ఇటీవల బదిలీ వేటుకు గురైన ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ మరో సంచలన ట్వీట్ చేశారు. భగవద్గీతలోని “కర్మణ్యే వాధికారస్తే, మా ఫలేషు కదాచన” శ్లోకంతో ప్రారంభించి.. ‘పర్యాటకంలో 4 నెలలు పనిచేశా. నా వంతు కృషి చేశాను!. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న 25-30 పర్యాటక విధానాన్ని తీసుకువచ్చాను. ఇది రాష్ట్రానికి మొదటిసారి. నిర్లక్ష్యం చేయబడిన పర్యాటక ప్రాంతాలకు దిశను చూపేందుకు, పెట్టుబడులను ఆకర్షించేందుకు ఒక బలమైన పునాదిని సృష్టిస్తుంది. పర్యాటక శాఖ పని శైలిని పునరుద్ధరించాను. జవాబుదారీతనాన్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నించాను. లాజిస్టిక్స్ అండ్ ప్రణాళికకు పునాది వేశాను. ప్రపంచవ్యాప్త కార్యక్రమం కోసం.. ఇది ఖచ్చితంగా మరిన్నింటికి తలుపులు తెరుస్తుంది’ అని స్మితా ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.
కాగా, ప్రస్తుతం రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న స్మితా సబర్వాల్ పై రాష్ట్ర ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. ఆమెను ఫైనాన్స్ కమిషన్ కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇదిలావుంటే.. కంచ గచ్చిబౌలి భూముల వివాదంలో కొందరు ఏఐతో సృష్టించిన ఫేక్ ఫోటోను రీట్వీట్ చేయడంతో పోలీసులు స్మితా సబర్వాల్ కు నోటీసులు జారీ చేశారు. దీనిపై ఆమె స్పందిస్తూ.. తన లాగే 2 వేల మంది రీట్వీట్ చేశారని.. వారందరికీ కూడా ఇదే విధంగా ట్రీట్ చేస్తారా? అంటూ స్మితా ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.