Sunday, November 24, 2024

రేవంత్ సిఎంగా రాజీనామా చేస్తే…

- Advertisement -
- Advertisement -

నేను సిఎంగా ప్రమాణ స్వీకారం చేసి మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధణ చేసి చూపిస్తా
బ్యారేజీ కుంగడాన్ని ప్రభుత్వం భూతద్దంలో చూపుతోంది
కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక్క మేడిగడ్డ బ్యారేజీ మాత్రమే అనేలా కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడుతోంది
మేడిగడ్డతో కాళేశ్వరం ప్రాజెక్ట్ మొత్తం కుంగిపోయిందనేలా కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు
కాంగ్రెస్ సర్కార్ కుట్ర రాజకీయాలు చేస్తోంది
బిఆర్‌ఎస్ అగ్రనాయకులు, మాజీ మంత్రి హరీశ్‌రావు
మనతెలంగాణ/హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ రిపేర్ సాధ్యమేనని ఇంజనీర్లు చెబుతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే మేడిగడ్డ పునరుద్ధరణ చేయాలని మాజీమంత్రి, బిఆర్‌ఎస్ అగ్రనాయకులు టి.హరీశ్‌రావు డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డికి ఆ పని చేతకాకపోతే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని అన్నారు. రేవంత్‌రెడ్డికి చేతకాదు అని ఒప్పుకుని సిఎం పదవికి రాజీనామా చేస్తే తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధణ చేసి చూపిస్తానని హరీశ్‌రావు సవాల్ విసిరారు. ప్రభుత్వం మేడిగడ్డ పునరుద్ధరణపై దృష్టి పెట్టకుండా రాజకీయాలు చేస్తోందని ధ్వజమెత్తారు.

మేడిగడ్డ బ్యారేజీ కుంగడాన్ని ప్రభుత్వం భూతద్దంలో చూపుతోందని, కాళేశ్వరం ప్రాజెక్ట్ మొత్తం కూలిపోయేలా కాంగ్రెస్ సర్కార్ కుట్ర రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో బుధవారం ఎంఎల్‌ఎలు పాడి కౌశిక్‌రెడ్డి, చింత ప్రభాకర్, బిఆర్‌ఎస్ నాయకలతో కలిసి ఎంఎల్‌ఎ హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీపై దుష్ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక్క మేడిగడ్డ బ్యారేజీ మాత్రమే అనేలా కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడుతోందని మండిపడ్డారు. మేడిగడ్డతో కాళేశ్వరం ప్రాజెక్ట్ మొత్తం కుంగిపోయిందనేలా కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఓ రెండు, మూడు ఎంపి సీట్ల కోసం వరద, బురద రాజకీయాలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు.

కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు వరప్రదాయిని..
కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు వరప్రదాయిని.. రేపటి తెలంగాణ ప్రజలకు కాళేశ్వరం ప్రాజెక్టు జీవధార అని హరీశ్‌రావు పేర్కొన్నారు. ఇవాళ భూముల్లో పెరిగిన ఊటలు, ఉబికివస్తున్న బోరు బావులు కాళేశ్వరం ప్రాజెక్టు ఫలితాలు అని చెప్పారు. కూడవెల్లి, హల్దీవాగు, రంగనాయక సాగర్, కొండపోచమ్మ సాగర్ కింద పచ్చని పంటలు కనబడుతున్నాయంటే అది కాళేశ్వరం ఫలితమే అని పేర్కొన్నారు. నిజానికి కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్లు, 21 పంపు హౌజ్‌లు, 203 కిలో మీటర్ల టన్నెల్స్, 1531 కిలో మీటర్ల గ్రావిటీ కెనాల్స్, 98 కి.మీ. ప్రెజర్ మెయిన్స్, 141 టిఎంసిల సామర్థ్యం కలిగిన రిజర్వాయర్లు.. వీటన్నింటి సమూహమే కాళేశ్వరం అని వివరించారు. ప్రభుత్వం మేడిగడ్డకు ఎంఎల్‌ఎలను తీసుకుపోయినప్పుడు మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్‌ను చూపిస్తే బాగుండేదని వ్యాఖ్యానించారు. కోడిగుడ్డు మీద ఈకలను పీకిన చందంగా, బురద రాజకీయాలకు సిఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మండిపడ్డారు.

గతంలో పిల్లర్లు, బ్యారేజీలు కొట్టుకుపోలేదా?
మేడిగడ్డ బ్యారేజీలో పిల్లర్లు కుంగిపోయినంత మాత్రాన దాని భూతద్దంలో పెట్టి చూపిస్తున్నామని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తం ప్రాజెక్ట్‌ను డ్యామేజ్ చేయాలని దుష్ట పన్నాగానికి రాష్ట్ర ప్రభుత్వం పాల్పడుతోందని విమర్శించారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.తాము ఏ విచారణకైనా సిద్ధమని అసెంబ్లీలో చెప్పామని, దోషులను కఠినంగా శిక్షించాలని చెప్పామని, అయితే వెంటనే పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని కోరామని తెలిపారు. ప్రభుత్వం పునరుద్ధరణ మీద దృష్టి పెట్టకుండా దుష్ట రాజకీయాలకు పాల్పడుతోందని మండిపడ్డారు. గత చరిత్రలో ఇలాంటి ఘటనలు జరగలేదన్నట్టు చేస్తున్నారని విమర్శించారు.

ఉమ్మడి రాష్ట్రంలో 1958లో కడెం ప్రాజెక్టు కట్టగానే గేట్లతో సహా కొట్టుకుపోతే, తిరిగి పునరుద్ధరించారని, తర్వాత 1995లో కట్ట మొత్తం కొట్టుకుపోయిందని చెప్పారు. 1981, 1999లో సింగూరు డ్యాం పాక్షికంగా కొట్టుకుపోయిందని, 2010లో ఎల్లంపల్లి బ్యారేజీ స్పిల్ వే కొట్టుకుపోయిందని, 2004లో సాత్నాల ప్రాజెక్టు హెడ్ రెగ్యులేటర్ కొట్టుకుపోయిందని తెలిపారు. పులిచింతల ప్రాజెక్టు గేట్లు ఇవాళ్టికి కొట్టుకుపోయాయని అన్నారు. కాంగ్రెస్ హయాంలో పంజాగుట్టలో ఫ్లై ఓవర్ కడుతుంటే కూలిపోయిందని, ఆ సంఘటనలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. పోలవరంలో డయాఫ్రేమ్, గైడ్ వాల్స్ కొట్టుకుపోయాయని, కాంగ్రెస్ ప్రభుత్వంలో రాయలసీమలో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయిందని చెప్పారు. ఏదైనా మేజర్ ప్రాజెక్టు నిర్మించినప్పుడు ఇలాంటి ఘటనలు జరిగితే చర్యలు తీసుకుంటారని, రైతాంగానికి నష్టం జరగకుండా పునరుద్ధరణ చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు. కానీ ఈ ప్రభుత్వం కాళేశ్వరం మీద దుష్ప్రచారం చేస్తోందని హరీశ్‌రావు మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News