్‌ఎఎం, స్పైడర్ వంటి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు పాల్గొన్నాయి. దీంతోపాటు ఆర్మీ ప్రత్యేక ఫార్మేషన్స్‌తో డ్రిల్స్ చేస్తోంది. త్రిశూల్ పేరిట చేపట్టిన ఈ గగనతల యుద్ధ విన్యాసాలను సెప్టెంబర్ 4 నుంచి 14 వరకు నిర్వహిస్తామని రక్షణశాఖ వర్గాలు ఓ ఆంగ్ల పత్రికకు వెల్లడించాయి.

ఈ నెల 8 నుంచి 10 వరకు జీ20 సదస్సు జరగనున్న విషయం తెలిసిందే. ఈ యుద్ధ విన్యాసాల కోసం పాకిస్థాన్, చైనా సరిహద్దుల్లో వాయుసేన తన ఆయుధాలు, కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌ను మోహరించింది. ఇది న్యూఢిల్లీకి భద్రత కల్పించే గగనతల రక్షణ వ్యవస్థతో సమన్వయం చేసుకొంటూ పనిచేస్తుంది. ఇప్పటికే దేశ రాజధాని చుట్టుపక్కల భారీగా వాయుసేన తన వనరులను మోహరించింది. వీటిలో భాగంగా ఢిల్లీ వద్ద రఫేల్, మిరాజ్ 2000 విమానాలు కాంబాట్ ఎయిర్ పెట్రోల్స్(సీఏపీ ) నిర్వహిస్తున్నాయి. దీనికి తోడు యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ గన్స్, ఆకాశ్, ఎంఆర్‌ఎస్‌ఏఎంలు మోహరించారు.

వీటితోపాటు అవాక్స్ వ్యవస్థలు పహారా కాస్తూ గగనతలాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్నాయి. కొన్ని కీలక ప్రదేశాల్లో యాంటీడ్రోన్ వ్యవస్థలను కూడా సిద్ధం చేశారు. ఓ పక్క వాయుసేన త్రిశూల్ విన్యాసాలు నిర్వహిస్తుండగా, మరోవైపు ఆర్మీ లద్దాఖ్ ప్రాంతంలో ప్రత్యేకంగా ట్రైనింగ్ ఎక్స్‌ర్‌సైజ్‌లను నిర్వహిస్తోంది.
ప్రపంచం లోని అగ్రనేతలు హాజరవుతున్న జి20 శిఖరాగ్ర సదస్సు ప్రాంతంలో గగనతల రక్షణ బాధ్యతలను వాయుసేన స్వీకరించిన విషయం తెలిసిందే. ఇటీవల కాలంలో ఈ స్థాయిలో ప్రపంచ నేతలు హాజరయ్యే సదస్సు జరగడం ఇదే తొలిసారి. 1983లో చివరిసారిగా భారత్ దాదాపు 70 మంది ప్రపంచ నాయకులకు ఆతిథ్యం ఇస్తూ నామ్ సదస్సు నిర్వహించింది. ఆ తర్వాత భారీ సదస్సులు ఏమీ జరగలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News