పాఠశాల వారీగా వివరాలు సేకరిస్తున్న వైద్యశాఖ
12 ఏళ్లకుపైబడిన వారిందరికి వ్యాక్సిన్ చేసేందుకు ప్రణాళికలు
గ్రేటర్ పరిధిలో 17 లక్షల మంది విద్యార్థులు ఉంటారని వైద్యుల అంచనా
స్వదేశీ సంస్ద జైడస్ క్యాడిలా సంస్థ తయారు చేసే డైకొవ్-డి టీకా పంపిణీకి ఏర్పాట్లు
హైదరాబాద్: నగరంలో పాఠశాల విద్యార్థులకు కరోనా టీకా పంపిణీ చేసేందుకు వైద్యశాఖ అధికారులు చర్యలు వేగం పెంచారు. 12 ఏళ్లకుపైబడిన చిన్నారులను గుర్తించేందుకు స్కూళ్ల వారీగా వివరాలు సేకరిస్తున్నట్లు వెల్లడిస్తున్నారు. పాఠశాలలు ప్రారంభమై 25 రోజులు గడుస్తున్న ఇంకా 60శాతానికి మించి విద్యార్ధులు ప్రత్యక్ష పాఠాలకు హాజరు కావడంలేదు. వైరస్ తగ్గుముఖం పడితే వస్తామని, లేకుంటే విద్యార్థులకు కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేస్తే తరగతులకు పంపిస్తామని తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. ఇటీవల వరుస పండుగలు రావడంతో పాటు, వానలు పెద్ద ఎత్తున కురుస్తుండటంతో వైరస్ విజృంభించే అవకాశముందని అందుకోసం చిన్నారులకు టీకా పంపిణీ చేస్తే విద్యార్ధుల్లో మనోదైర్యం పెరిగి బడిబాట పడుతారని చెబుతున్నారు. దీంతో పాఠశాల విద్యాశాఖ, వైద్యశాఖ అధికారులు వీలైనంత త్వరగా టీకా వేయాలని కోరడంతో ఆదిశగా పనులు వేగం చేసి దసరా పండుగ తరువాత వ్యాక్సిన్ పంపిణీ చేస్తామంటున్నారు.
గుజరాత్‌కు చెందిన జైడస్ క్యాడిలా సంస్ద తయారు చేసిన డైకొవ్ డి టీకా అక్టోబర్ రెండో వారంలో అందుబాటులోకి వచ్చే అవకాశముందంటున్నారు. నెల రోజుల కితం కేంద్ర వైద్యశాఖ నుంచి ఏసమయంలోనైనా టీకా సరఫరా చేస్తామని అందుకు తగ్గట్లు వైద్య సిబ్బంది, సెంటర్లు ఏర్పాటు చేసుకోవాలని సూచనప్రాయంగా చెప్పినట్లు వైద్య సిబ్బంది పేర్కొంటున్నారు. స్వదేశీ తయారీ టీకా జైకొవ్‌డి ఇది డిఎన్‌ఏ ఆధారిత వ్యాక్సిన్. 28 రోజుల వ్యవధిలో మూడు డోసులు పంపిణీ చేస్తారు. సూది లేకుండా అతి సన్నటి జెట్ ద్వారా చర్మానికి వేస్తారు. ఇందు కోసం కొలరాడోకు చెందిన ఫార్మా జెట్ కంపెనీ తయారు చేసిన నీడిల్ రహిత వ్యవస్దను జైడస్ ఉపయోగించనుంది. తక్కువ సమయంలో ఎక్కువ మంది చిన్నారులకు టీకా పంపిణీ చేయవచ్చని ఇప్పటికే ఆసంస్ద ప్రకటించింది. వ్యాక్సిన్ పిల్లలకు ఇవ్వాలని కేంద్ర ఆరోగ్య సమాలోచనలు చేస్తున్నట్లు వైద్యశాఖ వెల్లడిస్తుంది. దీంతో అధికారులు గ్రేటర్ నగరంలో ఎంతమంది చిన్నారులు ఉన్నారో గుర్తించే పనిలో పడట్లు వైద్య, విద్యాశాఖ అంచనా ప్రకారం మహానగరం పరిధిలో 12 ఏళ్లపై బడిన వారు 17 లక్షల వరకు ఉన్నట్లు భావిస్తున్నారు. మూడు డోసుల చొప్పన 54లక్షల వరకు డోసులు అవసరం. వచ్చే నెలల్లో ముందుగా 15 నుంచి 18 ఏళ్లలోపు వారికి తరువాత 12 ఏళ్ల నుంచి 15 ఏళ్లులోపు వారికి టీకా వేసేందుకు తగిన సిబ్బందిని అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వైద్యాధికారులు పేర్కొంటున్నారు.