Wednesday, January 22, 2025

శుభ్‌మన్ అగ్రస్థానం పదిలం.. టాప్5లో కోహ్లి, రోహిత్

- Advertisement -
- Advertisement -

దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) బుధవారం తాజాగా ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్‌లో భారత బ్యాటర్లు సత్తా చాటారు. వరల్డ్‌కప్‌లో అద్భుతంగా రాణించిన విరాట్ కోహ్లి, కెప్టెన్ రోహిత్ శర్మలు టాప్5లోకి దూసుకెళ్లారు. ఇక యువ సంచలనం శుభ్‌మన్ గిల్ టాప్ ర్యాంక్‌ను కాపాడుకున్నాడు. అయితే బౌలింగ్ విభాగంలో హైదరాబాదీ స్పీడ్‌స్టర్ మహ్మద్ సిరాజ్ టాప్ ర్యాంక్‌ను కోల్పోయాడు.

తాజా ర్యాంకింగ్స్‌లో సిరాజ్ మూడో స్థానానికి పడిపోయాడు. జస్‌ప్రిత్ బుమ్రా, కుల్దీప్, షమిలు టాప్10లో స్తానాన్ని దక్కించుకున్నారు. సౌతాఫ్రికా స్టార్ స్పిన్నర్ కేశవ్ మహారాజ్ 741 రేటింగ్ పాయింట్లతో టాప్ ర్యాంక్‌కు దూసుకెళ్లాడు. ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జోష్ హాజిల్‌వుడ్ 703 పాయింట్లతో రెండో ర్యాంక్‌ను దక్కించుకున్నాడు. సిరాజ్ 699 పాయింట్లతో మూడో ర్యాంక్‌తో సరిపెట్టుకున్నాడు.

బుమ్రా నాలుగో ర్యాంక్‌ను కాపాడుకున్నాడు. కుల్దీప్ యాదవ్ ఏడో, షమి పదో ర్యాంక్‌లో నిలిచారు. ఇక బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో భారత ఓపెనర్ గిల్ 826 పాయింట్లతో అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ప్రపంచకప్‌లో నిలకడగా రాణించడంతో గిల్ టాప్ ర్యాంక్‌కు ఢోకా లేకుండా పోయింది. పాకిస్థాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ రెండో ర్యాంక్‌లో నిలిచాడు. మరోవైపు మెగా టోర్నమెంట్‌లో పరుగుల వరద పారించిన భారత సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లి 791 రేటింగ్ పాయింట్లతో మూడో ర్యాంక్‌కు చేరుకున్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మ నాలుగో ర్యాంక్‌ను దక్కించుకున్నాడు. సౌతాఫ్రికా స్టార్ క్వింటన్ డికాక్ ఐదో ర్యాంక్‌లో నిలిచాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News