ఆయనతో ఆటలాడుకోవడం జగన్‌కు మంచిది
కాదు తెలంగాణ పాలిట వైఎస్ రాక్షసుడు
ఆయన గొర్లు తినేటోడైతే… జగన్ బర్లు
తినేటోడు కృష్ణా జలాల కోసం అవసరమైతే
రాజీనామాలకు కూడా సిద్ధం మీడియా
సమావేశంలో మంత్రి వేముల, విప్ గువ్వల,
శాసనసభ్యుడు మర్రి జనార్దన్‌రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్ :ముఖ్యమంత్రి కెసిఆర్ సింహం లాంటోడు… ఆయనతో ఆటలాడుకోవడం ఎపి సిఎం జగన్‌కు మంచిది కాదు… కృష్ణా జలాల కోసం తాము రాజీనామాలకు సైతం మేము సిద్ధంగా ఉన్నాం…. ఎస్ రాజశేఖర్ రెడ్డి తెలంగాణ పాలిట రాక్షసుడు … వైఎస్ గొర్లు తినేటోడైతే జగన్ బర్లు తినేటోడు అని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ గువ్వల బాల రాజు, శాసనసభ్యుడు మర్రి జనార్దన్ రెడ్డిలు మరోసారి ఘాటుగా స్పందించారు. ఎపి ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులపై వారు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు. గ్రీన్ ట్రిబ్యునల్ స్టే ఉన్నా ఆ రాష్ట్ర ప్రభుత్వం యదేశ్ఛగా అక్రమ ప్రాజెక్టులు కొనసాగిస్తుండడం సిగ్గుచేటన్నారు. పోతిరెడ్డి పాడు ,రాయలసీమ లిఫ్ట్ పథకాలతో రోజూ 7 .7 టిఎంసిల తరలింపునకు జగన్ కుట్ర పన్నారని, ఈ జలదోపిడిని వెంటనే విరమించుకోవాలన్నారు. లేనిపక్షంలో రాష్ట్ర ప్రజల పక్షానా ఎంత దూరం వెళ్లడానికైనా తాము సిద్ధమేనన్నారు.
గురువారం టిఆర్‌ఎస్‌ఎల్‌పి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, ఎపి ప్రభుత్వం నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయితే హైదరాబాద్‌కు మంచి నీళ్లు కూడా కష్టమేనని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే నల్గొండ ,మహబుబ్ నగర్, ఖమ్మం జిల్లాల సాగు నీటి ప్రయోజనాలు సైతం దెబ్బ తింటాయన్నారు. ఈ ప్రాజెక్టులపై సిఎం కెసిఆర్ గత ఫిబ్రవరి నెలలోనే అన్ని ఆధారాలతో కృష్ణా రివర్ బోర్డుకు లేఖ రాసిన విషయాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. ఆ లేఖ ఫలితంగానే కృష్ణా రివర్ బోర్డు ఎపి ప్రభుత్వాన్ని అక్రమ ప్రాజెక్టులను ఆపమని ఆదేశించిందన్నారు. మే 2020లోనే పోతిరెడ్డి పాడు విస్తరణకు, రాయల సీమ లిఫ్ట్ పథకం కోసం ఎపి ప్రభుత్వం జీవో ఇచ్చిందన్నారు. దానిపై స్పందించి ఆ మరుసటి రోజు (మే 11న) తెలంగాణ ప్రభుత్వం కృష్ణా రివర్ బోర్డు కు లేఖ రాసిందన్నారు. అలాగే ఢిల్లీలో ఎన్ని వేదికలున్నాయో అన్నిటికి తెలంగాణ ప్రభుత్వం ఎపి ప్రభుత్వ అక్రమ ప్రాజెక్టులపై ఫిర్యాదు చేసిందన్నారు. అయినప్పటికీ రాష్ట్రంలోని ప్రతిపక్షాలు టిఆర్‌ఎస్ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు, విమర్శలు చేస్తుండడం… ఆ పార్టీల నీతిమాలిన రాజకీయాలకు నిదర్శమన్నారు.
