Thursday, January 23, 2025

కాంగ్రెస్ వస్తే కొలువులు, కంపెనీలు బెంగళూరుకు…

- Advertisement -
- Advertisement -

కర్నాటక డిప్యూటీ సిఎం డి కె శివకుమార్ లేఖతో బట్టబయలు అయిన కాంగ్రెస్ కుట్ర
ఫాక్స్‌కాన్‌కు రాసిన లేఖలో కాంగ్రెస్ స్కెచ్‌ను వివరించిన డికె
తెలంగాణలో వచ్చేది ఫ్రెండ్లీ ప్రభుత్వమే

అక్కడ ఏర్పడే కాంగ్రెస్ సర్కార్‌తో కంపెనీలను బెంగళూరుకు తరలిస్తామని లేఖలో వ్యాఖ్య

భగ్గుమన్న కెటిఆర్

లేఖ ప్రతిని చూపిస్తూ ఇదేనా నీతి అంటూ ఆగ్రహం

ఢిల్లీ చేతికి మన జుట్టు ఇస్తే పరిస్థితి ఇలానే ఉంటుందని వెల్లడి

కెసిఆర్ మళ్లీ సిఎం కాకపోతే రాష్ట్రం అధోగతి పాలవుతుందని కలవరం
తెలంగాణ న్యాయవాదుల సమ్మేళనంలో బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్

మనతెలంగాణ/హైదరాబాద్: లక్ష మందికి తెలంగాణ బిడ్డలకు ఉపాధి కల్పించే ఫాక్స్‌కాన్ కంపెనీని బెంగళూరుకు తరలించేందుకు కాం గ్రెస్ పార్టీ కుట్రలు చేస్తోందని బిఆర్‌ఎస్ వర్కిం గ్ ప్రెసిడెంట్, మంత్రి కె.టి.రామారావు మండిపడ్డారు. కర్ణాటక డిప్యూటీ సిఎం డికె శివకుమా ర్ ఫాక్సాకాన్ కంపెనీకి లేఖ రాశారని కెటిఆర్ ధ్వజమెత్తారు. తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని డికె శివకుమార్ ఆ లేఖలో పే ర్కొన్నారని.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్ర పరిశ్రమలన్నీ కర్ణాటకకు తరలిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. కెసిఆర్ మళ్లీ అధికారంలోకి రాకపోతే ఏం జరుగుతదనే దానికి ఇది ఒక చిన్న ఉదహరణ అని వ్యాఖ్యానించారు. ఢి ల్లీ చేతిలో మన జుట్టు ఇస్తే, కొట్లాడే మొనగా డు, తెలంగాణ ప్రజయోజనాలు పరిరక్షించే నా యకుడు లేకపోతే పరిస్థితి ఇలానే తయారవుతుందని పేర్కొన్నారు.

