నిజామాబాద్ సభలో జెపి నడ్డా
మన తెలంగాణ/నిజామాబాద్ బ్యూరో: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపికి అధికారం అప్పగిస్తే తెలంగాణలో ప్రగతిని పరుగులు పెట్టిస్తామని బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా హామీ ఇచ్చారు. గురువారం నిజామాబాద్ నగరంలోని గిరిరాజ్ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. మోడీ హయాంలో పదేళ్లలో దేశం అన్ని రంగాల్లో గొప్ప పురోగతి సాధించిందని ప్రపంచంలోనే తిరుగు లేని శక్తిగా ఎదిగిందని ఆయన పేర్కొన్నారు.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ ఐదో స్థానానికి చేరిందన్నారు. తెలంగాణలో బిజెపి అధికారంలోకి వస్తే పేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇస్తామని భరోసా ఇచ్చారు. అయుష్మాన్ భారత్‌తో పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలు అంది స్తామని ఆయన భరోసా ఇచ్చారు. రైతులకు అన్ని రకాలుగా చేయూతనిస్తామని, జిల్లాలో పసుపు రైతుల ప్రయోజనాల కోసం ఇచ్చిన మాట మేరకు పసుపు బోర్డు మంజూరు చేశామని ఆయన గుర్తు చేశారు. గరీబ్ కల్యాణ్ యోజన కింద 80 కోట్లమందికి రేషన్‌ను పంపిణీ చేస్తున్నామన్నారు. సామాజిక సేవ దృక్పథం ఉన్న ధన్‌పాల్ సూర్యనారాయణను నిజామాబాద్ ఎమ్మెల్యేగా గెలిపిం చాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సభకు నిజామాబాద్ నగరంతో పాటు రూరల్ నియోజక వర్గం నుంచి వేలాది మంది తరలి వచ్చారు.