Wednesday, January 15, 2025

యుఎఇలో మహిళల టి20 ప్రపంచకప్

- Advertisement -
- Advertisement -

దుబాయి: ఊహించినట్టే జరిగింది. బంగ్లాదేశ్ వేదికగా జరగాల్సిన మహిళల టి20 ప్రపంచకప్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)కి తరలిపోయింది. ఈ వరల్డ్‌కప్‌నకు బంగ్లాదేశ్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. అయితే ఇటీవల బంగ్లాదేశ్‌లో తలెత్తిన రాజకీయ సంక్షోభం నేపథ్యంలో అక్కడ ప్రపంచకప్ నిర్వహించడం దాదాపు అసాధ్యంగా మారింది. దీంతో అంతర్జాతీయ క్రికెట్ మండలి వేదికను బంగ్లాదేశ్ నుంచి యుఎఇకి మార్చింది. అక్టోబర్ 3 నుంచి 20 వరకు ఈ టోర్నీ జరుగనుంది. భారత్‌తో సహా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ తదితర దేశాలు ఈ టోర్నీలో పాల్గొంటున్నాయి. కాగా, బంగ్లాదేశ్‌లో నెలకొన్న అనిశ్చితి వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకుని వరల్డ్‌కప్‌ను వేరే దేశానికి మార్చక తప్పలేదని ఐసిసి చీఫ్ ఎగ్జిక్యూటివ్ జెఫ్ అలర్‌డైస్ వెల్లడించారు.

బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు వరల్డ్‌కప్‌ను నిర్వహించలేమని స్పష్టం చేయడంతో తాము వేదికను మార్చాల్సి వచ్చిందని వివరించారు. భారత క్రికెట్ బోర్డును వరల్డ్‌కప్ నిర్వహించాలని ఐసిసి కోరిందని, అయితే బిసిసిఐ దీనికి సిద్ధంగా లేమని తెలిపిందని పేర్కొన్నారు. ఇలాంటి స్థితిలో శ్రీలంక, యుఎఇ క్రికెట్ బోర్డులతో తాము సంప్రదించామని తెలిపారు. దీనికి యుఎఇ క్రికెట్ బోర్డు అంగీకరించడంతో మెగా టోర్నమెంట్‌ను అక్కడికి మార్చమన్నారు. కాగా, సమీప భవిష్యత్తులో బంగ్లాదేశ్‌లో మరో ఐసిసి మెగా టోర్నమెంట్‌ను నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని జెఫ్ స్పష్టం చేశారు. బంగ్లాదేశ్ నుంచి వేదిక మరో చోటికి మారిపోవడంతో బిసిబికి భారీ నష్టం వాటిల్లిందన్నారు. అయితే ఈ నష్టాన్ని కొంత భరించేందుకు ఐసిసి సిద్ధంగా ఉందన్నారు.

ఉత్కంఠతకు తెర..
వరల్డ్‌కప్ వేదిక మారడంతో ఈ విషయంలో నెలకొన్న ఉత్కంఠతకు తెరపడింది. ఐసిసి మహిళల టి20 వరల్డ్‌కప్‌నకు యుఎఇ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ ఏడాది అక్టోబర్ 3 నుంచి 20 వరకు మెగా టోర్నీ జరుగనుంది. దుబాయితో పాటు షార్జా ఈ టోర్నీకి ఆతిథ్యం ఇవ్వనున్నాయి. గతంలో కూడా యుఎఇ వేదికగా పలు మెగా టోర్నమెంట్‌లు జరిగాయి. తాజాగా మరోసారి యుఎఇ వరల్డ్‌కప్ వంటి మెగా టోర్నీకి ఆతిథ్యం ఇచ్చేందుకు సిద్ధమైంది. శ్రీలంకతో పోల్చితే యుఎఇలో వరల్డ్‌కప్ నిర్వహిస్తే ప్రయోజనంగా ఉంటుందనే ఉద్దేశంతో ఐసిసి ఈ నిర్ణయం తీసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News