పాకిస్థాన్ ఆక్రమిత్ కశ్మీర్‌లో పాక్ క్రికెట్ బోర్డు (పిసిబి) నిర్వహించ తలపెట్టిన ఛాంపియన్స్ ట్రోఫీ టూర్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) చెక్ పట్టింది. వచ్చే ఏడాది పాకిస్థాన్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ జరగాల్సి ఉంది. ఈ టోర్నీకి సంబంధించిన అధికారిక షెడ్యూల్‌ను ఐసిసి ఇంకా ప్రకటించలేదు. అయితే ట్రోఫీ టూర్‌కు మాత్రం అనుమతి ఇచ్చింది. ఇందులో భాగంగా కప్పును తొలుత పాకిస్థాన్‌కు పంపించింది. దీంతో పాక్ క్రికెట్ బోర్డు ట్రోఫీ టూర్ షెడ్యూల్‌ను ప్రకటించింది. నవంబర్ 16న పాక్ రాజధాని ఇస్లామాబాద్ నుంచి ఈ ట్రోఫీ టూర్ ప్రారంభం కానుంది. కానీ పాక్ బోర్డు మాత్రం పిఓకె పరిధిలో ఉన్న స్కర్దు, హుంజా, ముజఫరాబాద్ ప్రాంతాలను కూడా షెడ్యూల్ జాబితాలో చేర్చింది. దీన్ని తీవ్రంగా పరిగణించిన భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) ఈ విషయాన్ని ఐసిసి దృష్టికి తీసుకెళ్లింది. దీనిపై స్పందించిన ఐసిసి పిఓకెలో ట్రోఫీ టూర్‌పై నిషేధం విధింంచింది. దీంతో పాక్ క్రికెట్ బోర్డు షాక్‌కు గురైంది.
పిఓకెలో ట్రోఫీ టూర్‌కు అనుమతించే ప్రసక్తే లేదని ఐసిసి స్పష్టం చేసింది. దీంతో చేసేదేమీ లేక పిసిబి వెనక్కి తగ్గక తప్పలేదు. ఇదిలావుంటే వచ్చే ఏడాది జరిగే ఛాంపియన్స్ ట్రోపీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. కానీ భద్రత కారణాల వల్ల పాక్‌లో మ్యాచ్‌లు ఆడేందుకు బిసిసిఐ అంగీకరించడం లేదు. ఇదే విషయాన్ని పిసిబి, ఐసిసి దృష్టికి తీసుకెళ్లింది. హైబ్రిడ్ పద్ధతిలో టోర్నీని నిర్వహించాలని బిసిసిఐ కోరింది. భారత్ ఆడే మ్యాచ్‌లతో పాటు నాకౌట్ పోటీలను పాక్ కాకుండా వేరే దేశంలో జరిగేలా చూడాలని బిసిసిఐ కోరుతోంది. దీనికి ఐసిసి సానుకూలంగానే స్పందించింది. అయితే పాక్ బోర్డు హెబ్రిడ్ పద్ధతిలో టోర్నీని నిర్వహించేందుకు ఒప్పుకోవడం లేదు. అన్ని మ్యాచ్‌లు తమ దేశంలోనే నిర్వహిస్తామని ఐసిసికి స్పష్టం చేసింది. దీంతో పాక్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ జరగడం ప్రశ్నార్థకంగా మారింది.