హైదరాబాద్ : బొగ్గు మైనింగ్ రంగంలో సింగరేణి సంస్థ అవలంభిస్తున్న అత్యుత్తమ వ్యాపార విలువలకు జాతీయ స్థాయిలో మరో పురస్కారం లభించింది. ప్రతిష్టాత్మకమైన ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ ఇండియా (ఐఈఐ) ఏటా ప్రకటించే ఇండస్ట్రీ ఎక్స్‌లెన్స్ అవార్డును ఈ ఏడాది సింగరేణిని ఎంపిక చేసింది. ఆదివారం న్యూఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో ఐఈఐ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా 36వ ఇండియన్ ఇంజినీరింగ్ కాంగ్రెస్‌లో ఈ అవార్డును ప్రదానం చేశారు. కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్ర నాథ్ పాండే చేతుల మీదుగా సింగరేణి ఛైర్మన్, ఎండి ఎన్.శ్రీధర్ తరఫున జీఎం(సిపిపి) కె.నాగభూషణ్ రెడ్డి ఈ అవార్డును స్వీకరించారు.
కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఐఈఐ అధ్యక్షుడు నరేంద్ర సింగ్ మాట్లాడుతూ.. మెరుగైన వాణిజ్య విలువలు పాటిస్తున్నందుకు సింగరేణిని అవార్డుకు ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. అవార్డును స్వీకరించిన అనంతరం నాగభూషణ్ రెడ్డి మాట్లాడుతూ ఎండి ఎన్. శ్రీధర్ నేతృత్వంలో సింగరేణి కాలరీస్ బొగ్గు మైనింగ్ రంగంతో పాటు 1200 మెగావాట్ల థర్మల్, 300 మెగావాట్ల సోలార్ రంగాల్లోకి విజయవంతంగా అడుగుపెట్టిందన్నారు. ఆయన సారథ్యంలో కంపెనీకి అనేక జాతీయ , అంతర్జాతీయ పురస్కారాలు లభించాయన్నారు. కార్యక్రమంలో సింగరేణి రెసిడెంట్ ఆఫీసర్ ఓజా, ఇండియన్ ఇంజినీరింగ్ కాంగ్రెస్ ఆర్గనైజింగ్ కమిటీ ఛైర్మన్ దినేశ్‌కుమార్, ఐఈఐ కి చెందిన డాక్టర్ హెచ్ వో థాకరే, మేజర్ జనరల్ ఎంజెఎస్ సైలీ, ఆర్.ఎన్. రాజ్ పుత్, ప్రవీణ్‌కుమార్‌సింగ్ పాల్గొన్నారు.