న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించవలసిందిగా భారతీయు వాయు సేన(ఐఎఎఫ్)ను ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఆపరేషన్ గంగలో భాగంగా ఉక్రెయిన్ నుంచి భారతీయులను తరలించేందుకు పెద్ద సంఖ్యలో సి—17 విమానాలను ఐఎఎఫ్ సిద్దం చేస్తున్నట్లు వారు చెప్పారు. రష్యాతో యుద్ధం కారణంగా ఫిబ్రవరి 24 నుంచి ఉక్రెయిన్ గగనతలాన్ని విమానాలకు మూసివేయడంతో ఉక్రెయిన్‌కు పశ్చిమ దిశగా ఆనుకుని ఉన్న రొమేనియా, హంగేరి దేశాల నుంచి ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను ప్రైవేట్ విమానాల ద్వారా మాత్రమే ఇప్పటివరకు భారత ప్రభుత్వం తరలిస్తోంది. భారతీయులను తరలించే ప్రక్రియను వేగవంతం చేయడానికి ఆపరేషన్ గంగలో భాగస్వామ్యం కావలసిందిగా ఐఎఎఫ్‌ను ప్రధాని ఆదేశించినట్లు వర్గాలు తెలిపాయి.దీని వల్ల మరింత ఎక్కువ మంది భారతీయులను ఉక్రెయిన్ నుంచి వేగంగా తరలించడం సాధ్యపడుతుందని వర్గాలు పేర్కొన్నాయి. సి—17 విమానం ద్వారా ఉక్రెయిన్‌కు మానవతా సాయం కూడా అందచేసే అవకాశం ఉందని వారు తెలిపారు.