Monday, December 23, 2024

బిఆర్‌ఎస్ వస్తే … ఏటా ‘సిఎం కప్ క్రీడా సంబురాలే’

- Advertisement -
- Advertisement -

ఈ ఏడాది మే నెలలో అద్భుతంగా నిర్వహణ
కాంగ్రెస్ వస్తే క్రీడలకు, క్రీడా కారులకు దిక్కేదీ?
ఉమ్మడి రాష్ట్రంలోనే పట్టించుకోని నాటి పాలకులు..రాజకీయ పార్టీలు
మరో సారి కెసిఆర్ అధికారంలోకి వస్తే మరింత బ్రహ్మాండంగా క్రీడల నిర్వహణ !

మన తెలంగాణ / హైదరాబాద్: క్రీడా రంగంలో సిఎం కప్ క్రీడలు ఎంతో ఖ్యాతిని చెందాయి. ఉమ్మడి రాష్ట్రంలో అసలు క్రీడలకు గానీ, క్రీడా కారులకు గానీ ప్రాధాన్యత ఉండేదే కాదు. అలాంటిది బిఆర్‌ఎస్ సర్కారు రెండో సారి వచ్చాక క్రీడా రంగానికి సిఎం కెసిఆర్ ఎంతగానో ప్రాధాన్యతనిస్తూ జాతీయ సమైఖ్యత, సౌరభాలను అంతర్జాతీయ వేదికలపై వెదజల్లేందుకు క్రీడారంగానికి విసృతమైన అవకాశాలను ఆయన కల్పించారు. తద్వారా తెలంగాణ కీర్తి బావుటాను ఇప్పటికే అంతర్జాతీయ వేదికలపై ఎగరవేసిన చరిత్ర తెలంగాణ క్రీడాకారులకు కల్పించారు. సిఎం కెసిఆర్ నేథృత్వంలో ముచ్చటగా మూడో సారి బిఆర్‌ఎస్ సర్కారే వస్తే ఇక సిఎం కప్ క్రీడా సంబరాలు ఏటా ఉండే అవకాశాలు ఉండనున్నాయి. అసలు కాంగ్రెస్ పార్టీ అంటూ ఒక వేళ వస్తే గిస్తే..క్రీడలకు గానీ, క్రీడా కారులకు గానీ దిక్కే ఉండదని క్రీడారంగ నిపుణులు చెబుతుండడం గమనార్హం. ఆ మాటకు వస్తే ఉమ్మడి రాష్ట్రంలోనే నాటి పాలకులు క్రీడలను పట్టించుకోనేలేదంటున్నారు. సిఎం కెసిఆర్ మరో సారి అధికారంలోకి వస్తే క్రీడల నిర్వహణ మరింత బ్రహ్మాండంగా నిర్వహిస్తారని చెబుతున్నారు.