అధికారం కాంగ్రెస్ చేతిలోకి వెళ్తే.. లక్ష ఉద్యోగాలు ఇచ్చే ఫాక్స్‌కాన్ కంపెనీని బెంగళూరుకు తరలిస్తారని పేర్కొన్నారు. హైదరాబాద్‌అభివృద్ధి సినీ హీరోలు రజినీకాం త్, సన్నీడియోట్, నటి లయ,గంగవ్వసహా అం దరికీ కనిపిస్తున్నా.. విపక్షాలకు కనిపించట్లేదని మండిపడ్డారు.70 లక్షలమంది రైతులకు రైతుబంధు ఇచ్చిన ఘనత కెసిఆర్‌ది అని, ఎవరి ఊహకు కూడా అందని విధంగా కెసిఆర్ దళితబంధు వంటి పథకం తీసుకువచ్చాయని పేర్కొన్నారు. సొంత నిర్ణయాలు తీసుకునే నాయకుడు కాంగ్రెస్, బిజెపి పార్టీల్లో లేరని విమర్శించారు. ఇలాంటి పరిస్థితుల్లో కెసిఆర్ మళ్లీ సిఎం కాకపోతే రాష్ట్రం అధోగతి పాలవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తెలంగాణ ప్రజలు మాత్రం రిస్క్ తీసుకోవద్దని, రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తూ అన్ని వర్గాలకు కాపాడుకుంటున్న కెసిఆర్ నాయకత్వాన్నే బలపరచాలని కోరారు. బిఆర్‌ఎస్ పార్టీకి మద్దతుగా శనివారం జలవిహార్‌లో ఏర్పాటు చేసిన తెలంగాణ న్యాయవాదుల సమ్మేళనంలో మంత్రి కెటిఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్,ఎంఎల్‌ఎ కాలేరు వెంకటేష్, బిఆర్‌ఎస్ లీగల్ సెల్ ప్రతినిధులు గండ్ర మోహన్‌రావు,కళ్యాణ్, జిపిలు, ఎజిపిలు, హైకోర్టు సహా వివిధ కోర్టుల బార్ అసోసియేషన్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. ఫాక్స్‌కాన్ కంపెనీ ఆపిల్ ఫోన్లకు సంబంధించిన అనేక పరికరాలు తయారు చేస్తోందని, ఆ కంపెనీ చైనాలో 15 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించిందని చెప్పారు. మనం కష్టపడి నాలుగేండ్లు వెంట పడి తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ఒప్పించుకున్నామని, వివిధ వేదికల్లో అమెరికా, చైనా తైవాన్‌లో కలిసిన తర్వాత 2022లో ఫాక్స్‌కాన్ చైర్మన్ హైదరాబాద్‌కు వచ్చి సిఎం కెసిఆర్‌ను కలిసి కంపెనీ పెడతామని ప్రకటించి, ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారని తెలిపారు. ఆ కంపెనీ ద్వారా ఒక లక్ష మంది తెలంగాణ బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పారు. ఫాక్స్‌కాన్ రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదురుగా కొంగరకలాన్‌లో 200 ఎకరాల స్థలంలో నిర్మాణం ప్రారంభించారని, వచ్చే ఏప్రిల్, మే నెలలో ఫాక్స్‌కాన్ కంపెనీ ప్రారంభం కానుందని తెలిపారు. అయితే కర్ణాటక డిప్యూటీ సిఎం శివకుమార్ ఫాక్స్‌కాన్ కంపెనీకి అక్టోబర్ 25న లేఖ రాశారని పేర్కొన్నారు. త్వరలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడబోతోందని, హైదరాబాద్ నుంచి పరిశ్రమలను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒప్పించి బెంగళూరుకు తరలిస్తామని, ఇందుకు తెలంగాణలో ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం సహకరిస్తుందని శివకుమార్ తన లేఖలో పేర్కొన్నట్లు కెటిఆర్ గుర్తు చేశారు.
కాంగ్రెస్‌కు అడ్డాగా బెంగుళూరు
