Monday, December 23, 2024

మానవీయ కోణంలో ఆలోచించి ఐఇఆర్‌పిలను రెగ్యులరైజ్ చేయాలి

- Advertisement -
- Advertisement -

కరీంనగర్ మాజీ ఎంపి బోయినపల్లి వినోద్ కుమార్

మనతెలంగాణ/హైదరాబాద్ : ఇన్‌క్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్(ఐఇఆర్‌పి)లను రెగ్యులరైజ్ చేయాలని కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత 20 సంవత్సరాలుగా రాష్ట్రంలోని మానసిక వైకల్యంతో బాధపడుతున్న విద్యార్థులకు విద్యను అందిస్తూ ఐఇఆర్‌పిలు సేవలు అందిస్తున్నారని తెలిపారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో వారిని రెగ్యులరైజ్ చేయడానికి ప్రయత్నాలు జరిగాయని, అందుకు అవసరమైన పోస్టులను రెగ్యులర్ డిఎస్‌సిలో పొందుపర్చకుండా ఇతర ప్రక్రియ ప్రారంభమైందని గుర్తు చేశారు. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మెగా డిఎస్‌సి వేయాలని చూస్తున్న తరుణంలో వీరిని రెగ్యులరైజ్ చేయాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో 1,523 పోస్టులను మానసిక వైకల్యం ఉన్న వారికి బోధించడానికి సేవలు అందిస్తున్నారని అన్నారు.

గతంలో అతి తక్కువ సంఖ్యలో విద్యార్థులు ఉండేవారని, ప్రస్తుతం వారి సంఖ్య 70 వేలకు చేరిందని వినోద్‌ కుమార్ అన్నారు. వారందరికీ 996 మంది ఐఇఆర్‌పిలు బోధిస్తున్నారని, వీరిని రెగ్యులరైజ్ చేసి మిగిలిన పోస్టులను డిఎస్‌సి ద్వారా భర్తీ చేయాలని సూచించారు. కాంట్రాక్టు విధానంలో పనిచేసిన జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్‌లను రెగ్యులరైజ్ చేసినందున, వీరిని కూడా రెగ్యులరైజ్ చేయడానికి ఎలాంటి అడ్డంకులు ఉండకపోవచ్చని పేర్కొన్నారు. మానసిక వైకల్యం ఉన్న వారికి విద్యను బోధించడం సాధారణ విషయం కాదని, వారిని మానవీయ కోణంలో ఆలోచించి ప్రభుత్వం రెగ్యులరైజ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. వీరి రెగ్యులరైజ్‌పై కాంగ్రెస్ పార్టీ కూడా హామీ ఇచ్చిందని, వెంటనే ఆ హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిర్వహించిన పరీక్షల్లో ఎంపికై, రోస్టర్ విధానం పాటించి ఐఇఆర్‌పిలను ఎంపిక చేసినందున రిజర్వేషన్లలో, ఇతర ప్రభుత్వ ప్రక్రియ ద్వారా వీరి నియామకాలు జరిగాయన్నారు. ప్రభుత్వంలో ప్రస్తుతం విద్యాశాఖ మంత్రి లేనందున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయంలో చొరవ చూపి, అర్హులైన ఐఇఆర్‌పిలను రెగ్యులరైజ్ చేయాలని విజ్ఞప్తి చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News