Saturday, February 22, 2025

అధికారులూ.. ప్రజల్లోకి వెళ్లండి

- Advertisement -
- Advertisement -

సిన్సియర్ అధికారులను గుర్తించి ప్రాధాన్యత
ఇస్తున్నాం రాజకీయ నాయకుల నిర్ణయాలపై
అధికారులు విశ్లేషణ జరపాలి కొందరు
శిక్షణలో ఉన్నప్పుడే సివిల్ పంచాయతీలు
చేస్తున్నారు ఒక్క తప్పుతో ఆపకుండా మూడు
తప్పులను ప్రోత్సహించేవాళ్లు ఉన్నారు
సిఎం రేవంత్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

కొందరు ఎసి గదులు వీడేందుకు ఇష్టపడట్లేదు

మన తెలంగాణ/హైదరాబాద్: ప్రస్తుతం ఐఏఎస్‌లు ఎసి రూంల నుంచి బయటకు రావడం లేదని సిఎం రేవంత్‌రెడ్డి అన్నారు. కొంతమంది అధికారులకు ఎసి జబ్బు పట్టుకుందని, బయట కాళ్లు కూ డా పెట్టడం లేదని, క్షేత్రస్థాయిలో ఏమీ జరిగిందో వారికి తెలియని పరిస్థితి నెలకొందని, దీనిపై తనకు అసంతృప్తి కలుగుతుందని సిఎం రేవంత్ వ్యాఖ్యానించారు. అలా అని అందరు అధికారులు లేరని, కొంతమంది అధికారులు మారుతున్నారని తెలిపారు. బేగంపేట్‌లోని ఐఏఎస్ ఆఫీసర్స్ ఇనిస్టిట్యూట్‌లో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎం.గోపాలకృష్ణ రచించిన ‘లైఫ్ ఆఫ్ కర్మయోగి’ పుస్తకాన్ని ఆదివారం సిఎం రేవంత్ అవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణారావు, ఇతర సీనియర్ ఐఏఎస్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ గోపాలకృష్ణ తన అనుభవాలను ఈ పుస్తకంలో నిక్షిప్తం చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఆరు దశాబ్దాల తన అనుభవాన్ని నిక్షిప్తం చేయడం పెద్ద టాస్క్ ఏదైనా కొనవచ్చని, కానీ, ఎక్స్‌పీరియన్స్ ను కొనలేమని, సివిల్ సర్వేంట్స్ అందరికీ ఈ పుస్తకం ఒక ది క్సూచిగా ఉంటుందని భావిస్తున్నానని సిఎం రేవంత్ తెలిపా రు. ఆనాటి నుంచి ఈనాటి వరకు దేశంలో వేగంగా జరిగిన మార్పులకు ఆయన ప్రత్యక్ష సాక్షి అని సిఎం పేర్కొన్నారు.

శంకరన్, శేషన్, మన్మోహన్‌సింగ్‌ల నిబద్ధత…

ఈసందర్భంగా ముగ్గురు వ్యక్తులను మనం గుర్తు చేసుకోవాలని సిఎం రేవంత్ తెలిపారు. అందులో శంకరన్, శేషన్, మన్మోహన్ సింగ్‌లు నిబద్ధతతో పనిచేశారని వారి సేవలను సిఎం రేవంత్ కొనియాడారు. గొప్ప అధికారి శంకరన్ అని, పారదర్శక ఎన్నికల నిర్వహణకు ఎంతో కృషి చేసిన గొప్ప వ్యక్తి శేషన్ అని సిఎం రేవంత్ అన్నారు. దేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి పథంలో నడిపిన వ్యక్తి మన్మోహన్ సింగ్ అని, ఆయన అనుభవాల నుంచి సివిల్ సర్వేంట్స్ ఎంతో నేర్చుకోవాల్సి ఉందన్నా రు. గతంలో అధికారులు, రాజకీయ నాయకులు అంశాలను ప్ర స్తావిస్తే అందులోని లోతుపాతులు, లాభ నష్టాలను వివరించేవారన్నారు. ్ల ఎందుకో అది తగ్గిపోయిందన్నారు.

నేటితరం అధికారులకు శిక్షణ ఇప్పించాలి

తాము అధికారంలోకి వచ్చాక నిబద్ధత కలిగిన అధికారులను వెతికి పట్టుకొని పోస్టింగ్ ఇస్తున్నామని సిఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులుగా తాము విధానపరమైన నిర్ణయాలు మాత్రమే తీసుకుంటామని కానీ, వాటిని అమలు చేసి విజయవంతం చేసే బాధ్యత అధికారులపైనే ఉంటుందన్నారు. అధికారుల వైఖరిలో కూడా మార్పు రావాలని, ప్రతిది నెగిటివ్ కోణంలో చూడకుండా పాజిటివ్ కోణంలో నిర్ణయాలు తీసుకోవాలని ఆయన హితవు పలికారు. నేటితరం అధికారులకు సీనియర్ ఐఏఎస్‌ల ద్వారా వారి అనుభవాలను, వాళ్లు ఎదుర్కొన్న సమస్యలపై శిక్షణా కార్యక్రమం ఇప్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఈ వేదిక నుంచి ఆదేశిస్తున్నానని సిఎం తెలిపారు.

