రైతుబంధుకు రాంరాం..
దళితబంధుకు జైభీమ్
రాష్ట్ర సంపదను పంచుకోవడానికి కాంగ్రెస్ నేతల కుట్రలు
మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో : వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తే మళ్లీ తెలంగాణ కథ మొదటికి వస్తుందని బిఆర్‌ఎస్ అధినేత, సిఎం కెసిఆర్ అన్నారు. ఖమ్మం జిల్లా పాలేరు సెగ్మెంట్ కూసుమంచి మండలం గ్రామంలో బిఆర్‌ఎస్ అభ్యర్థి కందాళ ఉపేందర్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద బహిరంగ ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించారు.తెలంగాణలో పొరపాటున కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ‘రైతుబంధు కు రాం… రాం.. చెబుతారని, ద ళిత బంధుకు జై బీమ్’ అంటారని, కరెంటు కాట గలుస్తది, వైకుంఠపాళీ ఆటలో మళ్లా పెద్ద పాము మింగినట్లయితది.. మళ్లా కథ మొదటికొస్తదని, గతి కావాల్లో ప్రజలే నిర్ణయించుకోవాలన్నారు. రాష్ట్ర ప్రజలు, సంక్షేమ పథకాలు అందించకుండా ఆ పార్టీ వాళ్లే పంచుకు తీన్నేందుకు సిద్ధమవుతున్నారని, ఇక మింగుడుబంధు మొదలవుతుందని ఆయన విమర్శించారు.
మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డెమో రైతు బంధు దుబారా అని, విలువైన ప్రజల పన్నులను కెసిఆర్ చెడకొడ్తున్నాడని విమర్శిస్తున్నారని, రైతు బంధు ఉండాలా? వద్దా ?అని ముఖ్యమంత్రి సభీకులను చేతులు ఎత్తాల్సిందిగా కోరగా సభకు వచ్చిన వారంతా ఉండాలని చేతులెత్తారు. అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రైతులకు రోజుకు 24గంటల కరెంట్ ఇచ్చి కెసిఆర్ దుబారా చేస్తున్నాడని, మూడు గంటల కరెంట్ చాలంటున్నారని, కరెంట్ 24గంటలు ఉండాలా లేక మూడు గంటలు కావాలా ? చేతులు ఎత్తాల్సిందిగా కోరగా అందరూ 24గంటల కరెంట్ కు జైకొట్టారు. తాను ఎక్కడికి వెళ్లినా తెలంగాణ నలుమూలల్లో ఇదే విధంగా ప్రజలు చెబుతున్నారని, కానీ కాంగ్రెస్ నేతలు మాత్రం అన్ని వేస్ట్ అంటూ వారు మాత్రం హైద్రాబాద్‌లో 24గంటల ఎసిల్లో ఉంటారని విమర్శించారు. ఇది కాంగ్రెస్ పార్టీ నేతల రీతి, నీతి అన్నారు. లంబాడీలకు వెయ్యి రూపాయలిచ్చి గుడుంబా పోస్తే చాలని రేవంత్ రెడ్డి చెబుతున్నాడని.. ఇదేనా లంబాడీలు, గిరిజనులకు కాంగ్రెస్ ఇచ్చే మర్యాదా? ఇంత అహంకారంతో మాట్లాడే కాంగ్రెస్ ఎవరికి న్యాయం చేస్తదని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. ‘లంబాడీ తండాలను గ్రామ చేసిందెవరో మీకు తెలుసు. దశాబ్దాల పాటు ఎవరూ మీ వైపు చూడలేదు. 40 తండాలు పాలేరులో కూడా గ్రామ పంచాయతీలుగా మారినాయి. లంబాడీ బిడ్డలు వాళ్ల తండాల్లో వాళ్లే రాజ్యం చేస్తున్నారని’ ఆయన అన్నారు.
