Monday, December 23, 2024

ఐసిసి టెస్టు ర్యాంకింగ్స్: టాప్‌లోనే అశ్విన్.. నాలుగో స్థానానికి బుమ్రా

- Advertisement -
- Advertisement -

దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) ప్రకటించిన తాజా టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్ విభాగంలో టాప్ ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. మరో స్టార్ బౌలర్ జస్‌ప్రిత్ బుమ్రా తాజా ర్యాంకింగ్స్‌లో ఒక ర్యాంక్‌ను మెరుగుపరుచుకుని నాలుగో స్థానానికి చేరుకున్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో అశ్విన్, బుమ్రాలు మెరుగైన ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. దీంతో అశ్విన్ టాప్ ర్యాంక్‌కు ఢోకా లేకుండా పోయింది. అశ్విన్ 853 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలర్ కగిసో రబడా 851 పాయింట్లతో రెండో ర్యాంక్‌లో నిలిచాడు. అశ్విన్ కంటే రబడా కేవలం రెండు పాయింట్లు మాత్రమే వెనుకబడి ఉన్నాడు. ఇక ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఒక ర్యాంక్‌ను కోల్పోయి మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. భారత స్పీడ్‌స్టర్ బుమ్రా ఒక ర్యాంక్ పైకి ఎగబాకి తాజా ర్యాంకింగ్స్‌లో నాలుగో స్థానంలో నిలిచాడు. బుమ్రా ప్రస్తుతం 825 పాయింట్లతో నాలుగో ర్యాంక్‌ను దక్కించుకున్నాడు. భారత స్టార్ స్పిన్నర్ రవీంద్ర ఆరో ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు.

బ్యాటింగ్ విభాగంలో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ టాప్ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. తాజా ర్యాంకింగ్స్‌లో కేన్ 864 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్ 832 పాయింట్లతో రెండో, స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా) మూడో ర్యాంక్‌ను దక్కించుకున్నారు. డారిల్ మిఛెల్ (న్యూజిలాండ్), బాబర్ ఆజమ్ (పాకిస్థాన్) ఐదో, విరాట్ కోహ్లి (భారత్) ఆరో ర్యాంక్‌లో కొనసాగుతున్నారు. కాగా, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 12వ, రిషబ్ పంత్ 13వ ర్యాంక్‌కు పడిపోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News