అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వివాదాస్పద ప్రొబేషనరీ ఐఎఎస్ అధికారిణి పూజా ఖండ్కేర్ దోషిగా తేలితే ఆమెను సర్వీసుల నుంచి తొలగించవచ్చని అధికార వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. సివిల్ సర్వీసెస్ పరీక్షలో తన అభర్థిత్వాన్ని సంపాదించుకునేందుకు, అనంతరం సర్వీసులో ఎంపికయ్యేందుకు ఆమె సమర్పించిన పత్రాలు అన్నిటినీ కేంద్రం గురువారం నియమించిన ఏకసభ్య కమిటీ పునఃపరిశీలిస్తుందని వర్గాలు తెలిపాయి. ఆమె దోషి అని తేలితే ఆమెను ఉద్యోగం నుంచి తొలగించే అవకాశం ఉందని వారు చెప్పారు. తన ఎంపికకు ఆధారమైన పత్రాల విషయంలో ఆమె ఎటువంటి అక్రమాలకైనా పాల్పడినట్లు
తేలిన పక్షంలో ఆమె క్రిమినల్ చర్యలను కూడా ఎదుర్కోవలసి వస్తుందని వారు తెలిపారు. 2023 బ్యాచ్‌కు చెందిన ఇండియన్ అడ్మినేస్ట్రేటివ్ సర్వీసు(ఐఎఎస్) అధికారి అయిన పూజా ఖేడ్కర్ ప్రస్తుతం ప్రొబేషన్‌లో ఉన్నారు. ఆమె తన స్వరాష్ట్రం మహారాష్ట్రలో పోస్టింగ్ పొందారు. ఐఎఎస్‌లో పోస్టింగ్ పొందేందుకు ఆమె శారీరక వైకల్యాన్ని, ఓబిసి కోటాను దుర్వినియోగం చేసినట్లు ఆమెపైన ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపనలపై విచారణ చేపట్టి రెండు వారాలలో నివేదిక ఇవ్వాలని ఆదేశిస్తూ కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖలో అదనపు కార్యదర్శిగా ఉన్న మనోజ్ కుమార్ ద్వివేది నేతృత్వంలో ఏకసభ్య కమిటీని కేంద్రం ప్రభుత్వం గురువారం నియమించింది.