Sunday, January 19, 2025

ఐసిసి టెస్టు ర్యాంకింగ్స్: టాప్ 10 నుంచి బాబర్ ఔట్

- Advertisement -
- Advertisement -

దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) తాజాగా ప్రకటించిన టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ టాప్ ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. అయితే పాకిస్థాన్ అగ్రశ్రేణి ఆటగాడు బాబర్ ఆజమ్ టాప్10 నుంచి వైదొలిగాడు. 2019 తర్వాత బాబర్ టాప్ టెన్ నుంచి వైదొలగడం ఇదే తొలిసారి కావడం విశేషం. బంగ్లాదేశ్‌తో సొంత గడ్డపై జరిగిన టెస్టు సిరీస్‌లో బాబర్ ఘోరంగా విఫలమయ్యాడు. నాలుగు ఇన్నింగ్స్‌లలో కలిపి కేవలం 64 పరుగులే చేశాడు. దీని ప్రభావం అతని ర్యాంకింగ్స్‌పై పడింది.

తాజా ర్యాంకింగ్స్‌లో బాబర్ ఆజమ్ 12వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక ఇంగ్లండ్ ఆటగాడు రూట్ 922 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకున్నాడు. శ్రీలంకతో జరిగిన లార్డ్ టెస్టులో రూట్ రెండు ఇన్నింగ్స్‌లలో కూడా సెంచరీలు చేశాడు. దీంతో అతని టాప్ ర్యాంక్ మరింత పటిష్ఠంగా మారింది. న్యూజిలాండ్ స్టార్ కేన్ విలియమ్సన్ 859 పాయింట్లతో రెండో ర్యాంక్‌ను కాపాడుకున్నాడు. అయితే రూట్‌తో పోల్చితే పాయింట్ల విషయంలో కేన్ చాలా వెనుకబడి ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో రూట్ టాప్ ర్యాంక్‌కు ఇప్పట్లో ఢోకా లేకుండా పోయింది. మరోవైపు కివీస్ బ్యాటర్ డారిల్ మిఛెల్ మూడో స్థానానికి చేరుకున్నాడు.

ఆస్ట్రేలియా స్టార్ స్టీవ్ స్మిత్ ఒక ర్యాంక్‌ను మెరుగుపరుచుకుని నాలుగో స్థానంలో నిలిచాడు. ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ ఒక పాయింట్ కోల్పోయి ఐదో స్థానాన్ని దక్కించుకున్నాడు. కాగా, భారత బ్యాటర్లు రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లిలు టాప్10లో చోటును నిలబెట్టుకున్నారు. తాజా ర్యాంకింగ్స్‌లో రోహిత్ ఆరో స్థానంలో నిలిచాడు. ఇక యశస్వి ఏడో, విరాట్ 8వ స్థానాన్ని దక్కించుకున్నారు. కాగా, బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా సీనియర్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ టాప్ ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. అశ్విన్ 870 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. హాజిల్‌వుడ్ (ఆస్ట్రేలియా) రెండో ర్యాంక్‌ను కాపాడుకున్నాడు. భారత స్పీడ్‌స్టర్ జస్‌ప్రిత్ బుమ్రా మూడో ర్యాంక్‌లో నిలిచాడు. కమిన్స్ (ఆస్ట్రేలియా), రబడా (సౌతాఫ్రికా) టాప్5లో చోటు దక్కించుకున్నారు. భారత స్పిన్నర్ రవీంద్ర జడేజా ఏడో ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు.

8వ ర్యాంక్‌కు పడిపోయిన పాక్
తాజా టెస్టు టీమ్ ర్యాంకింగ్స్‌లో పాకిస్థాన్ జట్టు 8వ ర్యాంక్‌కు పడిపోయింది. సొంత గడ్డపై బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో పాకిస్థాన్ అవమానకర ఓటమిని చవిచూసిన సంగతి తెలిసిందే. రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను బంగ్లాదేశ్ 20తో క్లీన్‌స్వీప్ చేసింది. ఈ ఓటమి ప్రభావం పాకిస్థాన్ ర్యాంకింగ్స్‌పై పడింది. ఇంతకుముందు 6వ ర్యాంక్‌లో కొనసాగిన పాకిస్థాన్ రెండు స్థానాలు కోల్పోయి 8వ ర్యాంక్‌కు పడిపోయింది. ప్రస్తుతం పాకిస్థాన్ 77 పాయింట్లతో 8వ స్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియా 124 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. భారత్ 120 పాయింట్లతో రెండో ర్యాంక్‌ను కాపాడుకుంది. ఇంగ్లండ్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్ టీమ్‌లు టాప్5లో కొనసాగుతున్నాయి. శ్రీలంక ఆరో, వెస్టిండీస్ ఏడో స్థానంలో నిలిచాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News