క్రీడారంగానికి సిఎం ప్రోత్సాహం …
ఉమ్మడి రాష్ట్రంలో జరగని అభివృద్ధిని తెలంగాణ వచ్చాక చేసి చూపిస్తుండమే కాకుండా జాతీయ సమైఖ్యత, సౌభ్రాత్వాన్ని చాటే క్రీడలను సిఎం కెసిఆర్ మరింత ప్రోత్సహించారు . ఈ క్రమంలో తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ శాట్స్‌పై ఎంతో గురుతర బాధ్యత పడింది. దీనిని మంత్రి శ్రీనివాస్ గౌడ్, శాట్స్ ఛైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్‌లు ఛాలెంజ్‌గా స్వీకరించి క్రీడారంగాన్ని, క్రీడా కారులను ప్రోత్సహించడంతో పాటు క్రీడా ప్రాంగణాలకు ఎంతో ప్రాధాన్యతనిచ్చి కొత్తగా నిర్మాణాలు చేయించారు. సిఎం కప్ క్రీడలను నిర్వహించడం ద్వారా శాట్స్ సంస్థ గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు క్రీడాకారుల్లోని నైపుణ్యతను, గ్రామీణ స్థాయిలో ఆణిముత్యాలను వెలికితీసేందుకు తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ సిఎం కప్ క్రీడా పోటీలను నిర్వహింపజేసింది. ఈ క్రీడలను అత్యంత పెద్ద ఎత్తున నిర్వహించే క్రమంలో నూతన అంబేడ్కర్ సచివాలయం వేదికగా రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సిఎం కప్ క్రీడల ఫైల్ పై తొలి సంతకం చేయడం ద్వారా ఈ క్రీడలకు ఎంతగానో ప్రాధాన్యతనిచ్చారు. అదే క్రమంలోనే క్రీడాప్రాధికార సంస్థ వెను వెంటనే షెడ్యూల్‌ను కూడా ప్రకటించి క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని నింపింది. ఈ ఏడాది మే నెల 15 నుంచి 31వ తేదీ వరకు మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో సిఎం కప్ క్రీడాపోటీలను నిర్వహించి 31న విజేతలకు అవార్డులను అందజేశారు. మండల స్థాయిలో అథ్లెటిక్స్, ఫుట్ బాల్ , కబడ్డీ, ఖోఖో వాలీబాల్, బాడ్మింటన్, స్మిమ్మింగ్, రెజ్లింగ్ పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో 15 ఏళ్ల నుంచి 36 ఏళ్ల సంవత్సరాల వయస్సున్న వారే పాల్గొనాలని శాట్స్ ప్రకటించింది. మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి స్థానాల్లో పోటీల నిర్వహణకు కమిటీలను నియమించి ఈ క్రీడలను బ్రహ్మాండంగా నిర్వహించింది.

అవార్డులు.. రివార్డుల్లో తెలంగాణ శాట్స్ ముందంజ
కాగా ఈ క్రీడా పోటీల నిర్వహణకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనివ్వడంతో పాటు క్రీడల నిర్వహణకు అవసరమైన నిధులను ఇచ్చింది. మండల స్థాయి క్రీడలకు రూ. 15 వేలు, జిల్లా స్థాయి క్రీడలకు రూ. 75 వేల బడ్జెట్‌ను విడుదల చేయడంతో క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అటు రాష్ట్ర స్థాయి పోటీల్లో సిఎం కప్ క్రీడల సర్టిఫికెట్లతో పాటు క్రీడల్లో గెలుపొందిన విజేతలకు రూ. లక్ష, ద్వితీయ విజేతకు రూ. 75 వేలు, తృతీయ విజేతలకు రూ. 50 వేలు, అలాగే ప్రోత్సాహాల కింద రూ. 10 నుంచి 20 వేల వరకు నగదు బహుమతులు అందజేశారు. ఇలా సిఎం కప్ క్రీడలను శాట్స్ సంస్థ ఛైర్మన్ ఆంజనేయ గౌడ్ ఒక పండుగ వాతావరణంలా నిర్వహింపజేయడం విశేషం. కాగా ఈ క్రీడల నిర్వహణపై క్రీడా ప్రాధికార సంస్థ ఛైర్మన్ డాక్టర ఆంజనేయ గౌడ్ స్పందిస్తూ ..నభూతో నభవిష్యతి… అన్న స్థాయిలో సిఎం కప్ క్రీడలను ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రి కెటిఆర్, శ్రీనివాస్ గౌడ్‌ల సహకారంతో నిర్వహింపజేశామని, గచ్చిబౌలి స్టేడియంలో ప్రారంభింపజేసి ఎల్.బి స్టేడియంలో ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించుకున్నామన్నారు. యువతలో ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు సిఎం కప్ క్రీడా పోటీలు ఎంతగానో ఉపయోగపడ్డాయన్నారు. ఈ పోటీల ద్వారా తెలంగాణ క్రీడా స్పూర్తి , క్రీడానైపుణ్యాన్ని చాటే అవకాశం కల్పించినట్లు వెల్లడించారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 50 లక్షల మంది ఈ క్రీడల్లో పాల్గొనడం తనకు మధురానుభూతిని నిలిపిందన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News