Friday, November 8, 2024

ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల

- Advertisement -
- Advertisement -

ముంబై: భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్ షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) మంగళవారం విడుదల చేసింది. అక్టోబర్ ఐదు నుంచి నవంబర్ 19 వరకు ఈ మెగా టోర్నమెంట్ జరుగనుంది. అహ్మదాబాద్ వేదికగా అక్టోబర్ 5న డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్, రన్నరప్ న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌తో వరల్డ్‌కప్‌కు తెరలేవనుంది. ఇక నవంబర్ 19న ఫైనల్ సమరం జరుగనుంది. ఫైనల్ మ్యాచ్‌కు అహ్మదాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది.

ఇక చిరకాల ప్రత్యర్థులు భారత్‌పాకిస్థాన్ జట్ల మధ్య అక్టోబర్ 15న పోరు జరుగుతుంది. ఈ మ్యాచ్‌కు కూడా అహ్మదాబాదే ఆతిథ్యం ఇస్తోంది. ఇక వరల్డ్‌కప్‌లో భాగంగా హైదరాబాద్‌లో మూడు మ్యాచ్‌లు జరుగనున్నాయి. పాకిస్థాన్ తన రెండు లీగ్ మ్యాచ్‌లను హైదరాబాద్‌లో ఆడనుంది. న్యూజిలాండ్ కూడా ఉప్పల్ స్టేడియంలో ఓ మ్యాచ్ ఆడుతుంది. క్వాలిఫయర్1తో న్యూజిలాండ్ ఈ మ్యాచ్‌లో తలపడనుంది. ఇదిలావుంటే టీమిండియా తన తొలి మ్యాచ్‌ను అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో ఆడనుంది. లీగ్ దశలో భారత్ మొత్తం మ్యాచుల్లో తలపడనుంది.

పది వేదికల్లో..
కాగా, భారత్‌లోని మొత్తం పది నగరాలు ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. అహ్మదాబాద్, హైదరాబాద్, ధర్మశాల, న్యూఢిల్లీ, చెన్నై, లక్నో, పుణె, బెంగళూరు, ముంబై, కోల్‌కతా నగరాలు వరల్డ్‌కప్‌కు వేదికలుగా ఎంపికయ్యాయి. మరోవైపు సెమీ ఫైనల్ మ్యాచ్‌లు ముంబై, కోల్‌కతా నగరాల్లో జరగునున్నాయి. లీగ్ దశలో మొత్తం 45 మ్యాచ్‌లు జరుగుతాయి. మూడు నాకౌట్ మ్యాచ్‌లు ఉన్నాయి. వరల్డ్‌కప్‌లో 42 డేనైట్ మ్యాచ్‌లు జరుగనుండగా మరో ఆరు డే మ్యాచ్‌లు ఉంటాయి.

డే మ్యాచ్ ఉదయం 10.30 గంటల నుంచి డేనైట్ మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటల నుంచి జరుగుతోంది. ఇదిలావుంటే వార్నప్ మ్యాచ్‌లు మూడు వేదికల్లో జరుగనున్నాయి. హైదరాబాద్, తిరువనంతపురం, గౌహతి నగరాల్లో ప్రాక్టీస్ మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. ఇదిలావుండగా భారత్ లీగ్ దశలో మొత్తం 9 మ్యాచ్‌లు ఆడనుంది. అక్టోబర్ 84 ఆస్ట్రేలియాతో (అహ్మదాబాద్‌లో), 11న అఫ్గానిస్థాన్‌తో (న్యూఢిల్లీలో), 19న బంగ్లాదేశ్‌తో (పుణెలో), 29న ఇంగ్లండ్‌తో (లక్నోలో), నవంబర్ రెండున క్వాలిఫయర్2తో (ముంబైలో), నంబర్ ఐదున దక్షిణాఫ్రికాతో (కోల్‌కతాలో), నవంబర్ 11న క్వాలిఫయర్1తో (బెంగళూరులో) భారత్ తలపడనుంది.

కాగా, లీగ్ దశలో ప్రతి జట్టు తొమ్మిది మ్యాచ్‌ల చొప్పున ఆడుతాయి. లీగ్ దశలో అగ్రస్థానంలో నిలిచే నాలుగు జట్లు సెమీ ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. తొలి సెమీ ఫైనల్ నవంబర్ 15న ముంబైలోని వాంఖడే స్టేడియంలో రెండో సెమీ ఫైనల్ నవంబర్ 16న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్‌లో జరుగుతోంది. ఫైనల్ నవంబర్ 19న అహ్మదాబాద్‌లో జరుగనుంది. ఇక నవంబర్ 20ను రిజర్వ్‌డేగా ప్రకటించారు.

ఉప్పల్‌లో మ్యాచ్‌లే మ్యాచ్‌లు..
హైదరాబాద్‌లోని ఉప్పల్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో వరల్డ్‌కప్‌లో భాగంగా మొత్తం ఐదు మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఇందులో మూడు అంతర్జాతీయ మ్యాచ్‌లు ఉండగా మరో రెండు వార్మప్ మ్యాచ్‌లు ఉన్నాయి. వీటిలో పాకిస్థాన్ ఆడే మ్యాచ్‌లే నాలుగు ఉండడం విశేషం. పాకిస్థాన్ సెప్టెంబర్ 29న న్యూజిలాండ్‌తో అక్టోబర్ 3న ఆస్ట్రేలియాతో వార్మప్ మ్యాచ్‌లు ఆడనుంది. అంతేగాక అక్టోబర్ ఆరున క్వాలిఫయర్1తో, అక్టోబర్12న క్వాలిఫయర్2తో తలపడనుంది. దీంతో పాటు అక్టోబర్ 9న న్యూజిలాండ్ కూడా ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ ఆడనుంది. క్వాలిఫయర్1తో న్యూజిలాండ్ ఢీకొంటోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News