కాంగ్రెస్ పార్టీ బెంగళూరు అడ్డా అయిపోయిందని కెటిఆర్ అన్నారు. తెలంగాణకు సంబంధించిన కాంగ్రెస్ టికెట్లు ఢిల్లీతోపాటు బెంగళూరులో కూడా డిసైడ్ అవుతున్నాయని ఆరోపించారు. పైసలన్నీ బెంగళూరులో దొరుకుతున్నాయని, సిద్ధారమయ్య, శివకుమార్ కష్టపడి సంపాదించిన పైసలు తెలంగాణకు తరలుతున్నాయి.. అడ్డంగా దొరికిపోతున్నాయని విమర్శించారు.
ఢిల్లీ దొరలకు..4 కోట్ల ప్రజలకు పోరాటం..
దొరల తెంగాణ కావాల్నా.. ప్రజల తెలంగాణ కావాల్నా.. అని మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై మంత్రి కెటిఆర్ నిప్పులు చెరిగారు. నిజంగా ఈ రోజు జరుగుతున్న పోరాటం.. నవంబర్ 30న ఢిల్లీ దొరలకు, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు మధ్య జరుగుతున్న పంచాయితీ అని పేర్కొన్నారు. అప్ప 2004 ఎన్నికల సందర్భంలో తియ్యటి మాటలు చెప్పి, తెలంగాణ ఇస్తామని నమ్మబలికి, పదేండ్లు చావగొట్టి, వందల మంది ప్రాణాలు తీసింది ఇదే ఢిల్లీ దొర రాహుల్ తల్లి సోనియా గాంధీ అని కెటిఆర్ తెలిపారు.
అరుదైన సమతుల్యత
తెలంగాణ మోడల్ దేశంలో ఎక్కడా అమలు కావడం లేదని, కెసిఆర్ సర్కార్‌లో అరుదైన సమతుల్యత ఆవిష్కృతమైందని కెటిఆర్ తెలిపారు. 2014లో తెలంగాణ ఏర్పడ్డ నాడు.. ఆర్థిక పరిస్థితి ఏందో అని కొన్ని వర్గాల్లో ఆందోళన ఉండేదని, ఎన్నో అపోహాలు, అనుమానాలు ఉండేవని అన్నారు. నాటి పరిస్థితి, నేటి పరిస్థితి ఎలా ఉందో అందరూ చూస్తున్నారని, హైదరాబాద్ మహానగరం ఎలా మారిందో అందరికీ తెలుసు అని వ్యాఖ్యానించారు. కరెంట్, సాగు, తాగు నీటి పరిస్థితుల్లో ఎంతో మార్పు వచ్చిందని, వైద్యం, విద్యాసంస్థల ఏర్పాటులో విప్లవాత్మక మార్పులు వచ్చాయని…ఇలా చెబుతూ పోతే.. ప్రతి రంగంలో గణనీయమైన గుణాత్మకమైన మార్పు వచ్చిందని వివరించారు. మన తలసరి ఆదాయం తెలంగాణ ఏర్పడ్డప్పుడు లక్షా 14 వేలు ఉండే..ఇప్పుడు 3 లక్షల 17 వేలకు చేరిందని, మీకు పరిపాలన చేయడం వచ్చా..? అని వెక్కరించిన వారికి కంగు తినిపిస్తూ మన రాష్ట్రం అభివృద్ధిలో అగ్రభాగాన నిలిచిందని చెప్పారు. ఈ విషయాన్ని స్వయంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే ప్రకటించిందని కెటిఆర్ తెలిపారు. తెలంగాణ నమూనా అంటే సమగ్ర, సమీకృత, సమ్మిళిత, సమతుల్య మోడల్ అని, ఏదో పదాలు బాగున్నాయినో ఈ వ్యాఖ్యలు చేయడం లేదని, తెలంగాణలో జరుగుతున్న సమతుల్యత నమూనా ఎక్కడా లేదని వ్యాఖ్యానించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు ప్రో బిజినెస్, ప్రో ఐటీ, ప్రో అర్బన్ ఇమేజ్ ఉండేదని, వైఎస్ రాజశేఖర్ రెడ్డి వచ్చిన తర్వాత ప్రో పూర్, ప్రో రూరల్, ప్రో అగ్రికల్చర్ ఒక ఇమేజ్ కోసం ఆయన తాపత్రయ పడ్డారని పేర్కొన్నారు. కానీ కెసిఆర్ సిఎం అయిన తర్వాత అరుదైన సమతుల్యత కనబడుతుందని చెప్పారు. వ్యవసాయ ఉత్పత్తులు పెరుగుతున్నాయని, మూడున్నర కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించే స్థాయికి మనం ఎదిగామని..తెలంగాణ అన్నపూర్ణగా మారిందని వ్యా ఖ్యానించారు. 