రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్
హైదరాబాద్: రాష్ట్ర అభివృద్ధిలో ఐఏఎస్‌ల పాత్ర కీలకమని, పేదలకు, బలహీన వర్గాలకు చేయూతనందించేలా ఐఏఎస్‌లు తమవంతు పాత్రను పోషించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్ పేర్కొన్నారు. 2020 బ్యాచ్ తెలంగాణ కేడర్‌కు కేటాయించిన ఏడుగురు ఐఏఎస్ అధికారులకు సిఎస్ సోమేష్ కుమార్ వివిధ జిల్లాలకు అదనపు కలెక్టర్లు, స్థానిక సంస్థల పోస్టింగ్‌లను బుధవారం అందచేశారు. ఐఏఎస్ అధికారులు తమ జిల్లాల్లో బాధ్యతలు చేపట్టేముందు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌ను బిఆర్‌ఆర్‌కె భవన్‌లోని ఆయన ఛాంబర్‌లో మర్యాద పూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా వారిని ఉద్ధేశించి సిఎస్ సోమేష్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న వినూత్న కార్యక్రమాలను అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో ముందుకు తీసుకెళ్లాలని, ముఖ్యమంత్రి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని అధికారులకు ఆయన పిలుపునిచ్చారు. అర్భన్, రూరల్ స్థానిక సంస్థలకు సంబంధించిన అన్ని పథకాలు వారి సంబంధిత జిల్లాలలో మరింత సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు వాటి ప్రతిష్టాత్మకమైన లక్ష్యాలను పూర్తిగా సాధించేలా చూడాలని అధికారులకు ఆయన సూచించారు. ఒకటిన్నర సంవత్సరాల్లో ఐఏఎస్ అధికారులు 52 వారాల ఓరియంటేషన్, ప్రాక్టీకల్ శిక్షణను పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సీనియర్ ఐఏఎస్ అధికారులు అరవింద్ కుమార్, సందీప్ కుమార్ సుల్తానియా, వి.శేషాద్రి, రాహుల్ బొజ్జా తదితరులు పాల్గొన్నారు.