ముంబై : వచ్చే నెలలో న్యూజిలాండ్‌తో జరిగే ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ సమరం భారత్‌కు సవాలు వంటిదేనని చెప్పక తప్పదు. ఎందుకంటే కొంతకాలంగా భారత క్రికెటర్లు ఎడతెరిపి లేని క్రికెట్ ఆడుతున్నారు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లతో సుదీర్ఘ సిరీస్‌లను ఆడిన టీమిండియా ఆటగాళ్లు ఇటీవలే ఐపిఎల్‌లోనూ పాల్గొన్నారు. మరోవైపు కరోనా భయం నేపథ్యంలో చాలా మంది క్రికెటర్లు నెలల తరబడి బయోబబుల్‌లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక కివీస్‌తో జరిగే సిరీస్‌కు ముందు కూడా భారత్ సుదీర్ఘ రోజుల పాటు బయోబడుగలో ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఇంగ్లండ్ బయలుదేరే ముందు భారత క్రికెటర్లు కఠినమైన క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంది.
ఇది క్రికెటర్లను ఎంతో మనోవేదనకు గురి చేస్తోంది. ఇంగ్లండ్ టూర్‌కు ఎంపికైన చాలా మంది క్రికెటర్లు విశ్రాంతి లేకుండా క్రికెట్ ఆడుతూనే ఉన్నారు. కరోనా వల్ల ప్రస్తుతం పూర్తి భిన్నంగా మారాయి. విదేశీ, స్వదేశీ సిరీస్‌లలో ఆటగాళ్లు కఠినమైన కరోనా నియమ నిబంధనలను పాటించక తప్పడం లేదు. ఇది ఆటగాళ్లను ఎంతో ఒత్తిడికి గురిచేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో న్యూజిలాండ్‌తో జరిగే డబ్లూటిసి ఫైనల్ భారత్‌కు సవాలు వంటిదేనని చెప్పక తప్పదు. బౌన్స్‌కు అనుకూలించే ఇంగ్లండ్ పిచ్‌లపై బలమైన బౌలింగ్ లైనప్‌ను కలిగిన న్యూజిలాండ్‌ను ఎదుర్కొవడం అనుకున్నంత తేలికేం కాదు. కివీస్ జట్టులో టిమ్ సౌథి, ట్రెంట్ బౌల్ట్, వాగ్నర్ వంటి మ్యాచ్ విన్నర్ బౌలర్లు ఉన్నారు. సౌథి, బౌల్ట్‌లను ఎదుర్కొవడం ఎంత పెద్ద బ్యాట్స్‌మెన్‌కైనా కష్టంతో కూడుకున్న విషయమే. ఇక విలియమ్సన్, లాథమ్, సీఫర్ట్ వంటి అగ్రశ్రేణి బ్యాట్స్‌మెన్‌లు కూడా జట్టులో ఉన్నారు.
బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో బలంగా ఉన్న కివీస్‌ను ఓడించడం టీమిండియాకు సులువేమి కాదని విశ్లేషకులు సయితం అభిప్రాయపడుతున్నారు. ఇక ఇటీవల భారత్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో న్యూజిలాండ్ విజయం సాధించడం కూడా ఆ జట్టుకు కలిసి వచ్చే అంశమే. ఇంగ్లండ్ గడ్డపై భారత్‌ను ఓడించి చారిత్రక విజయాన్ని సొంతం చేసుకోవాలని కివీస్ తహతహలాడుతోంది. మరోవైపు భారత్‌ను కూడా తక్కువ అంచనా వేయలేం. టీమిండియాలోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదవలేదు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో కోహ్లి సేన సమతూకంగా కనిపిస్తోంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని బ్యాట్స్‌మెన్, బౌలర్లు జట్టుకు అందుబాటులో ఉన్నారు. అంతేగాక కొంతకాలంగా టీమిండియా టెస్టుల్లో నిలకడైన విజయాలు సాధిస్తూ వస్తోంది. కివీస్‌పై కూడా అదే జోరును కొనసాగిస్తూ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ట్రోఫీని గెలుచుకోవాలనే పట్టుదలతో ఉంది.
ICC World Test Champion: IND vs NZ Final Match in June