ఐవర్‌మెక్టిన్, హెచ్‌సిక్యూ తొలగింపు
న్యూఢిల్లీ : కొవిడ్ చికిత్స ప్రక్రియల జాబితా నుంచి ఐవర్‌మెక్టిన్, హైడ్రాక్సీ క్లోరోక్విన్ (హెచ్‌సిక్యూ)ను తొలిగించారు. కొవిడ్ చికిత్సకు భారతదేశంలో ఇప్పటివరకూ వినియోగిస్తున్న ఔషధాలకు సంబంధించి భారత వైద్య పరిశోధనా మండలి (ఐసిఎంఆర్) శుక్రవారం తాజా మార్గదర్శకాలను వెలువరించింది. యుక్తవయస్కులకు ఏఏ ఔషధాలు వాడాలి? చికిత్స ప్రక్రియలో దేనిని తొలిగించాలనేది ఈ క్లినికల్ గైడెన్స్ సవరిత జాబితాలో పొందుపర్చారు. ఐసిఎంఆర్ సారధ్యంలోనే కోవిడ్ 19 నేషనల్ టాస్క్‌ఫోర్స్ పనిచేస్తోంది. ఐసిఎంఆర్, ఆలిండియా ఇనిస్టూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ఇతర సంస్థలతో కూడిన సంయుక్త పర్యవేక్షక బృందం గత నెల 20వ తేదీన సమావేశం అయింది. ఈ క్రమంలో ఐవర్‌మెక్టిన్, హెచ్‌సిక్యూలను వాడకపు జాబితా నుంచి తొలిగించాలని సిఫార్సులు చేశారు. దీనిని పరిగణనలోకి తీసుకుని ఈ ఏడాది మే 19వ తేదీన వెలువరించిన క్లినికల్ గైడెన్స్‌ను సవరిస్తూ ఇప్పుడు తాజా జాబితాను తీసుకువచ్చారు. ఈ రెండింటి వాడకం వల్ల ఆశించిన ఫలితాలు ఏమీ లేవని తేలిందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని వెల్లడైంది. ఇక రెమ్‌డెసివర్, టొసిలిజమాబ్‌లను ప్రత్యేక సందర్భాలలోనే వాడాలని మార్గదర్శకాలలో తెలిపారు.