Monday, December 23, 2024

జిఎస్‌టి కౌన్సిల్ ఒప్పుకుంటే పెట్రోల్, డీజిల్ జిఎస్‌టి పరిధిలోకి: నిర్మలా సీతారామన్

- Advertisement -
- Advertisement -

జైపూర్: జిఎస్‌టి కౌన్సిల్ నిర్ణయం తీసుకున్న పక్షంలో పెట్రోల్, డీజిల్ ధరలను జిఎస్‌టి పరిధిలోకి తీసుకురాగలమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. కేంద్ర వార్షిక బడ్జెట్‌ను ఇటీవల పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ బడ్జెట్‌పై సోమవారం నాడిక్కడ విలేకరుల సమావేశంలో అనేక అంశాలపై విలేకరుల ప్రశ్నలకు బదులిచ్చారు. పెట్రోల్, డీజిల్‌ను జిఎస్‌టి పరిధిలోకి తీసుకురావడంపై విలేకరుల ప్రశ్నకు ఆమె సమాధానమిస్తూ దానిపై నిర్ణయం తీసుకోవలసింది జిఎస్‌టి కౌన్సిల్ మాత్రమేనని తెలిపారు. జిఎస్‌టి కౌన్సిల్ ప్రభుత్వ పరిధిలోనిది కాదని, దాని నిర్వహణ అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులదని ఆమె వివరించారు. కాగా.. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌ను ఒక చర్చనీయాంశంగా జిఎస్‌టిలో చేర్చడానికి సిద్ధమేనని, అయితే దీనిపై నిర్ణయం తీసుకోవలసింది, ఇక జిఎస్‌టి కౌన్సిల్ మాత్రమేనని నిర్మలా సీతారామన్ సూచనప్రాయంగా వెల్లడించినట్లియింది.

కేంద్ర ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందన్న కాంగ్రెస్ ఆరోపణలపై జవాబిస్తూ ఇడి, సిబిఐ, తదితర కేంద్ర దర్యాప్తు సంస్థలు రాత్రికి రాత్రే దాడులు జరపవని, క్షుణ్ణంగా వివరాలు సేకరించి ప్రాథమిక ఆధారాలు లబించాక తమకు అవతలి పక్షం నుంచి సరైన సమాధానాలు రానిపక్షంలోనే దాడులు జరుపతాయని మంత్రి వివరించారు. ఒక పార్టీకి చెందిన మాజీ అధ్యక్షులు ఆర్థిక వ్యవహారాలు లేదా అవినీతికి సంబంధించిన కేసుల్లో బెయిల్ మీద తిరుగుతూ కక్షసాధింపు రాజకీయాల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఆమె వ్యాఖ్యానించారు. అవినీతి గురించి కాంగ్రెస్ అస్సలు మాట్లాడకూడదని, పైగా కక్షసాధింపు చర్యలంటూ నిందించడం సిగ్గుచేటని ఆమె అన్నారు. వరుసగా ఒక్కో కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతికి సంబంధించిన వ్యవహారాల్లోనే అధికారాన్ని కోల్పోయాయని ఆమె ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News