Sunday, December 22, 2024

ఈ మెగా టోర్నీలకు జట్ల ఎంపిక సవాల్ వంటిదే!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రపంచ క్రికెట్‌లోని ప్రతిష్టాత్మకమైన టోర్నమెంట్‌లుగా పేరున్న ఆసియా కప్, ప్రపంచకప్‌లు మరి కొన్ని రోజుల్లోనే జరుగనున్నాయి. శ్రీలంక, పాకిస్థాన్‌లు సంయుక్తంగా ఆసియాకప్‌కు ఆతిథ్యం ఇస్తున్నాయి. ఇందులో కొన్ని మ్యాచ్‌లు పాకిస్థాన్‌లో మరి కొన్ని పోటీలు శ్రీలంకలో జరుగనున్నాయి. వరల్డ్‌కప్‌కు ముందు జరుగుతున్న అతి పెద్ద టోర్నమెంట్ కావడంతో అందరిదృష్టి దీనిపై నెలకొంది.

భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ తదితరులు జట్లు ఈ మెగా టోర్నీని సవాల్‌గా తీసుకున్నాయి. ఇక ఆసియాకప్ కోసం సోమవారం టీమిండియాను ప్రకటించనున్నారు. సొంత గడ్డపై జరిగే వన్డే ప్రపంచకప్‌కు ముందు జరిగే ఆసియాకప్‌లో మెరుగైన ప్రదర్శన చేయాలనే పట్టుదలతో భారత్ కనిపిస్తోంది. ఈ టోర్నీలో సీనియర్, జూనియర్ల కలయికతో జట్టును ఎంపిక చేసే అవకాశాలున్నాయి. కెప్టెన్ రోహిత్ శర్మ, ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, బిసిసిఐ కార్యదర్శి జైషా, అధ్యక్షుడు రోజర్ బిన్నీ తదితరుల పర్యవేక్షణలో ఆసియాకప్ జట్టు ఎంపిక చేయనుంది. ఇందులో ఆడే జట్టే దాదాపు వరల్డ్‌కప్‌లో కూడా బరిలోకి దిగడం ఖాయం.

దీంతో జట్టు ఎంపిక బిసిసిఐకి సవాల్‌గా తయారైంది. గాయాల బారిన పడిన కీలక ఆటగాళ్లు బుమ్రా, రాహుల్, శ్రేయస్ అయ్యర్ తదితరులు ప్రస్తుతం కోలుకున్నారు. బుమ్రా ఇప్పటికే ఐర్లాండ్‌తో జరుగుతున్న టి20 సిరీస్‌లో బరిలోకి దిగాడు. సుదీర్ఘ కాలంగా క్రికెట్‌కు దూరంగా ఉన్నా దాని ప్రభావం బుమ్రా పునరాగమనంపై పడలేదు. ఆడిన తొలి మ్యాచ్‌లోనే బుమ్రా మెరుగైన ప్రదర్శనతో అలరించాడు. ఇక ప్రసిద్ధ్ కృష్ణ కూడా మొదటి టి20లో అద్భుత బౌలింగ్‌ను కనబరిచాడు. అయితే కీలక బౌలర్లుగా ఉన్న సిరాజ్, షమి తదితరులు గాయాలతో సతమతమవుతుండడం భారత్‌ను కలవరానికి గురిచేస్తోంది. ఆసియాకప్‌లో వీరిని ఎంపిక చేయడం కష్టమే. ఇక రాహుల్, శ్రేయస్ అయ్యర్‌లను ఎంపిక చేస్తారా లేదా అనేది అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది.

ఒక వేళ పూర్తి ఫిట్‌నెస్ సాధించకపోతే శ్రేయస్ అయ్యర్‌ను పక్కన బెట్టినా ఆశ్చర్యం లేదు. కాగా, వీరు లేకున్నా టీమిండియాలో ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదవలేదు. సీనియర్లు రోహిత్, విరాట్ కోహ్లి, బుమ్రా, హార్దిక్, జడేజా, అశ్విన్, చాహల్, కుల్దీప్‌లు జట్టులోకి రావడం ఖాయం. యువ ఆటగాళ్లు యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్‌లకు కూడా అవకాశాలు మెరుగ్గానే ఉన్నాయి.

అయితే వరుస వైఫల్యాలు చవిచూస్తున్న సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్‌లకు ఆసియాకప్ టీమ్‌లో చోటు లభిస్తుందా లేదా అనేది సందేహంగా తయారైంది. సూర్యకుమార్ టి20లలో బాగానే ఆడుతున్నా వన్డేలకు వచ్చే సరికి పూర్తిగా తేలిపోతున్నాడు. ఈ పరిస్థితుల్లో అతనికి కూడా ఆసియాకప్‌లో చోటు కష్టంగానే కనిపిస్తోంది. సంజూ శాంసన్ కూడా ఆశించిన స్థాయిలో రాణించలేక పోతున్నాడు. అతనికి కూడా ఈసారి చోటు కష్టమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి స్థితిలో టీమిండియా ఎంపిక అంశం ఆసక్తికరంగా మారింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News