ముంబయి: ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్ సెప్టెంబర్ త్రైమాసికం నికర లాభంలో 36 శాతం వృద్ధి నమోదైంది. గతేడాదితో పోలిస్తే ఐసిఐసిఐ బ్యాంక్ నికర లాభం రూ.7,558 కోట్ల నుంచి రూ.10,261 కోట్లకు పెరిగిందని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది. సెప్టెంబర్ త్రైమాసికంలో ఐసిఐసిఐ బ్యాంక్ మొత్తం ఆదాయం రూ.31,088 కోట్ల నుంచి రూ.40,697 కోట్లకు పెరిగిందని తెలిపింది. ఇక నికర వడ్డీ ఆదాయం రూ.18,308 కోట్లకు చేరుకున్నది.
గతేడాది సెప్టెంబర్ త్రైమాసికంలో ఐసిఐసిఐ బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం రూ.14,787 కోట్లతో పోలిస్తే 24 శాతం గ్రోత్ నమోదైంది. స్థూల మొండి బకాయిలు 2.76 శాతం నుంచి 2.48 శాతానికి తగ్గాయని ఐసిఐసిఐ బ్యాంక్ పేర్కొంది. అన్ సెక్యూర్డ్ రుణాలపై ఆర్బీఐ ఆందోళన వ్యక్తం చేసిందని ఐసిఐసిఐ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సందీప్ బత్రా తెలిపారు. రిటైల్ రుణాలు 21 శాతానికి పైగా,వ్యక్తిగత రుణాల గ్రోత్ 40 శాతానికి పైగా, క్రెడిట్ కార్డ్ ఔట్‌స్టాండింగ్ బకాయిలు 30 శాతంగా ఉన్నాయి. మొత్తం బ్యాంకు రుణాల్లో అన్ సెక్యూర్డ్ రుణాల వాటా 13.3 శాతంగా ఉందని ఆయన తెలిపారు.