భారత్ బయోటెక్ ఎండి క్రిష్ణ యెల్లా
న్యూఢిల్లీ : కొవిడ్ టీకా రెండో డోసు తీసుకున్న ఆరు నెలల తరువాతే బూస్టర్ డోసు తీసుకోడానికి సరైన సమయమని భారత్ బయోటెక్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ క్రిష్ణ యెల్లా బుధవారం వెల్లడించారు. ఇదే సమయంలో నాసల్ వ్యాక్సిన్ (ముక్కు ద్వారా అందించే టీకా) ప్రాముఖ్యతను వివరించారు. బూస్టర్ డోసుగా నాసల్ వ్యాక్సిన్ ఇవ్వడం గురించి భారత్ బయోటెక్ యోచిస్తోంది. యావత్ ప్రపంచం నాసల్ వ్యాక్సిన్ వైపు చూస్తోందని, కరోనా వ్యాప్తిని కచ్చితంగా నిరోధించడానికి ఇదే సరైన మార్గమని అన్నారు.
ప్రతివారూ ఇమ్యునాలజీ పై దృష్టి పెడుతుండగా, భారత్ బయోటెక్ మాత్రం నాసల్ వ్యాక్సిన్‌ను తెరపైకి తెచ్చిందని పేర్కొన్నారు. ఎవరైనా ఇన్‌ఫెక్షన్‌కు గురైనా, లేదా ఎవరైనా ఒక డోసు వేసుకున్నా నాసల్ వ్యాక్సిన్ బాగా పనిచేస్తుందని చెప్పారు. ప్రధాని నరేంద్రమోడీ కొవాగ్జిన్ వ్యాక్సిన్ తీసుకోవడం ఇండియన్ సైన్సులో నమ్మకాన్ని పెంచిందని, సైంటిస్టుకు అంతకన్నా మించిన సంతృప్తి ఇంకేమీ ఉండబోదని పేర్కొన్నారు. ప్రపంచం మొత్తం మీద జికా వైరస్‌కు వ్యాక్సిన్‌ను 2014 లో రూపొందించినది తమ సంస్థేనని, ఈ వ్యాక్సిన్ మొదటి దశ ట్రయల్ పూర్తయిందని, గ్లోబల్ పేటెంట్ హక్కులకు మొట్టమొదట దరఖాస్తు చేసింది తామేనని ఆయన చెప్పుకొచ్చారు.