Monday, November 18, 2024

ఆరోవంతు ఓట్లు సాధించక పోతే.. డిపాజిట్ గల్లంతే

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్ర శాసనసభ సార్వత్రిక ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులు వారు చెల్లించే డిపాజిట్ సొమ్ము తిరిగి పొందాలంటే.. పోలైన ఓట్లలో ఆరో వంతు (16 శాతం) ఓట్లను పొందాల్సి ఉంటుంది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు చాలా అభ్యర్థులు నామినేషన్లు వేస్తారు. కొన్ని నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీ అభ్యర్ధులకు తప్ప మిగిలిన అభ్యర్ధులు ఎవరికి డిపాజిట్లు కూడా రాలేదు అని చెబుతుంటారు. ఇంతకీ డిపాజిట్ అంటే ఏమిటి? డిపాజిట్ కోల్పోకుండా ఉండాలంటే అభ్యర్థికు ఎన్ని ఓట్లు రావాలి? డిపాజిట్ కోల్పోతే ఏమి నష్టపోతారు?అనే విషయాన్ని ఎక్కువగా చర్చించుకునే అంశం. నామినేషన్లు వేసినప్పుడు అభ్యర్ధులు కొంత నగదును ఎన్నికల సంఘానికి చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. ఈ డబ్బును ఎన్నికల ఫలితాలు విడదల అనంతరం అభ్యర్థులకు తమ ధరావతు డబ్బులు తిరిగి వస్తే అది గౌరవప్రదమైన ఓటమిగా లెక్కిస్తారు. అదే ఆ డబ్బులు తిరిగి రాకపోతే అభ్యర్థి డిపాజిట్లు కోల్పోయాడని భావిస్తారు.

ఎన్నికల సంఘం శాసనసభ ఎన్నికలకు రూ.10 వేలు ధరావతు నిర్ణయించింది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు మాత్రం రూ.5 వేలు సరిపోతుంది. ఈ మొత్తాన్ని నామపత్రం దాఖలు చేసే సమయంలో రిటర్నింగ్ అధికారి వద్ద డిపాజిట్ చేయాలి. ఈ మొత్తాన్ని ఆర్‌ఓ ఖజానా శాఖలో తెరచిన ప్రత్యేక ఖాతాలో జమ చేస్తారు. నియోజకవర్గం నుంచి పోటీ చేసిన అభ్యర్థి మొత్తం పోలైన ఓట్లలో ఆరో వంతు(16 శాతం) ఓట్లను పొందాల్సిన అవసరం ఉంటుంది. ఉదాహరణకు ఓ నియోజక వర్గంలో 1000 ఓట్లు వేశారనుకుంటే 160 ఓట్లు కంటే ఎక్కువగా సాధించాల్సిన అవసరం ఉంటుంది. 16 శాతం కంటే ఎక్కువ ఓట్లు వస్తే డిపాజిట్ గా చెల్లించిన డబ్బులను తిరిగి ఇచ్చేస్తారు. లేనిపక్షంలో ఎన్నికల సంఘం స్వాధీనం చేసుకుంటుంది.

2018లో 1569 మంది అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతు..
రాష్ట్రంలోని 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 119 నియోజకవర్గాలకు 1821 మంది పోటీ చేశారు. అందులో 1569 మంది అభ్యర్థులు తమ డిపాజిట్ని కోల్పోయారు. 252 మంది ధరావతును తిరిగి పొందారు. శుక్రవారం నుంచి నామినేషన్లు ప్రక్రియ ప్రారంభం అయ్యాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియలో నామపత్రాలు దాఖలు చేనినప్పటి నుంచి అభ్యర్దుల వ్యక్తిగత వివరాల పరిశీలన, ఇవిఎంలపై గుర్తుల కేటాయింపు, సర్వీస్ ఓటర్లకు బ్యాలెట్ పేపర్లపై గుర్తులను ముద్రించడం.. తదితర విషయాలపై అధికారులు దృష్టి పెడతారు. అభ్యర్థికి సంబంధించిన ప్రచార ఖర్చులు, ప్రతి కదలికపై ఎన్నికల సంఘం నియమించిన ప్రత్యేక బృందాలు నిశిత పరిశీలన చేస్తాయి. అభ్యర్ధులు ఏదో సరదాకి పోటీ చేస్తే.. ఎన్నికల సంఘానికి అనవసరమైన ఖర్చు పెరుగుతుంది. దీంతో పాటు అధికారులు విలువైన సమయం వృథా అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఎన్నికల సంఘం పోటీ చేసే అభ్యర్థులు నుంచి షరతులతో కూడిన సెక్యూరిటీ డిపాజిట్లను స్వీకరిస్తోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News