న్యూఢిల్లీ : వివాదాస్పద ఐఎఎస్ అధికారి షా ఫైజల్ ను కేంద్ర ప్రభుత్వం మళ్లీ పర్యాటక మంత్రిత్వశాఖలో డిప్యూటీ కార్యదర్శిగా నియమించింది. ఈమేరకు డిపార్టుమెంట్ ఆఫ్ పెర్సనల్ అండ్ ట్రయినింగ్ (డిఒపిటి రెండు రోజుల క్రితం ఉత్తర్వు జారీ చేసిందని సీనియర్ అధికారి తెలిపారు. ఇదివరకటి జమ్ముకశ్మీర్ కేడర్ 2010 బ్యాచ్ ఐఎఎస్ టాపర్ అయిన షాఫైజల్ ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ గోవామిజోరం కేంద్రపాలిత ప్రాంత కేడర్ ఐఎఎస్ అధికారిగా ఉంటున్నారు. 2019లో ఫైజల్ తన ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లో చేరారు. అయితే ఆయన రాజీనామాను కేంద్ర హోం శాఖ ఆమోదించలేదు. జమ్ముకశ్మీర్ పీపుల్స్ మూవ్‌మెంట్ (జెకెపిఎం) పార్టీని స్థాపించి కొన్నాళ్లు నడిపించారు. కశ్మీర్ ప్రత్యేక హోదా రద్దయిన తరువాత ప్రజా భద్రత చట్టం కింద కూడా ఆయన అరెస్టు అయ్యారు.
విడుదలైన తరువాత తాను తిరిగి సివిల్ సర్వీస్‌లో చేరతానని నాలుగు నెలల క్రితం పెట్టుకున్న దరఖాస్తును కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఆయనను సర్వీస్ లోకి తిరిగి తీసుకుంటున్నట్టు ఏప్రిల్ 28న కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనికి ఒక రోజు ముందు ఫైజల్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందిస్తూ “ 8 నెలల (జనవరి 2019 నుంచి ఆగస్టు 2019 ) ఉద్యోగ జీవితంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని, ఆ తర్వాత తన లక్షాన్ని చేరుకునే ప్రయత్నంలో స్నేహితులు, ఉద్యోగం, ప్రాతినిధ్యం, ప్రజావిశ్వాసం అన్నీ కోల్పోయానని పేర్కొన్నారు. తన భావజాలం తనను కొంత దెబ్బతీసినప్పటికీ తాను ఆత్మ విశ్వాసాన్ని కోల్పోలేదని వివరించారు. ఎదురు దెబ్బలు మనల్ని బలపరుస్తాయి. మరో అవకాశం ఎప్పుడూ విలువైందే. నాజీవితాన్ని తిరిగి ప్రారంభించడానికి ఎంతో ఉత్సాహంగా ఉన్నానని ఆయన ట్వీట్ చేశారు.