Monday, December 23, 2024

బిసిలకు ఉపకోటా కల్పించకపోతే లక్ష మందితో ఎర్రకోట ముట్టడిస్తాం

- Advertisement -
- Advertisement -

సెప్టెంబర్ 19 బిసిలకు పీడదినం
బిసిల నిరసన కార్యక్రమంలో కేంద్రానికి జాజుల హెచ్చరిక
నిరసన దీక్షలకు అఖిలపక్ష నేతల సంఘీభావం

మన తెలంగాణ / హైదరాబాద్ : తాను బిసి వర్గానికి చెందిన వాడినని చెప్పుకుంటూ బిసిలను నమ్మించి మోసం చేసిన ఘనత ప్రధాని నరేంద్ర మోడీకే దక్కిందని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. మహిళా బిల్లు విషయంలో బిసి మహిళలకు ఉప కోటా కల్పించకుండా బిసిలను రాజకీయంగా నరేంద్ర మోడి తడిగుడ్డతో గొంతు కోశాడని దుయ్యబట్టారు. ప్రధాన మోడీ చెప్పినట్లు సెప్టెంబర్ 19 చరిత్రలో మర్చిపోలేని రోజు కాదని దేశంలో బిసిలకు పీడ దినమని ధ్వజమెత్తారు. మహిళా బిల్లులో బిసి మహిళలకు ఉపకోటా కల్పించాలని డిమాండ్ చేస్తూ బిసి సంక్షేమ సంఘం బిసి మహిళా సంఘం ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్, దోమలగూడలోని బిసి భవన్ లో నిరసన దీక్ష చేపట్టారు.

ఈ దీక్షలో జాజుల శ్రీనివాస్ గౌడ్, మహిళా సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ దీక్షకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ పిసిసి మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు మాజీ స్పీకర్ మధుసూదనాచారి, బిసి కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు, సభ్యులు ఉపేందర్, ధర్మసమాజ పార్టీ అధ్యక్షులు విశారదన్ మహారాజ్, సిపిఐ నాయకులు నరసింహ తదితరులు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా జాజుల మాట్లాడుతూ పార్లమెంటులో బిసి మహిళలకు సబ్ కోట కల్పించాలని కేంద్రాన్ని డిమాండ్ చేసిన కాంగ్రెస్ బిఆర్‌ఎస్ పార్టీలకు ధన్యవాదాలు తెలిపారు. మైనారిటీ మహిళలకు స్థానం కల్పించలేదని మహిళా బిల్లును మ.జ్లిస్ ఎంపిలు వ్యతిరేకంగా ఓటు వేసినట్లు అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకంగా ఓటు వేసి ఉంటే కేంద్రం దిగి వచ్చేదని అన్నారు. బిజెపి అంటే బిసి వ్యతిరేక పార్టీగా చరిత్రలో మిగిలిపోతుందన్నారు.

త్వరలోనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్తు ఉద్యమ కార్యచరణ ప్రకటిస్తామని వచ్చే ఎన్నికల్లో బిసి వ్యతిరేక పార్టీలను ఓడిస్తామని శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. పిసిసి మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ నరేంద్ర మోడీని బిసి ప్రధాని అని చెప్పుకోవడానికి సిగ్గనిపిస్తుందని అన్నారు. బిసిలకు ఏమీ యేయని మోడి ప్రభుత్వాన్ని బిసిలు అంతే కలిసికట్టుగా గద్దె దీoపాలని పిలుపునిచ్చారు. బిసి కులగణన, బిసి మహిళలకు సబ్ కోట కాంగ్రెస్ చేసి తీరుతుందని ఆయన తెలిపారు. మాజీ స్పీకర్ మధుసూదనాచారి మాట్లాడుతూ తాను మొదటి స్పీకర్‌గా బిసిలకు రాజకీయ రంగంలో 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తే కేంద్రం పట్టించుకోకపోవడం చాలా దుర్మార్గం అన్నారు.

బిసి మహిళలకు ఉప కోటా పెట్టడం రిజర్వేషన్ కాదని, ఒక సంస్కరణని అన్నారు . బిసి కమిషన్ చైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్ రావు మాట్లాడుతూ దేశంలో వచ్చిన అనేక కమిషన్‌లు బిసి కులగణనను చేసి బిసిలకు జనాభా ప్రకారం చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించాలని చెప్పినా కేంద్రం పెడచెవినపెట్టడం చాలా దురదృష్టకరమని అన్నారు బిసి ఉద్యమానికి బిసి కమిషన్ అండగా ఉంటుందని అన్నారు. ధర్మ సమాజ పార్టీ అధ్యక్షులు విశారదన్ మహారాజు మాట్లాడుతూ దేశంలో 45 కోట్ల మంది మహిళలకు బిసి కోటా పెట్టకుండా బిజెపి ప్రభుత్వం ఉందంటే దొరల స్థానంలో దొరసానుల కూర్చోబెట్టి బిసిలను రాజకీయ సమాధి చేయాలని మోడి ప్రభుత్వం చూస్తుందన్నారు. ఢిల్లీ ప్రభుత్వంపై దండయాత్ర చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిసి కమిషన్ సభ్యులు సిహెచ్ ఉపేంద్ర, బిసి కుల సంఘాల జెఎసి చైర్మన్ కుందారం గణేష్ చారి, నాయకులు విక్రమ్ గౌడ్, కనకాల శ్యామ్, సిద్ధాంతం శ్యామల, జాజుల లింగంగౌడ్, మాధవి, సదానందం, ఈడిగ శ్రీనివాస్, బాలాగోని బాలరాజు, శైలజ, రజనీ, విజయ, వరికుప్పల మధు, నాగరాజు, ఇందిర, రజక మహేష్ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News