భోపాల్ : దేశంలో మోడీ హయాంలో సరుకుల ధరలు పెరుగుతున్న మాట నిజమే అని మధ్యప్రదేశ్ మంత్రి మహేంద్ర సింగ్ సిసోడియా తెలిపారు. అయితే ఇదే సమయంలో పేద మధ్యతరగతి వారి ఆదాయం పెరిగింది కదా. పెరుగుతున్న ఆదాయాన్ని బట్టి ధరలు ఖర్చులను బేరీజువేసుకుంటే మంచిదన్నారు. ప్రభుత్వం అన్నింటిని ఉచితంగా, ఒకే ధరకు సరుకులను సేవలను అందించలేదని తేల్చిచెప్పారు. ప్రజల నుంచే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఇదే తిరిగి అభివృద్ది పనులకు ఖర్చవుతుందన్నారు. 10 సంవత్సరాల కాలంలో ప్రజల ఆదాయాలు పెరుగుతున్నాయని, గతంలో నెలకు రూ 6000 సంపాదించేవారు ఇప్పుడు రూ 50000 సంపాదించుకుంటున్నారని, మరి వారికి పాతరేటుకే పెట్రోలు నిత్యావసర సరుకులు అందించడం సాధ్యం అవుతుందా? అని కార్మిక శాఖ మంత్రి అయిన సిసోడియా విశ్లేషించారు.
ఇప్పుడు సమాజంలో ఏ వర్గం ఆదాయం పెరగలేదు? చెప్పండి. ఉద్యోగులు ఇంతకు ముందు నెలకు 5వేలు తెచ్చుకుంటే ఇప్పుడు పాతికవేలు పొందుతున్నారు. వ్యాపారస్తులు వారి సరుకులకు సరైన ధరలు పొందడం లేదా? కూరగాయలు, పాలవిక్రేతలకు సరైన ధర అందడం లేదా? అని ప్రశ్నించారు. ధరలను ఆదాయాన్ని బేరీజు వేసుకుని ఏది మంచి కాలం అనేది ఖరారు చేసుకోవాలన్నారు. ధరలు పెరుగుతున్నాయని అంటున్నారు కదా ఇంతకు ముందు కాంగ్రెస్ హయాంలో పెరగలేదా? కేవలం ప్రధాని నరేంద్ర మోడీ పాలనలోనే ఈ పరిణామం అయినట్లు మాట్లాడుతారేమిటి? అని మంత్రి అసహనం వ్యక్తం చేశారు.