2014లో ఐటీ ఎగుమతులు 56 వేల కోట్లు ఉండేదని, అక్కడి నుంచి 2 లక్షల 41 వేల కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. ఐటీ ఉద్యోగుల సంఖ్య తెలంగాణలో 10 లక్షలకు చేరుకుందని తెలిపారు. ఒక వైపు వ్యవసాయం, మరో వైపు ఐటీని అభివృద్ధి చేశామని చెప్పారు. పరిశ్రమలు పెరుగుతున్నాయి…పర్యావరణం పెరుగుతుందని వ్యాఖ్యానించారు. హరితహారం ద్వారా 7.7 శాతం గ్రీన్ కవర్‌ను పెంచామన్నారు. రాష్ట్రానికి 24 వేల పరిశ్రమలు వచ్చాయని, లక్షల ఉద్యోగాలు కల్పించామని వివరించారు. ఆ విధంగా రూరల్ డెలవప్మెంట్, అర్బన్ డెవలప్మెంట్, వ్యవసాయం, ఐటీ, వెల్ఫేర్.. ఈ అరుదైన సమతుల్యత కనబడేది మన తెలంగాణలోనే మాత్రమే అని కెటిఆర్ పేర్కొన్నారు.
జానారెడ్డికి సిఎం పదవిపై కోరికలు పుట్టాయి
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి జానారెడ్డిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎన్నికల్లో పోటీ చేయని జానారెడ్డికి కూడా సిఎం పదవిపై కోరికలు పుట్టాయని కెటిఆర్ సెటైర్లు వేశారు. కాంగ్రెస్ పార్టీకి 11 మంది ముఖ్యమంత్రులు దొరికారు.. కానీ ఓటర్లు దొరుకుతలేరని విమర్శించారు. విచిత్రం ఏమిటంటే జనారెడ్డి ఈ ఎన్నికల్లో కూడా పోటీ చేస్తలేరని, అయినా ఆయనకు సిఎం పదవిపై కోరిక పుడుతుందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలో ఏమైతుందో చూడండి… ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సి శివకుమార్ మధ్య సంధి కదుర్చిరారు.. ఇక ఇప్పుడు మూడో కృష్ణుడు మోపైండు.. ఖర్గే కుమారుడు కూడా తానూ సిఎం రేసులో ఉన్నానని స్టేట్‌మెంట్ ఇచ్చాడని అన్నారు. ఇక కర్ణాటకలో మూడు క్యాంపులు.. ఫైవ్ స్టార్ హాటల్స్, బస్సులు.. 24 గంటలు టీవీల్లో చర్చలు అని ఎద్దేవా చేశారు. 1991లో చెన్నారెడ్డిని ముఖ్యమంత్రి పదవి నుంచి దించేందుకు తమ పార్టీ వారే హైదరాబాద్‌లో మతకల్లోలాలు సృష్టించి 400 మందిని చంపించామని స్వయంగా చెన్నారెడ్డే చెప్పారని గుర్తు చేశారు.
అందరూ ఏకమవుతున్నారు
తెలంగాణ సిఎం ఎవరనేది ప్రజలు నిర్ణయించాలని.. మోదీ, రాహుల్ గాంధీ కాదని కెటిఆర్ తెలిపారు. కెసిఆర్‌ను ఓడించడానికి అందరూ ఏకమవుతున్నారని.. షర్మి ల, ఇంకా కొన్ని పార్టీలు కాంగ్రెస్ మద్దతు ప్రకటించాయని చెప్పారు. రాష్ట్రంలో అడ్వకేట్ ట్రస్టును రూ.500 కోట్లకు పెంచుతామని తెలిపారు. న్యాయవాదుల కోసం వైద్య బీమాను రూ.5 లక్షలకు పెంచుతామని .. వారి సమస్యలన్నీ తీర్చే బాధ్యత తనదని మంత్రి కెటిఆర్ న్యాయవాదులకు హామీ ఇచ్చారు.
గునుగుడు గునుగుడే…గుద్దుడు గుద్దుడే
తొమ్మిన్నరేళ్ల బిఆర్‌ఎస్ పాలనలో ప్రజలలో కొంత అసంతృప్తి ఉందని ఇటీవల తనతో కొంతమంది చెప్పారని, అయితే గునుగుడు గునుగుడే…గుద్దుడు గుద్దుడే అని అంటున్నారని అన్నారని కెటిఆర్ పేర్కొన్నారు. తమ పాలనలో కూడా కొన్ని పొరపాట్లు జరిగి ఉంటాయని, అందరినీ సంతృప్తి పరచడం దేవుడి వల్ల కూడా కాదని వ్యాఖ్యానించారు. తాను, తనపై పోటీ చేసే అభ్యర్థులు కూడా దేవుడికి దండం పెట్టి నామినేషన్ వేస్తారని, కానీ ఎన్నికల్లో ఒక్కరే గెలుస్తారని చెప్పారు. దేవుడికి దండం పెట్టినా అందరూ గెలువలేరని కెటిఆర్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News