ఎయిర్‌ఫోర్స్ చీఫ్ వీఆర్ చౌదరి
న్యూఢిల్లీ : ప్రస్తుతం మారుతున్న భౌగోళిక, రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా స్వల్పకాలం పాటు జరిగే కఠినమైన ఆపరేషన్లకు వాయుసేన సిద్ధంగా ఉండాల్సిందేనని భారత వాయుసేనాధిపతి వీఆర్ చౌదరి పేర్కొన్నారు. ముఖ్యంగా స్వల్పకాలం పాటు జరిగే వేగవంతమైన యుద్ధాలకు సిద్ధం కావాల్సిన అవసరం ఉందని చెబుతూ తూర్పు లడఖ్‌లో కొనసాగుతున్న సంక్షోభాన్ని ఉదహరించారు. ఓ సెమినార్‌లో ఆయన ప్రసంగించారు. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని స్వల్ప వ్యవధిలో జరిగే శక్తివంతమైన తేలికపాటి ఆపరేషన్లకు భారత వాయుసేన సన్నద్ధంగా ఉందని, ఇలాంటి అధిక తీవ్రత కలిగిన సరికొత్త ఆపరేషన్లను కొనసాగించేందుకు వ్యూహరచనల్లో భారీ మార్పులు అవసరమని ఎయిర్‌చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరీ స్పష్టం చేశారు. ఇక ఉత్తర సరిహద్దుల వెంట దేశ భద్రతా సవాళ్లపై ఆయన మాట్లాడుతూ ఎటువంటి భద్రతా సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు వాయుసేన సిద్ధంగా ఉండాలని ఉద్ఘాటించారు. ఈ సందర్భంగా తూర్పు లడఖ్‌ను ఉదహరిస్తూ ఏవైనా ఆకస్మిక పరిస్థితులు ఎదురైనప్పుడు మానవ వనరులు, సామగ్రిని వేగంగా తరలించే మార్గాలను రూపిందించుకోవాలన్నారు. భారత్ ఆత్మనిర్భరతను సాధించడంలో భాగంగా కీలకమైన పరికరాలను స్వదేశం లోనే అభివృద్ధి చేసుకునే కార్యాచరణ ప్రణాళిక పైనా దృష్టి సారించాలని సూచించారు.