కేంద్ర సర్వీసులో డిప్యూటేషన్ పూర్తి కావడంతో
సిఎం రేవంత్‌ను మర్యాద పూర్వకంగా కలిసి
రిపోర్టు చేసిన ఐఏఎస్ అధికారి
హైదరాబాద్: ప్రస్తుతం ఢిల్లీలోని ప్రధానమంత్రి కార్యాలయం (పిఎంఓ)లో డిప్యూటీ సెక్రటరీగా పనిచేస్తున్న ఐఏఎస్ అధికారి కాటా ఆమ్రపాలి తెలంగాణ రాష్ట్రానికి వచ్చేందుకు రంగం సిద్ధమైంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కార్యదర్శిగా (సిఎంఓ సెక్రటరీ)గా వస్తున్నట్లు సమాచారం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2010 బ్యాచ్‌కు చెందిన ఆమె రాష్ట్ర విభజన సందర్భంగా తెలంగాణ కేడర్‌కు అలాట్ అయ్యారు.
ఈమె గతంలో వరంగల్ జిల్లా కలెక్టర్‌గా పనిచేశారు. కాటా ఆమ్రపాలి 2018 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అదనపు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్‌గా కొంతకాలం పనిచేశారు. 2019 లోక్‌సభ ఎన్నికల తర్వాత సెంట్రల్ డిప్యూటేషన్‌పై ఢిల్లీ వెళ్లిన ఆమె తొలుత (2019 అక్టోబర్ 29వ తేదీ నుంచి) కేంద్ర కేబినెట్‌లో డిప్యూటీ సెక్రటరీగా దాదాపు ఏడాది కాలం పనిచేశారు.
ఆ తర్వాత (2020 సెప్టెంబరు 14న) పిఎంఓలో డిప్యూటీ సెక్రటరీగా చేరారు. ఇటీవల కేంద్ర సర్వీసులో ఆమె డిప్యూటేషన్ పూర్తి కావడంతో రాష్ట్ర సర్వీసులో చేరనున్నారు. ఈ క్రమంలోనే సిఎం రేవంత్ రెడ్డిని ఆమ్రపాలి మర్యాదపూర్వకంగా కలిశారు. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆమె రిపోర్ట్ చేశారు. కాగా, ఆమెకు రేవంత్ ప్రభుత్వంలో కీలక పదవి కట్టబెట్టే ఛాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తోంది.