నిబద్ధత కలిగిన అధికారులకు తప్పకుండా గుర్తింపు

సివిల్ సర్వేంట్స్ ఆలోచనలో, విధానంలో మార్పు రావాలని, నిబద్ధత కలిగిన అధికారులకు తప్పకుండా గుర్తింపు ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. పేదలకు సాయం చేయాలన్న ఆలోచన అధికారులకు ఉండాలని, అలాంటి వారే ప్రజల మనసులో ఎక్కువకాలం గుర్తుంటారని, ఆ దిశగా రాష్ట్రంలోని అధికారులు దృష్టి సారించాలని సిఎం రేవంత్‌రెడ్డి సూచించారు. ఈ రోజుల్లో సివిల్ సర్వేంట్స్ రాజకీయ నాయకులను తప్పుదోవపట్టించే విధంగా తయారయ్యారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తాము ఒక తప్పు చేద్దామంటే మూడు తప్పులు చేద్దామని ప్రోత్సహించే వాళ్లు తయారయ్యారని సిఎం రేవంత్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ నాయకులను సంతోషపెట్టడానికి తమను తప్పుదోవ పట్టించడానికి కూడా వారు వెనుకాడడం లేదని ఆయన వాపోయారు. పొలిటికల్ ఎగ్జిక్యూటీవ్స్‌కు సంబంధం లేని, అనుభవం లేని శాఖలకు మంత్రులుగా విధులు నిర్వహించాల్సి వస్తుందని అప్పుడు ఆయా రంగాల్లో అవగాహన కలిగించి సరైన పద్ధతిలో తీసుకురావడానికి వాళ్లు దోహదపడాలని ఆయన సూచించారు.

ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయవద్దు

కొంతమంది సివిల్ సర్వేంట్స్ శిక్షణలో ఉన్నప్పుడే స్టేషన్‌లలో డ్రెస్‌తో కూర్చొని సివిల్ పంచాయతీలు నిర్వహిస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు ఎప్పుడైనా నాయకులకంటే అధికారులనే ఎక్కువగా నమ్ముతారని సిఎం పేర్కొన్నారు. నాయకులు ఇప్పుడు ఉంటారు, పోతారు, కానీ, అధికారులు మాత్రం ప్రభుత్వాలు మారినా వారే ఉంటారనీ, అందుకే వారిపై ఎక్కువ నమ్మకం కలుగుతుందని, ఆ నమ్మకాన్ని వమ్ము చేయవద్దని సిఎం రేవంత్ సూచించారు.

అపెక్స్ బాడీకి చైర్మన్‌గా పనిచేసిన తొలి తెలుగువాడిని: గోపాలకృష్ణ

పుస్తక రచయిత గోపాలకృష్ణ మాట్లాడుతూ తన తల్లి తన తొలిగురువు అని ఆయన తెలిపారు. తాను ఐఏఎస్ అధికారిగా విధులు నిర్వహిస్తున్న క్రమంలో కూడా సలహాలు, సూచనలు ఇచ్చేవారని ఆయన పేర్కొన్నారు. ఎన్‌టిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అప్పుడు తాను కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్‌గా పనిచేశానని ఆయన తెలిపారు. ఒకరోజు ఎన్‌టిఆర్ స్వయంగా పిలిచి గోదావరి ఫెర్టిలైజర్ ముందుకు సాగడం లేదు, ఆ బాధ్యతలు తనకు అప్పగిస్తున్నానని ఎన్‌టిఆర్ తనతో చెప్పారన్నారు. ఆయన అప్పచెప్పిన బాధ్యతలను విజయపథాన నడిపించడంతో తనకు గోదావరి గోపాలకృష్ణగా పేరు వచ్చిందని ఆయన తెలిపారు. భావితరాల అధికారులు, సివిల్ సర్వేంట్స్‌కు ఉపయోగపడేలా మూడు పుస్తకాలు రచించానని అవి త్వరలో అందుబాటులోకి రానున్నాయని ఆయన తెలిపారు. అందులో మేనేజ్‌మెంట్ సూత్ర, మేనేజ్‌మెంట్ తంత్ర, గ్రోత్ ఆఫ్ ఎకానమీ పుస్తకాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 240 ప్రభుత్వ రంగ సంస్థల అజమాయిషీ చేసే అఫెక్స్ బాడీకి చైర్మన్‌గా తాను పనిచేశానని, ఆ పదవిని నిర్వహించిన తొలి తెలుగువాడిని తానేనని ఆయన పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News