కాంగ్రెస్ నాయకుల పాపమే పోతిరెడ్డి పాడు విస్తరణ అని వారు పేర్కొన్నారు. వైఎస్ హాయంలో పోతిరెడ్డి పాడు సామర్ధ్యం 11 వేల క్యూసెక్కుల నుంచి 44 వేల క్యూసెక్కులకు పెరగడం రాష్ట్ర కాంగ్రెస్ నేతల అసమర్థత కాదా? అని టిఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు ప్రశ్నించారు. పోతిరెడ్డి పాడు నీళ్ల తరలింపునకు అప్పటి మంత్రి డికె అరుణ హారతులు పట్టలేదా? ఇరిగేషన్ మంత్రిగా పొన్నాల లక్ష్మినారాయణ స్వాగతించలేదా? అని వారు నిలదీశారు. ఈ చర్యలను నిరసిస్తూ అప్పటి వైఎస్ మంత్రివర్గం నుంచి టిఆర్‌ఎస్ మంత్రులు బయటకు వచ్చిన విషయాన్ని వారు గుర్తు చేశారు. ఈ అక్రమ ప్రాజెక్టులను అడ్డుకునే బాధ్యత బిజెపి, కాంగ్రెస్‌లకు లేదా? అని ప్రశ్నించారు. ఎపి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అక్కడి ప్రాజెక్టులకు మద్దతుగా మాట్లాడితే తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు బాధ్యత లేదా? అని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం నిష్క్రియా పరత్వాన్ని రాష్ట్ర బిజెపి నేతలు ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. వైఎస్‌పై చేసిన వ్యాఖ్యలకు తాను ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని మంత్రి ప్రశాంత్‌రెడ్డి పునరుద్ఘాటించారు.
2004లో టిఆర్‌ఎస్ పొత్తు పుణ్యాన వైఎస్ సిఎం కాగలిగారన్నారు. ఆనాడు చంద్రబాబును ఓడించేందుకు పొత్తు కోసం కెసిఆర్ ఇంటికిం ఆజాద్ రాలేదా? అని ప్రశ్నించారు. ప్రత్యేత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును గట్టిగా వ్యతిరేకించిన వైఎస్ ఈ ప్రాంతానికి దేవుడు ఎలా అవుతారన్నారు. తెలంగాణకు వై స్ ప్రత్యేకంగా చేసింది ఏమీ లేదన్నారు. కెసిఆర్ లాగా వైఎస్ ధాన్యం కొనుగోలు చేయించారా? రైతు బంధు రైతుల అకౌంట్లలో వేయించారా? తెలంగాణ కు పనికిరాని ప్రాజెక్టులను ప్రతిపాదించి ఎపికి పనికొచ్చే ప్రాజెక్టులను తొందరగా పూర్తయ్యేలా వైఎస్ పాలన సాగించారన్నారు. ఆయన హాయంలో తెలంగాణకు 71 టిఎంసిల ప్రాజెక్టులు ప్రతిపాదించి పూర్తి చేయలేకపోయారని మంత్రి వేముల విమర్శించారు. వైఎస్ హాయంలో నల్లగొండ జిలా కు శ్రీరాంసాగర్ నుంచి నీళ్ళొచ్చాయా? లేదా కెసిఆర్ హాయంలో వచ్చాయా? అన్న విషయాన్ని తెలంగాణ సమాజం ఆలోచించాలన్నారు. తెలంగాణ ఉద్యమ కారుడిని కనుక తనకు భావోద్వేగం వస్తుందని మంత్రి వేముల అన్నారు. తనను డికె అరుణ బచ్చా అంటోంది ..ఆమెలా సమైక్య పాలకుల మోచేయి నీళ్ళు తాను తాగలేదన్నారు.
కృష్ణా నీళ్లకు హుజురాబాద్ ఉప ఎన్నికకు సంబంధం లేదని విప్ గువ్వల బాలరాజు అన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రాష్ట్రాల మధ్య చిచ్చు పెడుతోందన్నారు. కలహాలు పెట్టి పబ్బం గడుపు కోవాలనుకునే పార్టీ బిజెపి అని ఆయన మండిపడ్డారు. ఆ పార్టీ ట్రాప్‌లో .జగన్ పడొద్దు అని సూచించారు. నీటి దోపిడీకి పాల్పడ్డ వైఎస్ ముమ్మాటికి గజదొంగే అని వ్యాఖ్యానించారు. కృష్ణా జలాల సాధన కోసం అవసరమైతే కెసిఆర్ మరోసారి ఉద్యమకారుడి అవతారమెత్తుతారన్నారు. .తెలంగాణ సస్య శ్యామలం కావడం ఇష్టం లేకనే జగన్ అక్రమ ప్రాజెక్టులు మొదలు పెట్టారని శాసనసభ్యుడు మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు. జగన్ తప్పటడుగులు వేస్తే చంద్రబాబుకు పట్టిన గతే పడుతుందన్నారు. జగన్‌కు టిఆర్‌ఎస్ స్నేహ హస్తం ఇస్తే ఆయన ద్రోహ హస్తం ఇచ్చారని మండిపడ్డారు.