న్యూఢిల్లీ : వీధి కుక్కలకు రొటీన్‌గా ఆహారం అందించేవారే ఇకపై ఆ కుక్కలు ఎవరినైనా కరిస్తే బాధ్యత తీసుకోవాలని సుప్రీం కోర్టు సూచించింది. వాటికి వ్యాక్సినేషన్ కూడా చేయించాలని ఆదేశించింది. వీధికుక్కల బెడదకు ఒక పరిష్కారం కనుగొనాల్సిన అవసరం ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది. కేరళలో వీధి కుక్కల బెడద తీవ్రంగా ఉందన్న పిటిషన్లపై జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ మహేశ్వరిలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. వీధి కుక్కలను పెంచేవారు స్పెషల్‌గా వాటికి మార్క్ చేయడమో, నెంబర్లు వేయడమో చేయాలని సూచించారు. అవి ఎవరినైనా కరిస్తే వాటికి అయ్యే ఖర్చులకు బాధ్యత తీసుకోవాలన్నారు. వీధి కుక్కలను సంరక్షించడం ఎంత అవసరమో, వాటి బారిన ప్రజలు పడకుండా చూడటం కూడా అంతే అవసరమని ధర్మాసనం పేర్కొంది. ఈ కేసులో తమ వాదనలను వినిపించేందుకు జంతు హక్కుల సంరక్షణ సంస్థలకు అనుమతి ఇస్తూ , తదుపరి విచారణను సెప్టెంబర్ 28కి వాయిదా వేసింది.