బెంగళూరు: పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన తేలికపాటి యుద్ధ విమానం తేజస్ ట్విన్ సీటర్ తొలి విమానాన్ని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఎఎల్) భారత వాయుసేనకు అందజేసింది. బెంగళూరు లోని హాల్ ప్రధాన కార్యాలయంలో కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్‌భట్, ఎయిర్‌చీఫ్ మార్షల్ వీర్ చౌధరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. వాయుసేన శిక్షణ అవసరాలకు అనుగుణంగా ఇద్దరు కూర్చునేలా దీన్ని అభివృద్ది చేశారు. అత్యవసర సమయంలో పూర్తిస్థాయి యుద్ధ విమానంగా పనిచేసే సామర్థం తేజస్ ట్విన్ సీటర్‌కు ఉందని హాల్ తెలిపింది.
ఈ విమానాల్లో స్టాటిక్ స్టెబిలిటీ, క్వాడ్రాప్లెక్స్ ఫ్లైబైవైర్ ఫ్లైట్ కంట్రోల్, కేర్‌ఫ్రీ మేనోవరింగ్, ఆధునిక గ్లాస్ కాక్‌పిట్ , ఇంటిగ్రేటెడ్ డిజిటల్ ఏవియోనిక్స్ సిస్టమ్స్ అత్యాదునిక ఎయిర్‌ఫ్రేమ్ వంటి ఫీచర్లు ఉన్నాయని తెలిపింది. ఇలాంటి ఫీచర్లు కలిగిన యుద్ధవిమానాలు ప్రపంచంలో కొన్ని దేశాల వద్ద మాత్రమే ఉన్నాయని, తేజస్ రాకతో వాటి సరసన భారత్ కూడా నిలిచిందని వెల్లడించింది.