హైదరాబాద్ : డెసిషన్ రివ్యూ సిస్టమ్(డిఆర్‌ఎస్) విషయంలో ఐసిసి కీలక నిర్ణయం తీసుకుంది. టి20 ప్రపంచకప్ టోర్నీలో డిఆర్‌ఎస్‌ను అమలు చేయనున్నట్లు ఐసిసి ఒక ప్రకటనలో ధ్రువీకరించింది. కాగా మెన్స్ టి20 ప్రపంచకప్‌లో డిఆర్‌ఎస్ ఉయోగించడం ఇదే తొలిసారి కావడం విశేషం. సాధారణంగా టి20 మ్యాచ్‌లో ఇరు జట్లకు ప్రతీ ఇన్నింగ్స్‌లో ఒక రివ్యూ కోరే అవకాశం ఉంటుంది. కోవిడ్-19 మహమ్మారి కారణంగా టోర్నీలో తక్కువ అనుభవం ఉన్న అంపైర్లు పనిచేసే అవకాశం ఉన్నందున అదనంగా ఇరు జట్లకు మరో రివ్యూను ఇవ్వనున్నట్లు తెలిపింది. తాజా రూల్స్ ప్రకారం మ్యాచ్‌లో ఇరు జట్లకు రెండు ఇన్నింగ్స్‌లోనూ రెండు రివ్యూలు కోరే అవకాశం ఉంటుంది. దీంతోపాటు డక్‌వర్త్ లూయిస్ పద్దతి ఆధారంగా వచ్చే ఫలితాల నిర్ణయాల్లోనూ ఐసిసి కీలక మార్పులు చేసింది. టి20 ప్రపంచకప్‌లో లీగ్ దశలో ఏవైనా మ్యాచ్‌లకు వర్షం అంతరాయం కలిగిస్తే.. డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో ఫలితం రావాలంటే ఇకపై ప్రతీ జట్టు కనీసం ఐదు ఓవర్లు బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది.
అదే సెమీ ఫైనల్స్.. ఫైనల్స్‌లో మాత్రం 10 ఓవర్లు పాటు బ్యాటింగ్ చేస్తేనే డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో ఫలితం తేల్చేందుకు అవకాశం ఉంటుంది. 2018 టి20 వుమెన్స్ టోర్నీలో డక్‌వర్త్ లూయిస్ పద్దతిని ఇదే విధంగా అమలు చేశారు. ఇక మెన్స్ టి20 ప్రపంచకప్ టోర్నీలో డిఆర్‌ఎస్ ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి. అంతకముందు వుమెన్స్ టి20 ప్రపంచకప్ 2018లో తొలిసారి డిఆర్‌ఎస్‌ను ప్రవేశపెట్టారు. ఇక మెన్స్ క్రికెట్‌లో ఐసిసి లాంటి మేజర్ టోర్నీల్లో చూసుకుంటే 2017 చాంపియన్స్ ట్రోఫీ, 2019 వన్డే ప్రపంచకప్, తొలి ఐసీసీ ప్రపంచటెస్టు చాంపియన్‌షిప్‌లో డీఆర్‌ఎస్‌ను అమలుపరిచారు. మ్యాచ్‌లో భాగంగా కొన్నిసార్లు మార్జిన్ ఆఫ్ ఎర్రర్స్‌లో ఫీల్డ్ అంపైర్ల తప్పుడు నిర్ణయాల వల్ల ఆటగాళ్లకు నష్టం కలుగుతుందని భావించిన ఐసిసి డిఆర్‌ఎస్ రూల్‌ను ప్రవేశపెట్టింది. ఆటగాళ్లు తమ ఔట్‌పై ఏవైనా అనుమానాలు ఉంటే థర్డ్‌అంపైర్‌కు రివ్యూ కోరే అవకాశం ఉంటుంది. ఇక టి20 ప్రపంచకప్ 2021 అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకు యూఏఈ, ఒమన్ వేదికగా జరగనుంది.