Sunday, January 19, 2025

క్షిపణులతో పేల్చేస్తాం: పుతిన్‌కు అరెస్ట్ వారెంట్లపై స్ట్రాంగ్ వార్నింగ్..

- Advertisement -
- Advertisement -

మాస్కో: ఉక్రెయిన్ తో యుద్ధం నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అరెస్ట్‌కు అంతర్జాతీయ నేర విచారణ న్యాయస్థానం(ఐసిసి) వారంట్లు జారీ చేయడంపై ఆ దేశ సెక్యూరిటీ కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ డిమిత్రీ మెద్వదేవ్ అగ్గిమీద గుగ్గిలమయ్యారు. అంతర్జాతీయ నేర విచారణ న్యాయస్థానం భవనంపై క్షిపణిదాడులు చేస్తామని హెచ్చరించారు. ఆకాశంలోకి చూస్తూ ఉండాలంటూ సెటైర్ కూడా వేశారు. ఉత్తర సముద్రంలోని రష్యా యుద్ధనౌక నుంచి హేగ్‌లోని అంతర్జాతీయ నేర విచారణ న్యాయస్థానం భవనంపైకి హైపర్‌సోనిక్ క్షిపణి దాడి ఊహించడం సాధ్యమేనని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. అంతకు ముందు చట్టవిరుద్ధంగా ఉక్రెయిన్ బాలలను రష్యాకు తీసుకెళ్లారంటూ అంతర్జాతీయ నేర విచారణ న్యాయస్థానం వ్లాదిమిర్ పుతిన్‌కు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. రష్యన్ బాలల హక్కుల కమిషన్ ప్రెసిడెన్షియల్ కమిషనర్, ల్వోవా-బిలోవాకు కూడా ఈ ఆరోపణలపై వారంట్‌ను జారీ చేసింది.

అయితే ఈ ఆదేశాలు చెల్లబోవని రష్యా ఇప్పటికే పేర్కొంది. ఈ న్యాయస్థానానికి తాము పార్టీ కాదని చెప్పింది. అయితే ఉక్రెయిన్ ఈ చర్యలను స్వాగతించింది. ఇది చరిత్రాత్మక నిర్ణయమని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ ప్రశంసించారు. ఉక్రెయిన్ ఆరోపణల ప్రకారం, 2022 ఫిబ్రవరి 24 నుంచి దాదాపు 16 వేల మంది ఉక్రెయినియన్ బాలలను రష్యాకు తీసుకెళ్లారు. వారిని రష్యాలోని అనాథాశ్రమాల్లో ఉంచారు. ఐసిసి పాసిక్యూటర్ కరీం ఖాన్ ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, పుతిన్ అరెస్ట్ చేయదగిన వ్యక్తి అని చెప్పారు. ఐసీసీకి 120 సభ్య దేశాలు ఉన్నాయని, వాటిలో ఏ దేశంలోనైనా ఆయన కాలు మోపితే, వెంటనే అరెస్ట్ చేయవచ్చునని తెలిపారు.

రష్యన్ బాలల హక్కుల కమిషన్ ప్రెసిడెన్షియల్ కమిషనర్ మరియా ల్వోవా-బిలోవా గత ఏడాది ఫిబ్రవరిలో ఓ సమావేశంలో పుతిన్‌తో మాట్లాడుతూ.. ధ్వంసమైన ఉక్రెయిన్ నగరం మరియుపోల్‌కు చెందిన 15 సంవత్సరాల బాలుడిని తాను దత్తత తీసుకున్నానని చెప్పారన్నారు. బాలల వసతి గృహాలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని చెప్పినట్లు తెలిపారు. ఫోరెన్సిక్ ఎవిడెన్స్, స్క్రూటినీ, వీరిద్దరి మాటలు, తదితర అంశాల ఆధారంగా ఈ వారంట్లను జారీ చేసినట్లు తెలిపారు. ఐసీసీ ప్రెసిడెంట్ పియోట్ హొఫ్మన్‌స్కీ మాట్లాడుతూ.. ఈ వారంట్ల అమలు అనేది అంతర్జాతీయ సహకారంపై ఆధారపడి ఉంటుందన్నారు. ఐక్య రాజ్య సమితి భద్రతా మండలిలో సభ్యత్వం ఉన్న దేశానికి అధ్యక్ష పదవిలో కొనసాగుతున్న నేతకు అరెస్ట్ వారంట్ ఇవ్వడం ఐసీసీ చరిత్రలో మునుపెన్నడూ జరగలేదు.

మరోవైపు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు అంతర్జాతీయ న్యాయస్థానం అరెస్టు వారెంట్లు జారీ చేయడంపై చైనా తొలిసారి స్పందించింది. పుతిన్‌కు అరెస్టు వారెంట్లపై ”నిష్పాక్షిక వైఖరి” ప్రదర్శించాలని ఐసీసీని కోరింది. మూడు రోజుల పర్యటన కోసం చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ సోమవారం రష్యా చేరుకున్న తరుణంలో బీజింగ్ ఈ ప్రకటన చేసింది. ఐసిసి నిష్పాక్షికంగా వ్యవహరించాలని, అంతర్జాతీయ చట్టాల ప్రకారం అరెస్టుల వ్యవహారంలో దేశాధినేతలకు ఉన్న ఇమ్యూనిటీని గౌరవించాలని, రాజకీయాలకు దూరంగా ఐసిసి ఉండటంతో పాటు ద్వంద్వ వైఖరిని విడనాడాలని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్‌బిన్ కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News