దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి బుధవారం తాజాగా ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి బ్యాటింగ్ విభాగంలో రెండో స్థానంలో నిలిచాడు. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ తన టాప్ ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. బౌలింగ్ విభాగంలో న్యూజిలాండ్ స్పీడ్‌స్టర్ ట్రెంట్ బౌల్ట్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇక టీమిండియా తరఫున జస్ప్రీత్ బుమ్రా ఒక్కడే టాప్10లో చోటు సంపాదించాడు. పాకిస్థాన్ సారథి బాబర్ ఆజమ్ 865 పాయింట్లతో టాప్ ర్యాంక్‌ను కాపాడుకున్నాడు. అయితే టీమిండియా కెప్టెన్ కోహ్లి కంటే కేవలం 8 పాయింట్ల ఆధిక్యంలో మాత్రమే బాబర్ కొనసాగుతున్నాడు. అయితే సమీప భవిష్యత్తులో భారత జట్టు వన్డే సిరీస్‌లు ఆడే అవకాశం లేదు. దీంతో ఇప్పటికిప్పుడు బాబర్ టాప్ ర్యాంక్‌కు వచ్చే ఢోకా ఏమీలేదనే చెప్పాలి. కోహ్లి 857 పాయింట్లతో రెండో ర్యాంక్‌ను కాపాడుకున్నాడు. టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ మూడో ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు.
కివీస్ ఆటగాడు రాస్ టెలర్ నాలుగో, ఆస్ట్రేలియా కెప్టెన్ అరోన్ ఫించ్ ఐదో ర్యాంక్‌లో నిలిచారు. బౌలింగ్ విభాగంలో న్యూజిలాండ్ స్టార్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ టాప్ ర్యాంక్‌ను కాపాడుకున్నాడు. 737 పాయింట్లతో బౌల్ట్ అగ్రస్థానంలో నిలిచాడు. మెహదీ హసన్ (బంగ్లాదేశ్) రెండో ర్యాంక్‌లో నిలిచాడు. అఫ్గాన్ యువ బౌలర్ ముజీబుర్ రహ్మాన్ మూడో, మ్యాట్ హెన్రీ (కివీస్) నాలుగో ర్యాంక్‌ను సాదించారు. ఇక భారత స్టార్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా ఐదో ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. ఆల్‌రౌండర్ విభాగంలో షకిబ్ అల్ హసన్ (బంగ్లాదేశ్) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. బెన్ స్టోక్స్ (ఇంగ్లండ్) రెండో, మహ్మద్ నబి (అఫ్గాన్) మూడో, క్రిస్ వోక్స్ (ఇంగ్లండ్) నాలుగో, రషీద్ ఖాన్ (అఫ్గాన్) ఐదో ర్యాంక్‌లో నిలిచారు. భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా 9వ ర్యాంక్‌ను కాపాడుకున్నాడు. టీమ్ విభాగంలో న్యూజిలాండ్ టాప్ ర్యాంక్‌లో కొనసాగుతోంది. ఆస్ట్రేలియా రెండో, భారత్ మూడో ర్యాంక్‌లో నిలిచాయి. ఇంగ్లండ్, సౌతాఫ్రికాలు కూడా టాప్5 ర్యాంకింగ్స్‌లో చోటు కాపాడకున్నాయి.
ICC ODI Rankings 2021: Virat Kohli at no 2 spot