ఎన్నికల్లో క్వాలిటీ రావాలి
ఖమ్మం జిల్లా చైతన్యవంతమైన జిల్లా. ఎన్నో ఉద్యమాలు ప్రారంభమైన ప్రాంతం. ప్రజా స్వామ్యంలో నీతి నిజాయితీకి పట్టం కట్టే చైతన్యం ప్రజల్లో రావాలని, అప్పుడే ప్రజలకు వాస్తవమైన సేవ దొరుకుతుందని ముఖ్యమంత్రి కెసిఆర్ అభిప్రాయపడ్డారు. విజ్ఞతతో ఆలోచించి ఓటింగ్ లో పాల్గొన్నాలని తెలంగాణ సంపదను పెంచి ప్రజలకు పంచాలని అనుకుంటున్నామని, అందుకే ప్రజలకు ఉపయోగపడే మ్యానిఫెస్టోను తయారు చేశామని సిఎం అన్నారు. పెన్షన్లను ప్రారంభంలో వెయ్యి రూపాయల నుంచి రూ.2వేలకు పెంచామని, తర్వాత ఈ దఫా రూ. 3 వేలు చేసుకుని 5 వేలకు పెంచుతామన్నారు. తొలుత 50వేల నుంచి, తరువాత లక్ష116కి పెంచామని గుర్తుచేశారు.
రైతుబంధు పదాన్ని పుట్టించింది నేనే..
రైతు బంధు సృష్టించింది నేనే అని సిఎం చెప్పారు. వ్యవసాయ రంగం, రైతాంగం కచ్చితంగా స్థిరీకరణ జరగాలని అనుకున్నాం. పట్టుదలతో నిర్ణయం తీసుకోని రైతుబంధు పథకాన్ని ప్రారంభించామని చెప్పారు. పథకాన్ని ప్రముఖ పర్యావరణవేత్త, వ్యవసాయవేత్త స్వామినాథన్ ప్రశంసించి, మెచ్చుకున్నారన్నారు. ఐక్యరాజ్య సమితి కూడా రైతుబంధు వంటి పథకం ప్రపంచంలో ఎక్కడా లేదని కితాబిచ్చిందని గుర్తుచేశారు. ‘నేను కూడా రైతు బిడ్డను. కాపు వాడిని, వ్యవసాయం తెలుసు కాబట్టి పట్టుబట్టి రైతుబంధు అమలు చేశామని, రైతుల సమస్యలు, ఆర్థిక ఇబ్బందులను అర్థం చేసుకొని వారికి మేలు లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రవేశ పెట్టానని పేర్కొన్నారు.
ధాన్యం దిగుబడిలో మనది రెండో స్థానం
రైతు బంధు పథకం అమలు చేయడం వల్లనే ఇప్పుడు దేశంలోనే ధాన్యం దిగుబడిలో తెలంగాణ రాష్ట్రం రెండో స్థానంలో నిలిచిందన్నారు. మొదటిస్థానం పంజాబ్ ఉంటే, రెండో స్థానం తెలంగాణ సొంతం చేసుకుందన్నారు. గతంలో ఎరువు బస్తాలు దొరికేవి కావు. లైన్లో చెప్పులు కనిపించేవి. పోలీసు స్టేషన్లలో ఎరువు బస్తాలు అమ్మింది కాంగ్రెస్ రాజ్యంలోనే అన్నారు.తెలంగాణ వచ్చిన తరువాత కావాల్సినంత ఎరువు బస్తాలు అందుబాటులో ఉన్నాయని,పెట్టుబడి సాయం చేతులో ఉంది. కల్తీ లేని విత్తనాలు అందిస్తున్నాం. విత్తనాలను పీడీ యాక్టు పెడుతున్నాం.. 24గంటల పాటు విద్యుత్ సరఫరా ఉండటం వల్లనే మూడు కోట్ల టన్నుల వరిధాన్యం తెలంగాణ పండిస్తుందన్నారు. రైతుబంధు 15వేలకు పెంచబోతున్నామని, ఈ పథకం నూటికి నూరు శాతం కొనసాగిస్తానని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు. ప్రస్తుతమున్న ధాన్యం కొనుగోలు గత విధానాన్నే అమలు చేస్తామని, అర్హులైన ప్రతి మహిళకు నెలకు రూ.3 వేలు భృతిగా అందిస్తామని చెప్పారు. రాష్ట్రంలో 90లక్షల మంది పేదలకు రేషన్‌కార్డుపై సన్న బియ్యం అందిస్తామని, మాదిరిగా రాష్ట్రంలో 93 లక్షల కుటుంబాలకు కెసిఆర్ బీమా పథకాన్ని తీసుకొచ్చి ప్రతి ఇంటికి ధీమా కల్పిస్తామన్నారు. కేంద్రం విధానాలతో వంట గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగినందున తెలంగాణలో మహిళలకు వంట గ్యాస్ సిలిండర్ కేవలం రూ.400 కు అందజేస్తామన్నారు. అన్యాయానికి గురవుతున్న దళితుల దళిత బంధు తీసుకొచ్చామని ఆయన అన్నారు. పాలేరులో ఉపేందర్ రెడ్డిని గెలిపిస్తే ఏకపక్షంగా హుజూరాబాద్ మాదిరిగా నియోజకవర్గం మొత్తం దళితబంధు ఇచ్చే బాధ్యత తనదేనని అన్నారు.
బిఆర్‌ఎస్‌తోనే పాలేరుకు మోక్షం..
బిఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చిన తరువాతనే పాలేరు సస్యశ్యామలం అయిందని కెసిఆర్ అన్నారు ఇక్కడ భక్త రామదాసు లిఫ్టు ప్రారంభానికి తాను వస్తుంటే ‘నేను కూడా వస్తాను అని అనాటి డీజీపీ మహేందర్ రెడ్డి తన తో వచ్చారని, నాది కూడా పాలేరు నియోజకవర్గమే సా ర్ 45 ఏండ్లలో 40 ఏండ్లు కరువు కాటకాలు ఎదుర్కున్న ది పాలేరుకు మీరు నీరందిస్తున్నారు. సంతోషంగా నేను పాల్గొంటా’ అని తన అనుమతితో తన వెంట పాలేరు వచ్చారన్నారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం రాకముందు రాష్ట్రం లో చాలా పార్టీలు రాజ్యం చేశాయని, మంచినీళ్లు కూడా ఇవ్వలేదన్నారు. పాలే రు కు మోక్షం జరిగిందంటేనే బిఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే అన్నారు. ‘భక్త సాగు నీరు అంది ఈ ప్రాంతమంతా సస్యశ్యామలం అయిందన్నారు. ప్రాజెక్టుకు ముందు భూముల ధరలు ఎకరానికి రూ. 3 లక్షలు ఉంటే ఇప్పు డు 50 లక్షల వరకు పలుకుతుందన్నారు.
‘సీతారామ’తో కరువు, నీళ్ల పీడపోతుంది
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీతారామా ప్రాజెక్టు త్వరలో పూర్తికాబోతుందని ఈ ప్రాజెక్టు పూర్తి అయ్యితే ఉమ్మడి జిల్లా సస్యశ్యామలం అవుతుందని కెసిఆ ర్ తెలిపారు. ప్రాజెక్టును పాలెరుకు అనుసంధానం చేస్తే సాగర్ కెనాల్ ఆయకట్టు కింద ఉన్న ఖమ్మం జిల్లాలో కరువు పీడ, నీళ్ల పీడ తీరిపోతుందని, పాలేరులో కరువు అనేది ఇకపై తొంగి చూడదన్నారు. బిఆర్‌ఎస్ గెలిస్తే సీతారామ ప్రాజెక్టు పూర్తిచేసేందుకు కృషి చేస్తామని, ఉపేందర్ రెడ్డి ని అసెంబ్లీ వాకిలి దాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సభలో మంత్రి పువ్వాడ , ఖమ్మం ఎంపి నామా, పార్లమెంటు సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, ఎంఎల్‌సి తాతా దేశపతి, మధుసూదనచారి, ఎంఎల్‌ఎ రాములు నాయక్, బిఆర్ ఎస్ అభ్యర్థి బానోతు మదన్‌లాల్ తదితరులు పాల్గొన్నారు.